News

శ్రీశైలంలో ఘనంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

6views

శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 1,800 మందికి పైగా భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో వ్రతాలను ఆచరించారు.

వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే భక్తులకు ఉచితంగా సమకూర్చింది. ప్రతి భక్తునికి ప్రత్యేకంగా కలశాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. మహాగణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి, శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులతో కలశ స్థాపన చేయించి, వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వరలక్ష్మీ వ్రత కథను పఠించి.. వ్రత విశిష్టత, మహిమను భక్తులకు వివరించారు.

వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ దేవస్థానం తరఫున చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు, కంకణాలతో పాటు తులసి మొక్కను వృక్ష ప్రసాదంగా అందజేశారు. అలాగే ‘శ్రీశైల ప్రభ’ మాసపత్రికను పుస్తక ప్రసాదంగా, మూడు రకాల ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వైదిక సంప్రదాయంలో భాగమని తెలిపారు. ధర్మప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వ్రతాలను ఆచరించడం సంతోషకరమన్నారు.