News

‘హిందువులను సులభంగా చంపొచ్చు’.. బంగ్లాదేశ్‌లో హరున్‌ ఇజార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

18views

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్‌ నేత హరున్‌ ఇజార్‌ మరోసారి వివాదంలోకి వచ్చారు. చిట్టగాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన హిందువులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వైరల్‌ వీడియోలోని వ్యాఖ్యల పూర్తి సందర్భం, ప్రామాణికతపై స్వతంత్ర ధ్రువీకరణ అవసరం ఉంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో హరున్‌ ఇజార్‌.. బంగ్లాదేశ్‌లో హిందువులను సులభంగా చంపగలమని, అందుకు తాను స్వయంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని, తన అనుచరులు ఆ పని చేయగలరని వ్యాఖ్యానించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరీ హరున్‌ ఇజార్‌?
ముఫ్తీ హరున్‌ బిన్‌ ఇజార్‌గా కూడా పిలిచే హరున్‌ ఇజార్‌.. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు చెందిన హెఫాజత్‌-ఎ-ఇస్లాం నేతగా పనిచేశారు. గతంలో ఆ సంస్థ కేంద్ర కమిటీలో విద్యా, సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నట్లు బంగ్లాదేశ్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

2013లో చిట్టగాంగ్‌లోని లాల్‌ఖాన్‌ బజార్‌ మదర్సాలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి హరున్‌ ఇజార్‌పై కేసులు నమోదయ్యాయి. అనంతరం 2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌ పర్యటన సందర్భంగా జరిగిన హింసాత్మక ఆందోళనలకు సంబంధించి కూడా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

2021 ఏప్రిల్‌లో ర్యాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌ (RAB) హరున్‌ ఇజార్‌ను చిట్టగాంగ్‌లోని లాల్‌ఖాన్‌ బజార్‌ మదర్సా నుంచి అదుపులోకి తీసుకుంది. మోదీ పర్యటనకు వ్యతిరేకంగా జరిగిన హింసకు సంబంధించిన కేసుల్లో ఆయనను అరెస్టు చేసినట్లు అప్పటి బంగ్లాదేశ్‌ మీడియా వెల్లడించింది.

2023లో హరున్‌ ఇజార్‌ పలు కేసుల్లో బెయిల్‌ పొందిన అనంతరం జైలు నుంచి బయటకు వచ్చినట్లు ది డైలీ స్టార్ నివేదించింది.

తాజాగా వైరల్‌ అవుతున్న వీడియోతో హరున్‌ ఇజార్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రత, మత సామరస్యంపై చర్చ మొదలైంది.