News

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత మెరుగైన సేవలు

6views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం, రూ.26.50 కోట్లతో నిర్మించిన శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనంలను మంత్రి ఆనం ప్రారంభించారు. మొత్తం రూ.52.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రెండు భవనాల ద్వారా అన్నప్రసాదం, మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలగనుంది.

కనకదుర్గ అన్నప్రసాద సదనంలో ఒకేసారి 800 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించేలా ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో రెండు భవనాల్లో యాంత్రీకృత వంటశాలలను ఏర్పాటు చేసి భక్తులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

భక్తుల సౌకర్యమే ప్రభుత్వం, దేవస్థానం ప్రధాన లక్ష్యమని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఇంద్రకీలాద్రిపై మౌలిక వసతులను నిరంతరం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ‘అన్నదానం మహాదానం’ అనే సనాతన ధర్మ స్ఫూర్తితో ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాన్ని అత్యున్నత ప్రమాణాలతో అందించడమే లక్ష్యమన్నారు.