
అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న భవ్య రామమందిరం పనులు సెప్టెంబరు 30 నాటికి పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆలయ నిర్మాణానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
రామమందిర నిర్మాణంలో భాగస్వాములైన ఎల్‌అండ్‌టీ, టాటా నిర్మాణ సంస్థల ప్రతినిధులు పనులు పూర్తయిన తర్వాత కూడా మరో నెల రోజులపాటు ఆలయ ప్రాంగణంలోనే ఉండి అవసరమైన పనులను పర్యవేక్షిస్తారని మిశ్ర తెలిపారు.
ఇదే సమయంలో ఆడిటోరియం, మ్యూజియం నిర్మాణ పనులు రాజకీయ నిర్మాణ్ నిగమ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
మ్యూజియంలో ప్రదర్శించేందుకు అవసరమైన రాత ప్రతులను ఇప్పటికే సిద్ధం చేసినట్లు నృపేంద్ర మిశ్ర వెల్లడించారు. వీటిని ఐఐటీ మద్రాసు నిపుణుల సహకారంతో వీడియోల రూపంలోకి మార్చనున్నట్లు తెలిపారు. భక్తులు, సందర్శకులకు అయోధ్య రామమందిర చరిత్ర, నిర్మాణ విశేషాలను మరింత ఆకర్షణీయంగా వివరించేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
అలాగే రామాలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీగోడ పనులు డిసెంబరు నాటికి పూర్తవుతాయని ఆయన తెలిపారు. దీంతో ఆలయ ప్రాంగణ అభివృద్ధి పనులు కూడా క్రమంగా తుది దశకు చేరుకోనున్నాయి.





