ArticlesNews

అన్నదానం మహాదానం.. సనాతన ధర్మం చూపిన ఆహార మహత్యం

6views

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని సనాతన ధర్మం చెబుతోంది. జీవుల మనుగడకు ఆహారమే ఆధారం. అందరికీ సరిపడా ఆహారం ఉన్నప్పటికీ, అది ప్రతి ఒక్కరి కంచం వరకు చేరని పరిస్థితి ఉంది. అందుకే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అన్నిటికంటే గొప్ప దానంగా భావించారు మన పూర్వీకులు.

‘అన్నదానాత్‌ పరం దానం న భూతం న భవిష్యతి’ అని మహాభారతం అన్నదాన గొప్పతనాన్ని చాటింది. గతంలోనూ, భవిష్యత్తులోనూ అన్నదానాన్ని మించిన దానం లేదని, సమస్త జగత్తూ అన్నం వల్లే నిలబడుతోందని ధర్మగ్రంథాలు ప్రబోధించాయి.

ఆహారాన్ని ప్రసాదంగా భావించిన ధర్మం
ఆహారం తీసుకునే విషయంలోనూ సనాతన ధర్మం అనేక విలువలను బోధించింది. ఈశావాస్య ఉపనిషత్‌ ‘తేన త్యక్తేన భుంజీతాః’ అంటూ త్యాగబుద్ధితో అవసరమైనంత మాత్రమే స్వీకరించాలని సూచించింది. తైత్తిరీయ ఉపనిషత్‌లోని ‘అన్నం న పరిచక్షీత’ అనే వాక్యం అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ఆహారాన్ని పవిత్రంగా భావించాలని బోధిస్తుంది.

దైవానుగ్రహంతో లభించే అన్నాన్ని ప్రసాదంగా భావించి గౌరవించాలని పురాణాలు చెబుతున్నాయి. ఆహారాన్ని వృథా చేయడం అంటే దైవానుగ్రహాన్ని అగౌరవపరచడమేనన్న భావన కూడా సనాతన సంప్రదాయంలో కనిపిస్తుంది.

అతిథి సేవలో అన్నదానానికి ప్రత్యేక స్థానం
భాగవతంలో వామనుడికి ఆతిథ్యం ఇచ్చిన బలి చక్రవర్తి.. ‘హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో.. ఏమి కావాలన్నా ఇస్తా’ అని చెప్పినట్లు వర్ణన ఉంది. రత్నాలు, రథాలతో పాటు అన్నపానీయాలను ప్రస్తావించడం ద్వారా అతిథికి అన్నం పెట్టి ఆదరించడానికున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.

అతిథి, అభ్యాగతులను ఆదరించి వారి ఆకలి తీర్చడం సనాతన ధర్మం నేర్పిన గొప్ప సంస్కారంగా భావించారు. తమతో పాటు అరణ్యాలకు వచ్చిన వారికి సైతం సక్రమంగా ఆహారం అందించలేకపోతున్నామని ధర్మరాజు బాధపడినప్పుడు పురోహితుడు ధౌమ్యుడు సూర్యారాధనను సూచించినట్లు మహాభారతం చెబుతోంది. సూర్యుడిని భక్తితో ఆరాధించిన పాండవులకు లభించిన అక్షయపాత్ర ద్వారా ఎందరో ఆకలి తీర్చుకున్నారని పురాణగాథ.

త్యాగబుద్ధితో పెట్టిన అన్నమే నిజమైన అన్నదానం
అన్నదానానికి ఆడంబరం కంటే త్యాగబుద్ధి, ఆప్యాయతే ముఖ్యమని చెప్పే కథ మహాభారతంలోని అశ్వమేధ పర్వంలో కనిపిస్తుంది.

ధర్మరాజు అశ్వమేధ యాగం అనంతరం భారీగా అన్నదానం చేశాడు. అయితే ఓ ముంగిస.. ‘సక్తుప్రస్తుడనే పేదవాడు చేసిన అన్నదానంతో ఇది సరితూగదు’ అంటూ ఆక్షేపించినట్లు కథనం. సక్తుప్రస్తుడి ఇంట అతిథి భోజనం చేసిన అనంతరం చేతులు కడిగిన నీటిలో పొర్లడంతో తన శరీరంలో సగం బంగారంగా మారిందని ముంగిస చెబుతుంది. ధర్మరాజు చేసిన భారీ అన్నదానంతో తన శరీరంలోని మిగతా సగం బంగారంగా మారలేదని పేర్కొంటుంది.

పేదరికంలో ఉన్నప్పటికీ సక్తుప్రస్తుడు తనకు ఉన్నదాన్ని త్యాగబుద్ధితో అతిథికి సమర్పించాడన్నదే ఈ కథలోని అంతరార్థం. ఆడంబరంగా పెట్టిన భోజనం కంటే ప్రేమతో, ఆప్యాయతతో, త్యాగభావంతో పెట్టిన అన్నమే గొప్పదని ఇది చెబుతోంది.

అన్నాన్ని వృథా చేయొద్దు
‘అన్నం అరగడియలో అరుగుతుంది.. ఆదరణ శాశ్వతంగా ఉంటుంది’ అనే పెద్దల మాటల్లోనూ ఇదే సందేశం దాగి ఉంది. ఆకలి తీర్చడం ద్వారా మనిషికి ఇచ్చే ఆప్యాయత, గౌరవం చిరకాలం గుర్తుండిపోతాయి.

లోకంలో అన్నాన్ని మించినదేదీ లేదని, అన్నదానం చేసేవారిని చూసి దేవతలు సంతోషిస్తారని పద్మపురాణం పేర్కొంటుంది. అందుకే మనకు లభించిన ఆహారాన్ని వృథా చేయకుండా అవసరమైన వారికి అందించడం అన్నపూర్ణాదేవికి ఇచ్చే గౌరవంగా భావించాలి.

ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టడం కేవలం ఒక దానం కాదు.. మానవత్వాన్ని చాటే మహోన్నత సేవ. అన్నాన్ని గౌరవించడం, వృథా చేయకుండా అవసరమైన వారికి పంచడం ద్వారా అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని సనాతన ధర్మం సందేశమిస్తోంది.