News

తిరుపతిలో “తాళపత్ర గ్రంథాల సంరక్షణ” అంశంపై జాతీయ సదస్సు

4views

 

తిరుపతి : దేశంలో ఇంకా వెలుగులోకి రాని, ప్రచారంలో లేని తాళపత్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయని, వాటిని గుర్తించి సేకరించి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి తెలిపారు.

ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో  తిరుపతిలో “తాళపత్ర గ్రంథాల సంరక్షణ” అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ, భారతీయ విజ్ఞాన సంపదకు తాళపత్ర గ్రంథాలు అమూల్యమైన ఆధారాలని పేర్కొన్నారు.

తాళపత్ర గ్రంథాల పరిరక్షణ, పరిశోధనలో ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ విశేష కృషి చేస్తోందని తెలిపారు. ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తమైన విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా వీసీ రచించిన “భారతదేశంలో లిపిశాస్త్రం”, “తాళపత్ర గ్రంథ శాస్త్ర పరిచయం” అనే నూతన గ్రంథాలను ఆవిష్కరించారు.

సదస్సులో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ తిరుపతి రీజనల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాఘవన్, కన్జర్వేషన్ విభాగాధిపతి అచల్ పాండ్యా, ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ పబ్లిషింగ్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రాథేశ్యాం, రిజిస్ట్రార్ బలభద్ర ఉపాధ్యాయ, వివిధ విభాగాల డీన్లు పాల్గొన్నారు.