
వారణాసి: శివభక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంపొందించేలా వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కాశీ నగరంలోని 55 ప్రధాన కూడళ్లలో ప్రతిరోజూ ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మైకుల ద్వారా శివస్తోత్రాలు ప్రసారం చేయాలని నిర్ణయించింది.
వారణాసి స్మార్ట్ సిటీ ఆడిటోరియంలో మేయర్ అశోక్ కుమార్ తివారీ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథ ఆలయానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది శివభక్తులు, కన్వర్ యాత్రికులు తరలివచ్చే నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడంతో పాటు యాత్రను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిటీ వెల్లడించింది. కన్వర్ యాత్రికుల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే విశ్రాంతి కేంద్రాలను అభివృద్ధి చేసి, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది.
ఇదే సమావేశంలో వర్షాకాలంలో నగరంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కూడా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ స్పష్టం చేసింది.
శివనామస్మరణతో కాశీ వీధులు మారుమోగనున్న ఈ నిర్ణయం శ్రావణ మాసంలో వారణాసికి చేరుకునే లక్షలాది మంది భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.




