
బీబీసీ సీనియర్ జర్నలిస్ట్ రెహాన్ ఫజల్ బీబీసీ యాజమాన్యంపై అత్యంత కీలకమైన ఆరోపణలు చేశారు. ఆరెస్సెస్ కి సంబంధించిన అనేక కథనాల ప్రసారం విషయంలో చాలా జాప్యం చేసిందని, కొన్నింటిని నిలిపివేసిందని, మరి కొన్నింటిని తిరస్కరించిందని కూడా వెల్లడించారు. అలాగే ఆరెస్సెస్ కి సంబంధించిన కొన్ని వార్తలను అడ్డుకునేలా నిర్ణయాలు కూడా తీసుకున్నారన్నారు.
‘డబుల్ చెక్ విత్ సంకేత్ ఉపాధ్యాయ్’ పాడ్‌కాస్ట్‌లో ఫజల్ మాట్లాడుతూ… ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించి ప్రచురణ కోసం సిద్ధం చేసిన కథనాలకు ఎడిటోరియల్ క్లియరెన్స్ లభించని అనేక సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
ఫజల్ పేర్కొన్న ఉదాహరణలలో ఎం.ఎస్. గోల్వాల్కర్ (ఆర్‌ఎస్‌ఎస్ రెండవ సర్ సంఘచాలక్, గురూజీ గోల్వాల్కర్)పై తీసిన డాక్యుమెంటరీ కూడా ఉంది. ముందస్తు అనుమతి లభించినప్పటికీ ఈ డాక్యుమెంటరీ విడుదల ఆలస్యమైందని ఆయన తెలిపారు.
ఫజల్ తెలిపిన వివరాల ప్రకారం… ఈ ఎడిటోరియల్ నిర్ణయాలు ఆ సంస్థకు సంబంధించిన కంటెంట్‌ను నిర్వహించడంలో ఉన్న ఒక వైఖరిని ప్రతిబింబిస్తాయి. ఇవి కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం కాలేదని, ప్రతిపాదించిన కథనాలు ముందుకు సాగకుండా పదేపదే అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే సంఘ్ విషయంలో బీబీసీ ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా బీబీసీ విషయంలో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కానీ.. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ పై వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ చర్చకు తెర లేపినట్లైంది.ఆ సంస్థలోనే ఏళ్ల తరబడి పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎడిటోరియల్ ప్రక్రియలో తన సొంత అనుభవాలను వెల్లడించడంతో ఫజల్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
జర్నలిస్టిక్ ప్రమాణాల కంటే సిద్ధాంతపరమైన ఆలోచనల వల్లే కొన్ని అంశాలపై ఎడిటోరియల్ నిర్ణయాలు ప్రభావితమయ్యాయనే పాత విమర్శలకు ఈ ఆరోపణలు తోడయ్యాయి. ఫజల్ చేసిన వ్యాఖ్యలు బీబీసీ భారత కవరేజ్, దాని ఎడిటోరియల్ ప్రాధాన్యతలపై మళ్లీ చర్చను లేవనెత్తాయి.




