News

మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టం అమలు.. గెజిట్‌లో ప్రచురణ అనంతరం అమల్లోకి

5views

ముంబై : మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం ‘మహారాష్ట్ర మత స్వేచ్ఛ చట్టం–2024’ అధికారిక గెజిట్‌లో ప్రచురితమై, జూలై 30 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు.

ఈ చట్టాన్ని రాష్ట్ర శాసనసభ మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించింది. అనంతరం గవర్నర్, రాష్ట్రపతి ఆమోదాల కోసం పంపగా, రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత అధికారిక గెజిట్‌లో ప్రచురించారు.

కొత్త చట్టం ప్రకారం, మత మార్పిడికి కనీసం రెండు నెలల ముందుగా సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. అలాగే, మత మార్పిడికి గురవుతున్న వ్యక్తి తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇతర సమీప బంధువులకు కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేసే హక్కు కల్పించారు.

బలవంతం, మోసం, ప్రలోభం, తప్పుడు సమాచారం లేదా వివాహం ద్వారా మత మార్పిడికి పాల్పడినట్లు నిర్ధారణ అయితే, గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అదే నేరాన్ని పునరావృతం చేస్తే, శిక్షను పదేళ్ల వరకు పెంచే అవకాశం ఈ చట్టంలో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం, మహారాష్ట్రతో కలిపి ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో మత మార్పిడిని నియంత్రించే ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి.