News

“నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.

45views

రాజస్థాన్ అజ్మీర్‌లో 18 ఏళ్ల ముస్లిం విద్యార్థిని కుల్సుమ్ బానో, బురఖా తీయమన్నందుకు నీట్ పరీక్ష రాయనని చెప్పింది. కుల్సుమ్ బురఖా, దుపట్టా ధరించి ఉంది, ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత భద్రతా సిబ్బంది, స్క్రీనింగ్ సిబ్బంది బురఖాతో లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. అయితే, మతపరమైన దుస్తులు ధరించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అనుమతిస్తుందని, అయినా తనను పరీక్షకు అనుమతించలేదని విద్యార్థిని మీడియాతో అన్నారు. మే 3న పరీక్ష రాసినప్పుడు ఎలా బురఖా, దుపట్టా ధరించి వెళ్లాలో, ఇప్పుడు కూడా నేను అలాగే పరీక్షకు హాజరయ్యానని, ఆ సమయంలో మమ్మల్ని ఎవరూ ఆపలేదని ఇప్పుడు మాత్రం నిరాకరించారని కుల్సుమ్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక ముస్లింగా తన గుర్తింపు కోల్పోవడం కన్నా పరీక్ష వదులుకోవడానికే తాను సిద్ధంగా ఉన్నానని బానో చెప్పారు. ఒక వేళ నేను పరీక్ష రాయాల్సి ఉండి, ఈ దుస్తుల్లో తనను అనుమతించకపోతే, నేను అస్సలు పరీక్ష రాయనని, 18 ఏళ్ల వాళ్లతో ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు అని, నాకు పరీక్ష కన్నా బురఖానే ముఖ్యమని ఆమె చెప్పింది. అయితే, ఈ వివాదం తర్వాత విద్యార్థిని అనుమతించినట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థిని తండ్రి మహమ్మద్ అలీమ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఏ బురఖాను అనుమతించింది, నా కూతురు బురఖా లేకుండా పరీక్ష రాయదు, ఆమె మూడేళ్లుగా దీని కోసం సిద్ధమవుతోంది, నా మే 3వ తేదీన పరీక్ష రాసింది, అప్పుడు కూడా ఆమె బురఖా ధరించే ఉంది. నియమం 18 ప్రకారం, మీరు మీ మతపరమైన దుస్తులను ధరించి పరీక్షకు హాజరు కావచ్చు… ఒక మహిళా సిబ్బందిని పిలిచి, క్షుణ్ణంగా తనిఖీ చేయించి, ఒక తెర వెనుక ఏకాంత ప్రదేశంలో ఆమె బురఖాను తీయించమని మేము వారిని కోరాము, కానీ వారు నిరాకరించారు.’’ అని అన్నారు.