
తమిళనాడు నుంచి పారిపోయి వచ్చి అన్నమయ్య జిల్లా రాయచోటిలో సుదీర్ఘకాలం పాటు మారుపేర్లతో ఉన్న మహమ్మద్ అలీ ఎలియాస్ షేక్ మన్సూర్ ఎలియాస్ విజయ్‌కుమార్, షేక్ అమానుల్లా ఎలియాస్ అబూబకర్ సిద్ధిఖీలు దేశంలోని ఒక మతానికి చెందిన ప్రముఖ నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. బాంబు పేలుళ్లకు పాల్పడి ప్రజల్లో భయాందోళనలు సృష్టించటం ద్వారా భారత్‌లో ‘షరియా’ చట్టం అమలు చేయాలనేది వీరి ఎజెండా అని తెలిపింది.
ఈ కేసులో ప్రధాన కుట్రదారైన అమానుల్లా.. మహమ్మద్ అలీకి ఉగ్రవాద భావజాలం నూరిపోసి, అతణ్ని తన ముఠాలో నియమించుకున్నాడని పేర్కొంది. బాంబుల తయారీపై అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడని చెప్పింది. అమానుల్లా తయారు చేసిన అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థాలను ఎవరికీ అనుమానం రాకుండా రాయచోటిలోని రహస్య ప్రాంతానికి తరలించటంలో మహమ్మద్ అలీదే కీలకపాత్రని స్పష్టం చేసింది. ఈ మేరకు అలీపై విజయవాడలోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో శుక్రవారం అభియోగపత్రం దాఖలు చేసింది. అమనుల్లా పాత్రపై ఫిబ్రవరిలోనే ఛార్జిషీట్ వేసింది. తాజా అభియోగపత్రంలో ప్రధానాంశాలివి.





