News

పాఠశాల కార్యక్రమంలో ‘పాకిస్థానీ పాట’ వివాదం.. ప్రిన్సిపల్‌, ఇద్దరు ఉపాధ్యాయుల అరెస్ట్‌

9views

మహారాష్ట్రలోని ఓ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాకిస్థానీ పాటను ప్రదర్శించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రిన్సిపల్‌తో పాటు ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

బజల్నా జిల్లాలోని పర్టూర్ కిడ్స్ వరల్డ్ పాఠశాలలో గత ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోల్లో విద్యార్థులు పాకిస్థానీ పాటకు నృత్యం చేసినట్లు, అలాగే పాకిస్థానీ ఛాందసవాది ముంతాజ్ ఖాద్రీ ఫొటోను ప్రదర్శించినట్లు నెటిజన్లు ఆరోపించారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే బాబన్‌రావు లోనికర్‌ స్పందించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా పాఠశాల వ్యవహరించిందని ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలను పాఠశాల యాజమాన్యం పూర్తిగా ఖండించింది. కార్యక్రమంలో వినిపించిన పాట పాకిస్థాన్‌కు చెందినది కాదని, టర్కీకి చెందిన ప్రసిద్ధ టెలివిజన్ ధారావాహిక‘ఎర్తుగ్రల్ ఘాజీ’ లోని సంగీతమని పాఠశాల ప్రిన్సిపల్ సిద్ధిఖీ తెలిపారు.

తమ పాఠశాలకు చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు అసలు వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ, వచ్చిన ఫిర్యాదులు మరియు వైరల్ వీడియోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపల్‌తో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరోపణల నిజానిజాలు దర్యాప్తు అనంతరం తేలనున్నాయి.