ArticlesNews

అధికారం తలకెక్కితే….

1kviews

స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన వివిధ పార్టీల కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడిన సంఘటనలు రాష్ట్రంలో ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంట పాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి మణెమ్మ పైన, ఆమె అల్లుడి పైన తీవ్రంగా దాడి చేసి గాయపరచడం, అలాగే ఆత్మకూరు మండలం పడకండ్లలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేయడం, గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమ, న్యాయవాది కిషోర్ లపై దాడి చేయడం, చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండల పరిధిలోని పాడి పేటలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేయడం ఇలా ఒక్క చోటనేమి కడప, గుంటూరు, ప్రకాశం ఇలా అనేక జిల్లాలలో వైకాపా కార్యకర్తలు, వారికి వెన్నుదన్నుగా నిలుచున్న పోలీసులు… రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ మనదేశంలో 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు తీవ్రమైన హింస, వేలాది ప్రాణ త్యాగాలే అధికార మార్పిడికి పునాదిగా ఉంటూ వచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం కూడా మనదేశంలో సుమారు 1995 వరకు అధికార మార్పిడి జరగాలంటే, లేదూ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే తీవ్రమైన హింస తప్పనిసరి అవుతూ ఉండేది, ఆ తర్వాతి కాలంలో అది క్రమంగా తగ్గుముఖం పడుతూ శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి.

అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ ఆగడాలు చూస్తుంటే “మళ్లీ మనం వెనకటి రోజుల్లోకి వెళ్తున్నామా?” అనిపిస్తోంది. అదే గనుక మొదలైతే ఆ రక్తపాతానికి, హింసకు అంతే ఉండదు. బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలను పక్కన పెడితే మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం తక్కువనే చెప్పవచ్చు. కానీ ఇప్పుడు తాజాగా ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నం అవుతున్నట్టు?

ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏరి కోరి ఎంచుకున్న అనుచరగణం, మంత్రులు, ఎమ్మెల్యేల దుందుడుకు, దౌర్జన్య పూరిత మనస్తత్వం గురించి మొదటినుంచి భయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వివిధ సందర్భాలలో వారి వైఖరి రాష్ట్ర ప్రజల భయాలు, ప్రతిపక్షాల ఆరోపణలు నిజం అని ఋజువు చేస్తున్నాయి.

పార్టీ ఏదైనా, ఇలాంటి ప్రమాదకర పోకడలు ఎవరికీ లాభం చేకూర్చవు. ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే, ప్రత్యర్థులపై అన్ని విధాలా దాడులకు పూనుకుంటే రేపు ఒకరోజు అధికారం మారదా? ప్రత్యర్థులు అధికారంలోకి రారా? వారూ మీలాగే ప్రవర్తిస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజాస్వామ్యమే కదా?

ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ప్రశ్నించే గొంతుక ఉండాల్సిందే. ఉంటుంది కూడా. అధికారం చేతులు మారొచ్చు. అంత మాత్రాన ప్రజాస్వామ్య విలువలు మారకూడదు. ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించే గొంతుక ఏదైనా అది వినిపిస్తూ ఉండాల్సిందే. ఆ గొంతుకను ఇప్పటి అధికార పక్షం గౌరవిస్తేనే రేపు అధికారం అవతలి పక్షం హస్తగతమైనా ఆ ప్రశ్నించే గొంతుక, హక్కు ద్వారా మాత్రమే ప్రజల సంక్షేమాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించగలరు ఎవరైనా.

అలా కాదని ఆ గొంతుకను నొక్కేదామని, అసలు పోటీయే లేకుండా చేసుకుందామని అధికార వర్గాలు ప్రయత్నిస్తే అది వికటించి ఎదురు తిరగక మానదు. ప్రశ్నించే గొంతుక ఉంటేనే అధికారపక్షం తన పనితీరుని మెరుగుపరచుకోగలుగుతుంది. దానిద్వారా మరింత గొప్పగా ప్రజామోదాన్ని సంపాదించుకోగలుగుతుంది.

అంతే కాదు అధికారంలో ఉన్నవారు ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది. మనం వేప విత్తితే వేపే మొలకెత్తుతుంది. మామిడి విత్తితే మామిడే మొలకెత్తుతుంది. పాలకులు ధర్మ బద్ధంగా పాలిస్తే ప్రజల హృదయాలలో  ఉన్నతులుగా, ప్రజా నాయకులుగా, శ్రీ రామచంద్రులుగా నిలచిపోతారు. అందుకే రామరాజ్యం, రాముడు ఆదర్శ పాలనకు, వ్యక్తిత్వానికి నేటికీ ప్రతీకలుగా నిలచిపోయారు. అదే ప్రజలను తమ విధానాలతో భయభ్రాంతులను చేస్తే ప్రజలు వారిని రావణాసురుడి వారసులుగా గుర్తించి ఆ విధంగానే గుర్తు పెట్టుకుంటారు.

తన అధికార బలంతో ప్రత్యర్థులను అణచివేయాలని అధికార పక్షం ప్రయత్నిస్తే ప్రత్యర్థుల బలం నిస్సందేహంగా మరింత పెరుగుతుంది. వారికి ప్రజామోదం పెరుగుతుంది. అణచివేత కారణంగా వారు చేసే ఆక్రందనలు, ఆర్తనాదాలు పెరిగిన బలంతో గర్జనలుగా మారుతాయి.  ఆ గర్జనలలో, వారి పద ఘట్టనలో ఎంతటి అధికార దుర్మదాంధులైనా బెంబేలెత్తి పోవాల్సిందే. చరిత్రలో కలసి పోవాల్సిందే. తస్మాత్ జాగ్రత్త.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.