News

షికాగోలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ

5views

అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో స్వామి వివేకానందుడి విగ్రహాన్ని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఘనంగా ఆవిష్కరించారు. భారతీయ ఆధ్యాత్మికత, సనాతన ధర్మ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.

ఈ విగ్రహం ప్రవాస భారతీయుల సహకారంతో కానుకగా ఏర్పాటు చేయబడినట్లు రాయబారి తెలిపారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, “స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వకారణం. మా ప్రవాస భారతీయుల నుంచి అందిన ఈ అమూల్యమైన కానుక ఆయనపై ఉన్న భక్తి, గౌరవానికి నిదర్శనం. సేవ, సామరస్యత, మానవతా విలువలపై స్వామిజీ అందించిన సందేశం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తోంది” అని పేర్కొన్నారు.

ప్రపంచ మత మహాసభలో హిందూ ధర్మ వైభవాన్ని చాటిచెప్పిన స్వామి వివేకానందుడి స్ఫూర్తి భారతీయ యువతకు మార్గదర్శకంగా నిలుస్తోందని, ఆయన ఆలోచనలు విశ్వమానవ సంక్షేమానికి దిక్సూచిగా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా పలువురు ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు.

షికాగోలో స్వామి వివేకానందుడి విగ్రహం ఏర్పాటు కావడం భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ సందేశం ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడానికి దోహదపడుతుందని భారతీయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.