
( జూన్ 10 – పొణకా కనకమ్మ జయంతి )
స్వాత్రంత్య పోరాటంలో భారతీయ మహిళలు కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సమర రంగాన దూకేందుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అలాంటి సమర యోధుల్లో నెల్లూరుకు చెందిన పొణకా కనకమ్మ ఒకరు. స్వాతంత్ర్య సమరయోధురాలిగా, విద్యావేత్తగా, రచయిత్రిగా, సంఘసేవకురాలిగా, మహిళా సాధికారతకు ప్రతీకగా ఆమె జీవితం నిలిచింది. ముఖ్యంగా సామాజిక కోణంలో పరిశీలిస్తే, ఆమె చేసిన సేవలు నేటికీ ఆదర్శప్రాయంగా కనిపిస్తాయి.
పొణకా కనకమ్మ నందన సంవత్సరం జ్యేష్ట పౌర్ణమి శుక్రవారం నాడు, ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం 1892 జూన్10న నెల్లూరు జిల్లా మినగల్లులో జన్మించారు. తల్లి పేరు రావమ్మల, తండ్రి పేరు మరుపూరు కొండారెడ్డి. వీరిది ధనిక భూస్వామ్య కుటుంబం. పొణకా కనకమ్మకు 9వ ఏటే తన మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది. పుట్టిల్లు, అత్తిల్లు కూడా ధనికులే. సంపన్న కుటుంబంలో పుట్టి, పెరిగినప్పటికీ తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారు. బాల్యంలోనే వివాహం జరిగినప్పటికీ విద్య పట్ల ఉన్న ఆసక్తిని వదలకుండా స్వయంకృషితో తెలుగు, సంస్కృతం, హిందీ భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. మహిళలు కూడా విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పొణకా కనకమ్మ తన జీవితంతో నిరూపించారు.
మహిళా విద్యాభివృద్ధి కోసం కనకమ్మ చేసిన కృషి అపారమైనది. బాలికల విద్య సమాజాభివృద్ధికి మూలాధారమని భావించి, 23 ఎకరాల భూమిని దానంగా ఇచ్చి ‘కస్తూరిదేవి విద్యాలయం’ స్థాపించారు. ఆ కాలంలో మహిళల విద్యను నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లో ఆమె చేసిన ఈ ప్రయత్నం ఒక సామాజిక విప్లవమే. విద్యావంతులైన మహిళలే కుటుంబాన్నీ, సమాజాన్నీ మార్చగలరనే నమ్మకంతో ఆమె ఈ విద్యాసంస్థను అభివృద్ధి చేశారు.
సమాజంలో చైతన్యం పెంపొందించడానికి గ్రంథాలయోద్యమాన్ని కూడా ప్రోత్సహించారు. 1913లో వివేకానంద గ్రంథాలయాన్ని స్థాపించి ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు కృషి చేశారు. గ్రామీణ ప్రాంతాలలో జ్ఞాన వ్యాప్తి కోసం గ్రంథాలయాలు అవసరమని ఆమె విశ్వసించారు. అలాగే ‘సుజనరంజనీ సమాజం’ ద్వారా సాంస్కృతిక, సామాజిక, జాతీయ చైతన్య కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో సామాజిక బాధ్యతను పెంపొందించారు.
మహిళల పాత్ర ఇంటికే పరిమితం కాదని కనకమ్మ బలంగా నమ్మారు. “స్త్రీలు సంకల్పిస్తే రాజ్యాంగాన్నే శాసించగలరు” అనే ఆమె అభిప్రాయం మహిళా సాధికారతకు ప్రతీక. కాంగ్రెస్ కార్యకలాపాలలో ఆంధ్ర ప్రాంతం నుండి పాల్గొన్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించడం ద్వారా మహిళలు కూడా జాతీయ ఉద్యమాలలో సమాన భాగస్వాములు కావచ్చని నిరూపించారు. ఖాదీ ఉద్యమం, స్వదేశీ భావన, గ్రంథాలయోద్యమం, మహిళా విద్య, సామాజిక సంస్కరణలు వంటి అనేక రంగాలలో ఆమె సేవలు సమాజానికి కొత్త దిశను చూపించాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, ఆస్తులు కోల్పోయినా, కుటుంబ సభ్యులను కోల్పోయినా ఆమె సమాజ సేవను విడిచిపెట్టలేదు. అదే ఆమె వ్యక్తిత్వ మహోన్నతికి నిదర్శనం. పొణకా కనకమ్మ 1963 సెప్టెంబరు 15న తుదిశ్వాస విడిచారు.
పొణకా కనకమ్మ జీవితం మహిళా శక్తికి, సామాజిక బాధ్యతకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. సమాజ మార్పు కోసం ఒక మహిళ ఎంతటి ప్రభావాన్ని చూపగలదో ఆమె జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయక సందేశాన్ని అందిస్తోంది. పొణకా కనకమ్మ జ్ఞాపకార్థం 2021 మార్చి 8వ తేదీన తపాలాశాఖ ప్రత్యేక కవరును ముద్రించి గౌరవించింది. ఈమె చిత్రాన్ని అందమైన చట్రంలో ముద్రించారు. శాంత గంభీరంగా తేజస్సుతో కనిపిస్తుందీమె చిత్రం.




