News

ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహం..

52views

భారత్‌తో సాంస్కృతిక దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందూ ధర్మరక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కు గౌరవ సూచకంగా ఇజ్రాయెల్‌లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ చర్యను భారత్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న స్నేహబంధానికి, పరస్పర గౌరవానికి ప్రతీకగా భావిస్తున్నారు.

ఈ విషయాన్ని ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్ వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

శివాజీరాజ్యాభిషేక దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన యానివ్ రెవాచ్, “ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నందుకు గర్వంగా ఉంది. మహారాజ్ గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ స్మారక చిహ్నం ఏర్పాటుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహకారం కోరగా, ఆయన వెంటనే మద్దతు తెలిపారు. జై భవానీ.. జై శివాజీ” అని పేర్కొన్నారు.

భారత్, ఇజ్రాయెల్ దేశాల చరిత్రలో అనేక సారూప్యతలు ఉన్నాయని, తమ మాతృభూమి, సంస్కృతి, స్వీయ గుర్తింపును కాపాడుకునేందుకు రెండు దేశాల ప్రజలు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. శివాజీ మహారాజ్ విగ్రహం భారతీయులు, ఇజ్రాయెల్ ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ప్రకటనపై స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా వచ్చిన ఈ శుభవార్తను స్వాగతించారు. చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ జెరూసలేం పర్యటన అనంతరం భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని యానివ్ రెవాచ్ పేర్కొన్నారు. వాణిజ్యం, సాంకేతికత, భద్రతతో పాటు సాంస్కృతిక రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సహకారం విస్తరిస్తోందని తెలిపారు.

ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు నిర్ణయం, ప్రపంచవ్యాప్తంగా హిందూ వీరుల వారసత్వానికి లభిస్తున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం భారత్-ఇజ్రాయెల్ స్నేహ సంబంధాల్లో మరో చారిత్రాత్మక అధ్యాయంగా నిలవనుంది.