News

ప్రాచీన సంస్కృతులు ప్రకృతిని పవిత్రంగా చూశాయి : శ్రీశ్రీ రవిశంకర్‌

6views

ప్రజల మానసిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రూపొందించే ఏ విధానమూ సమర్థంగా పనిచేయదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ అన్నారు. మంచి విధానాలు ఉన్నప్పటికీ.. వాటిని అమలు చేయాలంటే ప్రజల్లో ఏకాభిప్రాయాన్ని సాధించి వారి అంతరంగాన్ని ప్రేరేపించాలని చెప్పారు.

‘‘మన అంతర్గత, బాహ్య ప్రపంచానికి మధ్య ఓ లోతైన, అందమైన అనుబంధం ఉంది. మనం వాతావరణ మార్పు, సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాం. కానీ.. ఈ అన్ని ప్రయత్నాలను కలిపి ఉంచే అదృశ్య బంధాన్ని తరచూ విస్మరిస్తుంటాం. అదే మానవ మనసు. ఈ భూమిపై ప్రతి ముగ్గురిలో ఒకరు డిప్రెషన్‌తో బాధపడుతున్నప్పుడు.. ప్రకృతిని నిజంగా ఎలా సంరక్షించగలరు?ఒత్తిడి, భయం, అత్యాశ కమ్ముకున్న మనసు.. భూమి అవసరాల పట్ల సున్నితంగా ఉండలేదు.

ప్రజలు మానసికంగా బలంగా ఉంటూ వారి హృదయాలు తెరుచుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పుడు సహజంగానే పర్యావరణం పట్ల మరింత సున్నితంగా మారతారు. విశ్వాసం, ఆధ్యాత్మికత, అంతరంగ శాంతి.. ఇవే వాతావరణ చర్యలకు ప్రేరణనిచ్చే బలమైన పునాదులు. ఇవి లక్షలాది మందిని ఈ పవిత్ర లక్ష్యం కోసం ఏకం చేయగలవు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన సంస్కృతులు ప్రకృతిని పవిత్రంగా చూశాయి. నదులు కేవలం నీటి ప్రవాహాలు కాదు.. దేవతలు. చెట్లు కేవలం కలప కాదు.. అవి పవిత్ర జీవరూపాలు. ప్రజలు పర్యావరణాన్ని ఏదైనా విధానంతో కాకుండా ప్రేమ, భక్తితో రక్షించేవారు. ఆ భావాన్ని మళ్లీ మేల్కొలపాల్సిన అవసరముంది. వ్యక్తిగతంగా మనం తక్కువ చేయగలిగినా, అందరూ కలిసొస్తే సమాజాలు పర్యావరణ పరిరక్షణలో గొప్ప ప్రభావాన్ని సృష్టించగలవు. భారత్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ దిశగా గ్రామీణ స్థాయిలో సమాజాలతో కలిసి పనిచేస్తోంది. ఐదు రాష్ట్రాల్లో 75కు పైగా నదులు, ఉపనదులను పునరుజ్జీవింపజేస్తున్నాం. స్థానిక సమాజాల సహకారంతో వేలాది భూగర్భ జల రీఛార్జ్ నిర్మాణాలు ఏర్పాటు చేశాం. భూసర్వేలు నిర్వహించాం. వేగంగా పెరిగే, అధికంగా నీటిని పీల్చుకునే జాతుల బదులుగా నేలను పునరుద్ధరించే రావి, మామిడి వంటి 10 కోట్లకు పైగా స్వదేశీ చెట్లను నాటాం. ఫలితంగా పక్షులు తిరిగి రావడం ప్రారంభించాయి.

రైతుల ఆత్మహత్యల విషాద వార్తలకు ప్రసిద్ధి చెందిన విదర్భ ప్రాంతంలో మా స్వచ్ఛంద సేవకులు వేలాది మంది రైతులకు సహజ వ్యవసాయ పద్ధతులు, ధ్యానం, శ్వాసాభ్యాసాలు, ఆనందంగా జీవించడం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. దీని ప్రభావం ఎంతగానో ఉండడంతో, గత సంవత్సరం వెయ్యి మంది రైతులు బెంగళూరులోని మా ఆశ్రమానికి వచ్చి తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. వారిలో చాలామంది ఇప్పుడు విషపూరిత రసాయనాల భారంలేకుండా నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. ప్రజలు మానసికంగా, ఆధ్యాత్మికంగా శక్తిమంతులైనప్పుడు వారు భూమికి నిజమైన సంరక్షకులుగా మారుతారు. మనమందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. భూమిని ఎంతవరకు దోపిడీ చేయాలనుకుంటున్నాం? ఎంతవరకు సంరక్షించాలనుకుంటున్నాం? రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ప్లాస్టిక్, విషపూరిత ఎరువులు, రసాయనాలతో భూమిని కలుషితం చేయకుండా చూసుకోవాలి. మనమంతా కలసి పర్యావరణ చైతన్యంతో జీవించే దిశగా అడుగులు వేస్తే.. అదే మనం భూమికి అందించగల అత్యున్నత కానుక’’అని శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్కొన్నారు.