
ఏలూరు జిల్లా పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ రైతు పొలంలో విత్తన బంతులు తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు రైతులకు విత్తన బంతులు తయారీ విధానం, వాటి వినియోగం మరియు ప్రాముఖ్యతపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు.
గోమయం మరియు మట్టి మిశ్రమంతో తయారు చేసే ఈ సీడ్ పెలెటైజేషన్ బాల్స్ విత్తనాలను పక్షులు, చీమలు వంటి హానికర ప్రభావాల నుంచి రక్షించడమే కాకుండా, నేలలో తేమను నిల్వ ఉంచి మొలకెత్తే సామర్థ్యాన్ని పెంచుతాయని నిర్వాహకులు వివరించారు. అదేవిధంగా, ఇవి రైజోబియం వంటి సహజ సూక్ష్మజీవులు మరియు జీవ ఎరువులకు వాహకంగా పనిచేసి విత్తనాల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను నేరుగా వేర్ల ప్రాంతానికి అందిస్తాయని తెలిపారు. దీని వల్ల ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు తోడ్పాటు లభిస్తుందని రైతులకు అవగాహన కల్పించారు.

అనంతరం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ పర్యవేక్షణలో ఎటీఎం (ATM) మోడల్ కార్యకలాపాలను పరిశీలించారు. అలాగే భోగాపురం గ్రామానికి చెందిన రైతు తిరుపతి ఏర్పాటు చేసిన నవధాన్యాలు కంపోస్ట్ బ్లాక్‌ను సందర్శించి పరిశీలించారు.
తదుపరి అమ్మపాలెం గ్రామంలో మెంటర్ ఎఫ్‌ఎస్‌ఎల్‌ల ఆధ్వర్యంలో 55 మంది రైతులతో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించగా, ఆ కార్యక్రమాన్ని కూడా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ మాట్లాడుతూ, “సీడ్ బాల్ పెలెటైజేషన్ మరియు PMDS (నవధాన్యాలు) పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి భూసారాన్ని పెంచి పంటల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రైతుల ఖర్చులను తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి” అని తెలిపారు.




