ArticlesNews

500 ఏళ్లుగా శాకాహారుల గ్రామం.. చిలం

41views

అనగనగా ఒక విభిన్నమైన ఊరు. దానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే, అక్కడి ప్రజల్లో 95 శాతం మంది శాకాహారులే. మేక మాంసం, కోడి మాంసం, గుడ్లు వడ్డించే చోట్లకు వీళ్లు అస్సలు వెళ్లరు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు తమ ఆహారం, నీటిని తామే తీసుకెళ్తారు. కోడి ఈకను తాకడాన్ని కూడా ఈ గ్రామస్థులు పాపంగా భావిస్తారు. ఒకవేళ కోడిని తాకితే, వెంటనే స్నానం చేస్తారు. ఇప్పటికీ ఈ గ్రామ జనాభాలో అత్యధికులు వెల్లుల్లి, ఉల్లిపాయలు తినరు. ఇంతకీ ఈ శాకాహారుల గ్రామం ఎక్కడుంది? ఈ ఊరిలోని ప్రజలు గత కొన్ని శతాబ్దాలుగా శాకాహారులుగానే ఎందుకు ఉంటున్నారు? దీనిపై గ్రామంలోని కొత్త తరం యువత ఏమంటున్నారు? అనేది తెలియాలంటే ఈ కథనాన్ని కడదాకా చదవాల్సిందే.

ప్రతి ఇంటా శాకాహారమే – కారణమిదీ!
బిహార్‌లోని గయా జిల్లాలో చిలం గ్రామం ఉంది. దీన్ని స్థానికులంతా శాకాహారుల గ్రామం, సత్సంగీల గ్రామం అని పిలుస్తుంటారు. ఇక్కడ దాదాపు 300 కుటుంబాలు తరతరాలుగా నివసిస్తున్నాయి. గ్రామంలో 2,000 జనాభా ఉంది. గ్రామస్థులు శివగురువు ఉద్యమం, గాయత్రి పరివార్, బాబా జై గురుదేవ్‌‌ల బోధనలను అనుసరిస్తుంటారు. ఆధ్యాత్మిక ప్రగతికి, జీవకారుణ్యానికి శాకాహారమే ఉత్తమ మార్గమని ఈ ముగ్గురూ బలంగా బోధించారు.

శివుడిని గురువుగా స్వీకరించిన ప్రతి ఒక్కరూ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని శివగురువు ఉద్యమం చెబుతోంది. గాయత్రి మంత్రం సాధన చేసేవారు మాంసాహారం, మద్యం, పొగాకు వంటివి వదిలేయాలని గాయత్రి పరివార్ ఉద్యమం చెబుతోంది. మాంసం తినడం ఒక పెద్ద నేరం, పాపమని బాబా జై గురుదేవ్‌‌ బోధించారు. ఈ బోధనల ప్రభావం వల్లే చిలం గ్రామంలోని 95 శాతం కుటుంబాలు మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోరు. ఆయా కుటుంబాల వారు మేక మాంసం, కోడి మాంసం, గుడ్లు అస్సలు తినరు. వాటిని వండే, వడ్డించే చోట్లకూ వెళ్లరు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు తమ ఆహారం, నీటిని తామే తీసుకెళ్తారు. 5-10 సంవత్సరాల క్రితం వరకు ఈ ఊరిలో ఎవ్వరూ ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా తినేవారు కాదు. ఇటీవలి సంవత్సరాల్లో కొత్త తరంలోని కొంతమంది యువకులు వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం ప్రారంభించారు.

రాజు ఆదేశం – ప్రజల్లో మార్పు
పురాణాల ప్రకారం, కోల్, భిల్ తెగలు అరణ్య సంస్కృతికి రక్షకులు. వీరు తమను తాము రామాయణంలోని శబరి వంశస్థులుగా భావిస్తారు. మధ్యయుగ కాలం (క్రీ.శ. 500- క్రీ.శ. 1500)లో బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కోల్, భిల్ తెగలు చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. వీరు పెద్ద పెద్ద సామ్రాజ్యాల్లా కాకుండా, కొన్ని గ్రామాల సమూహాన్ని కలిపి ఒక ‘గఢ్’ (చిన్న కోట)లా నిర్మించేవారు. ప్రతి గఢ్‌కు ఒక తెగ నాయకుడు రాజుగా ఉండేవాడు. బిహార్‌లోని గయా జిల్లా చిలం గ్రామాన్ని కోల్ భిల్ రాజులు పాలించారు. వాళ్ల పాలనాకాలంలోనే ఈ ఊరికి చిలమ్ గఢ్ అనే పేరును పెట్టారు. ఈ ఊరిలో ఒక పురాతన కోట శిథిలాలు నేటికీ ఉన్నాయి. దాదాపు 500 సంవత్సరాల క్రితం గ్రామాన్ని పాలించిన కోల్ భిల్ రాజు ఇకపై రాజ్యంలో జీవహింస జరగకూడదని ఆదేశించారు. ఆ రాజు శాకాహారిగా మారడమే కాకుండా, తన కోట (గఢ్) పరిధిలోని ప్రజలంతా సాత్విక ఆహారాన్నే తినాలని నిర్దేశించారు. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినొద్దని ఆ రాజు తేల్చి చెప్పారు. దీంతో చిలం గ్రామ ప్రజలంతా శాకాహారులుగా మారిపోయారు.

ఊరికి ‘చిలం’ అనే పేరు ఎలా వచ్చింది?
చిలం గ్రామానికి ఆ పేరు రావడానికీ ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఒకప్పుడు ఈ ఊరి ప్రజల్లో ఎక్కువ మంది చిల్లం అనే సంప్రదాయ ధూమపాన సాధనాన్ని వినియోగించేవారు. చిల్లం అంటే మట్టి, మెత్తటి రాయితో శంఖాకారంలో నిలువుగా తయారు చేసిన ఒక గొట్టం అని అర్థం. ఈ గొట్టం పైభాగంలో పొగాకు లేదా గంజాయి వంటి మూలికలను నింపి, నిప్పు కణికలను ఉంచుతారు. గొట్టం కింది భాగం నుంచి నోటి ద్వారా పొగను పీల్చుకుంటారు. ఈ ధూమపాన సాధనం వల్లే ఈ గ్రామానికి చిలం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

’60 ఏళ్లుగా అన్నం తినలేదు’
“మా ఊరిలో 99 శాతం మంది ప్రజలు మత విశ్వాసం కలిగిన వారు. ఇక్కడ అగ్రవర్ణాలైనా, నిమ్నవర్ణాలైనా ఇదే ధోరణిని కలిగి ఉంటారు. గ్రామంలో 14 కులాలవారు ఉన్నారు. ఇదొక శాకాహార గ్రామం. ప్రజలు ఊరి బయటకు వెళ్లినప్పుడు, తమతో పాటు సత్తు (బియ్యం పిండి), నీటిని తీసుకెళ్తారు. బయట వడ్డించే వంటకాల్లో మాంసం ఉండొచ్చనే భయం వారికి ఉంటుంది. నేను గత 60 ఏళ్లుగా అన్నం, వెల్లుల్లి, ఉల్లిపాయ తినలేదు. రోటీ, సత్తు మాత్రమే తింటాను. మా పూర్వీకులు శాకాహారులు. అందుకే ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం” అని చిలం గ్రామ పెద్ద శివ్ శంకర్ పాశ్వాన్ తెలిపారు.

‘అన్ని కులాల్లోనూ శాకాహార సంప్రదాయమే’
“నేను ఇప్పటి వరకు మాంసాహారం తినలేదు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినా మాంసం ముట్టను. మాంసం వండే కార్యక్రమాలకు వెళ్లడానికి మా ఊరి ప్రజలు నిరాకరిస్తారు. ఒకవేళ ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా, మాంసాహారం తినకుండానే తిరిగి వచ్చేస్తాం. ఈ ఆచారం మా ఊరిలోని అన్ని కులాలలోనూ ఉంది. పదేళ్ల క్రితం వరకు కూడా మా ఊరిలోని ఇళ్లలో వండే ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉండేవి కావు. కొత్తతరంలో కొంతమంది ఇప్పుడిప్పుడే వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారు” అని చిలం గ్రామానికి చెందిన బిట్టు కుమార్ తెలిపారు.

‘తాత, ముత్తాతల సంప్రదాయాన్ని పాటిస్తున్నాం’
“మా ఊరి ప్రజలు గత 500 ఏళ్లుగా శాకాహారమే తింటున్నారు. మా తాతలు, ముత్తాతల కాలం నుంచే మాంసం, గుడ్లు, మద్యం ముట్టడం లేదు. మేం నేటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. మా గ్రామం మొత్తం భక్తిశ్రద్ధలతో ఉంటుంది. ఇంత పెద్ద సంఖ్యలో శాకాహారులు ఒకేచోట ఉన్న గ్రామం మాదే” అని గ్రామస్థుడు దేవేంద్ర గుప్తా పేర్కొన్నా