
32views
అయోధ్యలో భవ్యమైన రామ మందిర దేశ ప్రజల అంకితభావం, సంపూర్ణ మద్దతుతోనే రామ మందిర నిర్మాణం సంపూర్ణమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.నాగపూర్ లో డాక్టర్ హెడ్గేవార్ స్మారక సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణం ఎవరి మార్గదర్శకత్వంలో,నాయకత్వంలో జరిగిందో ఆ ప్రముఖులకు సన్మానం జరిగింది. ఈ సన్మానంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర రాముడి సంకల్పంతోనే నిర్మాణం అయ్యిందని అన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ఘటనను ప్రస్తావిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించినప్పుడే ఇలాంటి అద్భుతమైన కార్యాలు సాధ్యమవుతాయని అన్నారు. గోవర్ధన పర్వతం కృష్ణుని బొటన వేలుపైనే వుంటుంది కానీ.. ప్రజలు అందరూ తమవంతు కర్రలను సమర్పించేంత వరకూ ఆ వేలి కొన కదనలేదని గుర్తు చేశారు. అచ్చు అలాగే అయోధ్య రామ మందిరం కూడా అదే రీతిలో నిర్మాణం అయ్యిందని వివరించారు.
దేశంలోని ప్రతి ఒక్కరి మద్దతుతోనే అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైందని, మందిర నిర్మాణం చేయాలనే సంకల్పం జరిగిందని, కానీ పటిష్టమైన పునాది లేకపోతే అది ఎలా నిలబడుతుంది? అని ప్రశ్నించారు. భారత దేశంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాలు అందించారని, ఆ తర్వాత భగవాన్ రాముని వేలి కొన తన అద్భుతాన్ని ప్రదర్శించిందని పోలుస్తూ చెప్పారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందన్నారు.

భారత్ ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాల్సిన అవసరమే లేదని, దేశం ఇప్పటికే హిందూ రాష్ట్రమని ప్రకటించారు.దేశం హిందూ రాష్ట్రమన్న భావనను ఒకప్పుడు కొందరు ఎగతాళి చేసేవారని గుర్తు చేశారు. ‘‘ఈ దేశం హిందూరాష్ట్రం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయ్యేంత వరకూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తవుతుంది అంటే నవ్వేవారు. కానీ.. ఇప్పుడు నిర్మాణం పూర్తైంది. నేడు అదే ప్రజలు హిందుస్థాన్ హిందువుల గడ్డ’’ అని పేర్కొంటున్నారు. భారత్ ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని చాలా మంది ఆరెస్సెస్ ను అడుగుతున్నారు. కానీ.. ఇప్పటికే ఇది హిందూ రాష్ట్రంగా వుంది. ప్రకటించాల్సిన అవసరం లేదని మేము చెబుతున్నాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. దానిని మనం ప్రకటించాలా? అదే విధంగా భారత్ ఓ హిందూ రాష్ట్రం. ఇది వాస్తవం. ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరిస్తారు. దీనిని అప్పట్లో ఎగతాళి చేసేవారు. కానీ ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ మాటలపై స్వయంసేవకులకు నమ్మకం ఉండేది.ఇప్పటికీ అదే కొనసాగుతోంది’’ అని పేర్కొన్నారు.
ఇక.. మందిర నిర్మాణానికి సహకరించిన వారందరికీ కృకృతజ్ఞతలు తెలియజేసే ఒక మార్గమే ఈ సన్మాన కార్యక్రమం అని ఆయన అన్నారు.వారు తమ పనిని పూర్తిచేశారని, ఇప్పుడు మనం మన బాధ్యతను నిర్వర్తించాలని, మన వంతు బాధ్యతను నిర్వర్తించాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. మందిర నిర్మాణం అనే నిర్దిష్ట బాశ్యత వారికి అప్పగించబడిందని, వారు ఆ పనిలో అంచనాలకు మించి రాణించి, మనం ఊహించిన దానికంటే ఎంతో వైభవంగా, అత్యంత సుందరంగా మందిరాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. మందిరం భవిష్యత్తులో మరింత శోభాయమానంగా వెలుగొందుతుందని ప్రకటించారు.

సనాతన ధర్మ పునరుజ్జీవనానికి భారత దేశ పునరుజ్జీవనం అత్యంత అవసరమని మోహన్ భాగవత్ అన్నారు. 150 ఏళ్ల క్రితమే యోగి అరవిందులు ఈ భావనను వ్యక్తం చేశారని, ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. “ప్రపంచంలో ధర్మం స్థాపించబడేలా, మనం దేశాన్ని ఊహించిన దానికంటే గొప్పగా, వైభవంగా, అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రపంచ అవసరాలను కేవలం భారత్ మాత్రమే తీర్చగలదని, భారత్ పునరుజ్జీవనం భారత్ ప్రజల చేతుల్లోనే సాధ్యమవుతుందని, మరే ఇతర దేశమూ భారత్‌ను రక్షించలేదని ఆయన అన్నారు.





