
4views
పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో మైనారిటీలపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల్ని నిలువరించేందుకు చొరవ చూపాలని విశ్వ హిందూ పరిషత్ ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభను (యూఎనీఏ) అభ్యర్థించింది. సభ అధ్యక్షురాలు అన్నాలెనా బేర్బాక్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా పరిషత్ ఆమెకు రాసిన లేఖలో ఈ విషయం పేర్కొంది. ఆయా దేశాల్లో మతపరమైన మైనారిటీలపై జరుగు తున్న అత్యాచారాలు, హింస, బలవంతపు మత మార్పిడుల ఉదంతాలను వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా హిందువులు, క్రైస్తవులపై ఈ దురాగతాలు జరుగుతున్నాయని వీహెచ్పీ నేత తెలిపారు. బంగ్లాదేశ్ లో కూడా మతపరమైన మైనారిటీల పట్ల వివక్ష, హింసాకాండలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. బలవంతపు మత మార్పిడులు, మైనారిటీలపై సాగుతున్న హింసాకాండలపై అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని పిలుపునిచ్చారు.





