
పాస్టర్ చింతాడ ఆనంద్ మోసపూరితంగా పొందిన ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కేసులో బాధితుడు అక్కల రామిరెడ్డి వేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, బాపట్ల జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీచేసింది. విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ ఆనంద్.. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి, మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేయగా చందోలు పోలీసులు 2021లో కేసు నమోదు చేశారు. తమ స్థలాన్ని ఆక్రమించి అందులో చర్చి నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రశ్నించినందుకు వైకాపా నేతల ప్రోద్బలంతో పాస్టర్ ఆనంద్ తనతోపాటు తన కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద తప్పుడు కేసు పెట్టారని, ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రామిరెడ్డి తదితరులు 2022లో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. క్రైస్తవ మతంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారని, పాస్టర్ ఆనంద్ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని తీర్పు చెప్పింది. పాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేస్తూ 2025 ఏప్రిల్ 30న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. క్రైస్తవాన్ని స్వీకరించిన వారు ఎస్సీల కిందకు రారని స్పష్టంచేస్తూ ఈ ఏడాది మార్చి 24న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో తప్పుడు మార్గంలో పాస్టర్ ఆనంద్ పొందిన ఎస్సీ ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని, చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ధ్రువపత్రంతో మోసపూరితంగా పొందిన ప్రభుత్వ ప్రయోజనాల సొమ్మును రాబట్టాలని రామిరెడ్డి తాజాగా హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ముదునూరి పృథ్విరాజు వాదనలు వినిపించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్ 18కి వాయిదా వేశారు.





