News

అంతర్వేది కల్యాణోత్సవాలకు గుర్తింపు

8views

ప్రసిద్ధి గాంచిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు గుర్తింపు లభించనుంది. ఏటా మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు ఉత్సవాలు ప్రారంభించి దశమి రోజున స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఏకాదశి రోజున మాడ వీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. అదే నెలలో పౌర్ణిమ నాడు చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నెల 22న అమరావతిలో ముఖ్యమంత్రి కోనసీమ జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేళంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో భాగంగా అంతర్వేది ఉత్సవాలను ఇకపై రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు.

వసతులు అంతంత మాత్రమే..
ఏటా నిర్వహిస్తున్న కల్యాణోత్సవాలకు స్వామివారి హుండీల నుంచి వచ్చిన ఆదాయం, దేవస్థాన భూముల లీజు, దుకాణాల వేలంపాట, ఇతర మార్గాల్లో వస్తున్న ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించడంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమవుతోంది.

ప్రతి అంశంలోనూ ప్రత్యేకత

  • లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలను రాష్ట్ర పండగగా నిర్వహిస్తే ప్రభుత్వమే ప్రత్యేకాధికారులను నేరుగా నియమించే అవకాశం ఉంటుంది.
  • రాష్ట్ర స్థాయిలో దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తారు.
  • విధిగా మంత్రిస్థాయి ప్రజాప్రతినిధి స్వామివారికి పట్టువస్త్రాలు, సంప్రదాయబద్ధంగా నిర్వహించాల్సి ఉంటుంది.

ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం
ఈ ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహిస్తే సీజీఎఫ్‌(కామన్‌ గుడ్‌ఫండ్‌) నిధులు విడుదలవుతాయి. వీటితో భక్తులకు, ఉత్పవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతానికి అంతర్వేది ఉత్పవాలు నోటిఫైడ్‌గా ఉన్నాయి. ఇటీవలే అంబాజీపేట మండలం పరిధిలో జరిగే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన విషయం తెలిసిందే.