
నిజమైన జ్ఞానం అంటే కేవలం వాక్చాతుర్యం మాత్రమే కాదని, నిజమైన జ్ఞానం అంటే అవగాహన అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆది శంకరుల జయంతిని పురస్కరించుకొని, త్రిపురలోని ఫకీర్ మురా గ్రామంలో సౌందర్య చిన్మయి మందిరాన్ని మోహన్ భాగవత్ ఈ నెల 21`న ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ గత రెండు వేల సంవత్సరాలుగా భారత్ అనేక సైద్ధాంతిక దృక్పథాలను చూసిందని, ప్రపంచం విజ్ఞానశాస్త్రం నుండి సామ్యవాదం వరకు అన్నింటితో ప్రయోగాలు చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ నేడు యావత్ ప్రపంచానికి భారత దృక్పథం, సనాతన ధర్మం అవసరమని ప్రపంచం గ్రహిస్తోందన్నారు. యావత్ ప్రపంచానికి ప్రస్తుతం సనాతన ధర్మమే దారి చూపిస్తోందని ప్రకటించారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ దేవాలయ ప్రాముఖ్యాన్ని కూడా వివరించారు. దేవాలయం అనేది కేవలం పూజలు చేసే ప్రదేశం మాత్రమే కాదని, అది భారతీయ సామాజిక జీవితానికి కేంద్రం అని అభివర్ణించారు. ప్రస్తుత కాలంలో బలంతో పాటు భక్తి కూడా అత్యావశ్యకమని నొక్కి చెప్పారు.
అలాగే భారత దేశంలో వైవిధ్యత వున్నా.. ఐకమత్యం మాత్రం పుష్కలంగా వుందని పునరుద్ఘాటించారు. భారత్ ఎదుగుదలను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నం చేస్తూనే వున్నాయని, దేశంలోనే విభేదాలు సృష్టించడానికి శతధా ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ విషయంలో అందరూ జాగరూకతతో వుండాలని పిలుపునిచ్చారు.
ఇక.. త్రిపుర రాజమాత బిభు కుమారి దేవి మాట్లాడుతూ.. మనలో వైవిధ్యం వుండొచ్చు కానీ, మనందరి మాతృభూమి భారత వర్షమే అని ప్రకటించారు. ప్రతి పౌరుని హృదయంలో మాతృభూమి పట్ల ప్రేమ వుండాలని సూచించారు.
ఇక.. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహ మాట్లాడుతూ.. ఈ ఆలయం కేవలం త్రిపురకే కాకుండా యావత్ భారత ప్రజలకు ఆధ్యాత్మిక చిహ్నమని, అందరికీ మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మోహన్ భాగవత్ కి ధన్యవాదాలు ప్రకటించారు.
మరో వైపు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి కూడా మాట్లాడారు. సామాజిక సేవలో చిన్మయ మిషన్ పోషిస్తున్నపాత్రను అభినందించారు. త్రిపుర వంటి సరిహద్దు రాష్ట్రంలో పాఠశాలలను, దేవాలయాలను అంటే కేవలం మతపరమైన చర్య కాదని, ఇదో విశిష్టమైన సామాజిక సంస్కరణ అని అభివర్ణించారు.





