
కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవంలో డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసంగం..
నాగపూర్‌లో జన్మించి యుగాలకు సరిపడ కార్యాన్ని ప్రారంభం చేసినటువంటి డాక్టర్ కేశవ బలిరాం హెడ్గెవార్ (డాక్టర్జీ) పూర్వీకుల గ్రామం కందకుర్తి అని మనందరికీ తెలుసు. వారు నాగపూర్‌లో జన్మించి, అక్కడే సంఘకార్యాన్ని ప్రారంభించారు. మొదటగా సంఘ కార్యకర్తలను అక్కడే తయారుచేశారు. కనుక అక్కడ స్మృతి మందిరం ఉంది. అదేవిధంగా కందకుర్తి డాక్టర్జీ పూర్వీకుల గ్రామం కాబట్టి ఇక్కడ కూడా వారి స్ఫూర్తి మందిరం ఉండాలని అనుకోవడం ఇక్కడి ప్రజలకు, స్వయంసేవకులకు కూడా సహజమే. అందుకే 32 సంవత్సరాల క్రితం సంకల్పించుకొని సరిగ్గా ఇదే తేదీన (ఏప్రిల్ 11) చిన్న స్మృతిమందిరం నిర్మాణం చేశారు. అదేవిధంగా దాన్ని పునర్నిర్మాణం చేసుకున్నటువంటి రోజు కూడా ఏప్రిల్ 11 కావడం యాదృచ్ఛికమే.
మరో విషయం కూడా ఇక్కడ యాదృచ్ఛికంగా అనిపిస్తుంది. ఈ స్ఫూర్తి మందిరంలోని ఆర్ట్‌గ్యాలరీలో ఓ చిత్రాన్ని చూశాను. అందులో గరుత్మంతుడు తన తల్లి అయిన వినతను దాస్యం నుండి విముక్తి చేయడానికి అమృతం తీసుకువచ్చి ఉంచిన ప్రదేశం కందకుర్తి అని ఇప్పుడే తెలిసింది. పురాణాన్ని అనుసరించి గరుత్మంతుని సవతి తల్లి కద్రువ పన్నిన ఒక కపట పన్నాగంవల్ల తల్లి వినత కద్రువకు దాసిగా మారుతుంది. కొంతకాలం తపస్సు అనంతరం వారిరువురికి దేవుడు వరాలివ్వడం జరిగింది. కద్రువు తనకు వెయ్యి మంది సంతానం కావాలని కోరుతుంది. ఆ కోరిక ఫలించి వెయ్యి గుడ్లను పొదుగుతుంది. ఆరు నెలల్లో అవి సర్పాలుగా భూమిపై సంచారం చేయడం మొదలుపెట్టాయి. అదే విధంగా ఇటువైపు వినత కేవలం తనకు గొప్పవారుగా ఉండే ఇద్దరే సంతానం చాలని వరమడుగుతుంది. ఆ విధంగానే వరం పొందిన వినత సంతానం పొందలేదు (గుడ్లు అంత త్వరగా పొదగలేదు). శిశువు త్వరగా బయటికి రాకపోవ డంతో వినత బలవంతంగా ఒక గుడ్డుని చీల్చే క్రమంలో అందులో ఉన్నటువంటి సంతానం అంగవైక్యల్యంతో జన్మించినా గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఆ తదుపరి అతడు పెరిగి పెద్దయి సూర్యుని రథసారథిగా మారాడు. కానీ తల్లి వినతకు సందేశాన్ని ఇస్తూ నేను సూర్యభగవానుడికి సారథిగా ఉంటూ నా బాధ్యతను నిర్వహిస్తాను. కానీ తర్వాత వచ్చేటటువంటి నా సోదరుడు నిన్ను దాన్యం నుండి విముక్తి చేస్తాడు, తొందరపడి గుడ్డును విచ్ఛిత్తి చేయద్దు అని అంటాడు. అలా 12 సంవత్సరాల తర్వాత రెండవ సంతానంగా పుట్టినటువంటి వాడే గరుత్మంతుడు. ఈయన బలవంతుడు. ఆకాశంలో విహరించే సామర్థ్యం కలిగిన వాడు. ఇతను పెరిగి పెద్దాయ్యాక తల్లి దాస్యాన్ని కనుక్కొని కద్రువతో దాస్యానికి నివారణోపాయాన్ని అడుగుతాడు. ఆమె అసాధ్యమైనటువంటి కోరికను వెలిబుచ్చుతూ, అమృతకలశం తెచ్చి ఇచ్చినట్లయితే నీ తల్లి దాస్యాన్ని విముక్తం చేస్తాను అని చెబుతుంది. వెంటనే తల్లి కొరకు స్వర్గానికి వెళ్లి దేవతలతో పోరాడి అమృత కలశాన్ని భూమి పైకి తీసుకొచ్చి ఉంచిన స్థలమే మన కందకుర్తి. అలా తీసుకొచ్చిన తర్వాత తన సవతి తల్లి కద్రువకి ఇచ్చి తల్లికి దాస్య విముక్తి గావించాడు. ఈ పోరాటంలో అమృతాన్ని తీసుకొచ్చే క్రమంలో చివరకు విష్ణుమూర్తి కూడా ఈయన పోరాట పటిమను గమనించి తనకు వాహనంగా చేసుకొంటాడు.
అదేవిధంగా దాస్య శృంఖలాల నుండి భరత మాతను విముక్తి చేయాలని సంకల్పించు కున్నటువంటి వ్యక్తి డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గెవార్. వీరు పెరిగి పెద్దయ్యాక ఆనాడు తల్లి (భారతమాత) దాస్య విముక్తి కోసం జరుగుతున్న అన్ని మార్గాల్లో ప్రయాణించసాగారు. తదనుగుణంగా ఆనాటి విప్లవ వీరులతో కలిసి చురుకుగా పనిచేశారు. స్వాతంత్ర పోరాటం కోసం జరిగిన ఇతర ఉద్యమాలలో నిర్విరామంగా కృషి చేశారు. వారి ఆసక్తి, శ్రద్ధ, దేశం పట్ల ఉన్నటువంటి సత్యనిష్టను అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ఏ ఉద్యమంలో పనిచేసినా అత్యంత ప్రామాణికతతోనే పనిచేశారని, ఎక్కడికి వెళ్లినా, ఎవరిని అడిగినా వాళ్లందరు డాక్టర్జీ సద్గుణమైన ప్రామాణికత గురించే మొదట చెప్పేవారు. డాక్టర్జీ కాలంనాటి స్వయంసేవకులు వారి స్నేహశీలత గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ, కలకత్తాకు చెందిన రాస్‌బిహారీ బసు అనే రచయిత తను రాసిన మూడు పుస్తకాలలో డాక్టర్జీ గురించి వ్రాస్తూ : ‘హెడ్గెవార్ అనే యువకుడు నాగపూర్ నుండి వచ్చాడని, అత్యంత ప్రామాణికతతో పనిచేసే కార్యకర్త’ అని ఉటంకించాడు. ఏ పనిని చేపట్టినా తను, మన, ధన పూర్వకంగా డాక్టర్జీ పనిచేసేవారు.
మన దేశంపైకి ఆంగ్లేయులే కాదు, అంతకు ముందు అనేకమంది దండెత్తి వచ్చారు. వారు మనల్ని బానిసలుగా చేసి దోచుకున్నారు. స్వాతంత్య్రం ఏదో రకంగా, తప్పనిసరిగా వస్తుంది కానీ స్వాతంత్య్రం అనంతరము తిరిగి మనం దాస్యంలోకి వెళ్లకుండా ఏ విధంగా జాగ్రత్తపడాలి అనేటటువంటి ఆలోచన డాక్టర్ హెడ్గెవార్ మనసులో నిరంతరం మెలుగుతూ ఉండేది. ఇదే ఆలోచనలో నుండి పుట్టినదే ఆరఎసఎస్.
మన సమాజం భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుభూతి చెందుతూ వచ్చింది. మన దేశంలో వేషభాషల్లో, పూజాపద్ధతులలో, ఆహారపు అలవాట్లలో భిన్నత్వం ఉన్నప్పటికీ మనమందరం ఒకటే అనే అనుభూతిని చెందుతూ వచ్చాం. కాలక్రమంలో భాష, ప్రాంత, కులభేదాలతో ఐకమత్యాన్ని కోల్పోయాం. ఈ బేధాలను తొలగిస్తూ అందరినీ ఏకం చేసేటటు వంటి సూత్రం హిందుత్వం మాత్రమేనని తెలుసుకొని హిందువులమందరం ఐక్యంగా ఉండాలని చెప్పే మన మూలసూత్రం గురించి ప్రయత్నం కొన సాగించడం ప్రారంభించారు డాక్టర్జీ.
మనం కోట్లాదిమంది ఉన్నప్పటికీ విదేశీయుల ద్వారా దెబ్బలు తిని ఒంటరివారమయ్యాం. అలాంటి సమాజం భయానికి లోనవుతుంది కాబట్టి బల సంపన్నులుగా మారాలి అనుకున్నప్పుడు ఐకమత్యంతో కూడిన సమాజం కావాలి. ఈ బలసంపన్నతతో వారు కలిసి ఉండాలి కానీ ఇతరులను బయటపెట్టటానికి కాదు. అందుకనే శీల సంపన్న సమాజం తయారు కావాలి. అటువంటి మేటి సమాజాన్ని నిర్మాణం చేయాలని డాక్టర్జీ దృఢదీక్షను పూనారు. దీని కోసం జ్ఞానం కావాలి. దానిని సంపాదించడానికి డాక్జర్టీ తపస్సు చేశారు. ఇది త్వరగా పూర్తయ్యే పని కాదు, సమయం పడుతుంది. అయితే నిరంతర తపస్సు వల్లే సమాజాన్ని పూర్తిస్థాయిలో పరిపుష్టంగా నిర్మాణం చేయాలని అనుకున్నారు. వారిలో అంతటి దూరదృష్టి వల్లనే నేడు ఇదంతా సాధ్యమవుతున్నది. డాక్టర్జీ కీర్తిశేషులు కావడానికి ముందుగా ఆదర్శమైన హిందూ సంఘటనా స్వరూపాన్ని నిర్మాణం చేసే విధంగా సంఘప్రార్థనలో ఐదు గుణాలను నిక్షిప్తం చేశారు. సంఘ కార్యక్రమాల ద్వారా, సంఘ శాఖల ద్వారా ప్రార్థనలోని ఐదు గుణాలు స్వయంసేవకులకు ప్రాప్తిస్తాయి. డాక్టర్జీ ఈ కార్యాన్ని తమ భుజస్కంధాలపై మోస్తూ సమాజ నిర్మాణం చేశారు. భారత మాతకు దాస్య సంస్కృతి నుండి విముక్తి కలిగించారు. భీతిలేని శక్తి సంపన్నులు అయ్యే విధంగా చేశారు. శీలసంపన్నమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలని కోరారు. వీరవ్రతుల సమూహాన్ని తయారు చేశారు. చేపట్టిన పని మధ్యలో ఆపకూడదు. ఆ విధంగా వారు ధ్యేయనిష్ఠతో పనిచేశారు. ఇప్పుడు ఇది దేశ నలుమూలల్లో కనపడుతుంది. వినత మొదటి సంతానం ఎంతో తేజస్వి, బలశాలి, పరాక్రమవంతుడైనప్పటికీ కాళ్లు లేవు కనుక తల్లి దాస్యవిముక్తి పనిని తమ్ముడిపై వదిలిపెట్టి సూర్యుని సేవకు రథసారథిగా
వెళ్లిపోయినట్లుగానే, మన దేశంలో డాక్టర్జీ కాలంలో అనేకమంది పెద్దలు వివిధమైన పనులలో నిమగ్నమై తీరిక లేకుండా ఉన్నారు. కనుక ఆ భారాన్ని డాక్టర్జీ ఎత్తుకొని పనిచేశారు. దాని ఫలస్వరూపమే సంఘ ఆవిర్భావం. ఎవరిపైన విరోధం నుండి సంఘం ఆవిర్భవించలేదు. ఎవరిపైన దండెత్తడానికి కాదు, మన తల్లి వైభవం కోసం తను, మన, బుద్ధిపూర్వకంగా దాస్య విముక్తిని గావించి, శీలసంపన్న, బలసంపన్న, వైభవసంపన్న సమాజాన్ని తయారుచేసే పనిని డాక్టర్జీ చేపట్టారు. ఎలాంటి పరిస్థితిలోనైనా ముందుకెళ్లగలిగే వీరవ్రతధారులై ఉండి, ఎవరి ధ్యేయనిష్ఠ తీవ్రతరం అవుతుందో అటువంటి తరుణ కార్యకర్తల సమూహం నేడు దేశమంతటా తగినంత సంఖ్యలో నిలిచి ఉంది. గరుత్మంతుడు తల్లిదాస్య విముక్తి కోసం అమృతాన్ని స్వయంగా తీసుకొచ్చినప్పటికీ తాను అమృతంలో ఒక్క బొట్టు కూడా స్వీకరించలేదు. సరికదా తల్లి దాస్యాన్ని విముక్తం చేసి తాను విష్ణువుకు వాహనమై తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. అదేవిధంగానే ఈ మట్టి (కందకుర్తి)లోని గుణాలను ఆపాదించుకొని జన్మించిన డాక్టర్జీ ఏనాడు ప్రసిద్ధిని గానీ, అధికారాన్నిగానీ కోరుకోలేదు. సంఘాన్ని కూడా ఆ విధంగానే పెంచారు. సంఘానికి అధికారం అవసరం లేదు, ప్రసిద్ధి అవసరంలేదు. కేవలం దేశ
హితం, సమాజ సంఘటితం కావాలని ప్రతి స్వయంసేవకుడు కోరుకుంటాడు. మా జీవితం ఈ భూమి మీద స్వల్పకాలమే కావచ్చు కానీ తల్లి భారతి నీకు జయము సదా వర్ధిల్లుగాక! అని ప్రార్థిస్తూ ఉంటాము. ఈ మట్టి (కందకుర్తి) నుండే డాక్టర్జీకి స్ఫూర్తి పరంపరాగతంగా లభించింది. ఈ నేలలో పౌరాణికమైనటువంటి ఇతిహాసం ఉంది. ఛత్రపతి శివాజీ, రాణీ అహల్యాబాయి హోల్కర్ వంటి గొప్పవారు ఈ నేలని స్పృశించారు. అంటే ఈ నేలలోనే దైవకార్యం కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది విధి నిర్ణయం. కేశవ స్ఫూర్తి మందిర నిర్మాణం ద్వారా దేశభక్తి స్ఫూర్తిని కలిగించాలి. సమాజాన్ని ఆరాధించే తత్వం మనలో కలగాలి. అందుకే కేశవ స్ఫూర్తి మందిరం కేంద్రంగా తను, మన, ధన రూపేణా గుణాత్మకమైన ఆరాధన జరగాలి. సమాజాన్ని దైవంగా భావించి ఉపాసన చేయటానికి ఈ నేల కణ-కణం స్ఫూర్తినిస్తుంది. ఈ నేల స్వభావమే అలాంటిది. ఈ కేంద్రం ద్వారా పేదలకు సేవా కార్యక్రమాలు జరగాలి. సేవ పొందినవారిలో కూడా తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వగలిగే స్థితిని తయారుచేయాలి. మనమంతా సెలవు దినాలలో, ఇతర పండగల సమయంలో మన కుటుంబాన్ని ఈ స్ఫూర్తి కేంద్రానికి తీసుకురావాలి. అప్పుడే ఇక్కడి చరిత్ర మన సంతానానికి తెలుస్తుంది. ఈ ఆర్ట్ గ్యాలరీలోని చిత్రాల ద్వారా డాక్టర్జీ జీవితం, వారి కృషి, వారి సమర్పణ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. గరుత్మంతుడు ఇక్కడివాడే, డాక్టర్జీ కూడా ఇదే నేలకు చెందినటువంటి వారే అని అందరికీ తెలియాలి. భారతీయులందరూ ఈ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించు కోవాలి. పురాణాలు, చరిత్రలు పూజించుకోవడానికి, స్మరించుకోవడానికి మాత్రమే కాదు. వాటి ద్వారా మనము ప్రేరణ పొందాలి. మనకొరకు కాదు, పరులకు అమృతాన్ని పంచే విధంగా స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలు ఇక్కడ కొనసాగాలి. ఇటువంటి కేంద్రాన్ని దర్శించుకున్న మనమంతా ఆ స్పూర్తిని నింపుకుంటూ ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను.
కందకుర్తిలో నైపుణ్య శిక్షణ: తెలంగాణ సేవాభారతి సంఘటన మంత్రి వాసు
అంతకుముందు తెలంగాణ సేవాభారతి సంఘటన మంత్రి వాసు మాట్లాడుతూ కందకుర్తిలో 32 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కేశవ సేవాసమితి ద్వారా కేశవ శిశుమందిర్ పాఠశాల నడుస్తున్నదని, దీనిద్వారా ప్రతి వేసవిలో కంప్యూటర్ ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే ఏడాదిలోగా పాఠశాల భవనం పునర్నిర్మాణంతోపాటు నైపుణ్య శిక్షణ కేంద్రం కోసం భవనాలు ప్రారంభమవుతాయని అన్నారు. కందకుర్తి చుట్టుపక్కల 50 గ్రామాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేశవ స్ఫూర్తికేంద్రంగా కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించే నైపుణ్య శిక్షణలో ప్రధానంగా రైతులకు ఉపయోగపడే విధంగా శిక్షణ ఉంటుంది. అలాగే ఉపాధి అవకాశాలను సంపా దించుకొనే దిశలో పర్యావరణ పరిరక్షణ గురించి నైపుణ్య ప్రశిక్షణ కోసం యోజన జరుగుతున్నదని తెలియజేశారు. ఈ కేశవ స్ఫూర్తిమందిర నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు కందకుర్తి ప్రజల సహకారం మరువలేనిదని వాసు అన్నారు.

కందకుర్తి తల్లి దాస్యాన్ని విముక్తం చేయడానికి గరుడ్మంతుడు అమృతాన్ని తెచ్చి ఉంచిన పవిత్ర త్రివేణి సంగమ స్థలం (గోదావరి, మంజీరా, హరిద్ర నదులు కలిసే చోటు). స్కందమందిరం వెలసిన గ్రామం. వనవాసంలో శ్రీరామచంద్ర భగవానుడి పాదధూళితో పవిత్రమైన భూమి, హైందవ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ వచ్చిన నేల, ముష్కరుల చేతిలో ధ్వంసమైన పురాతన శివాలయాన్ని పునర్నిర్మించడానికి వచ్చిన అహల్యాబాయి హోల్కర్ దర్శనంతో ధన్యత నొందిన ఈ ఊరిపేరే స్కందపురి. కాలక్రమంలో కందకుర్తిగా నేడు పిలువబడుతున్నది. ఇంతటి ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం కలిగిన కందకుర్తిలో ఏప్రిల్ 11వ తేదీన త్రివేణి సంగమ పరిసరాలలో, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే సాయం సంధ్య వేళలో, కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభం కేవలం కందకుర్తి పరిసర వాసులకే కాకుండా యావత్ హిందూ సమాజానికి ఒక శుభసంకేతమని భావించాలి.
స్ఫూర్తిమందిరం ప్రారంభంకన్నా ముందుగానే పక్కనే ఉన్న స్కందమందిరాన్ని, రుక్మిణిసమేత విఠలేశ్వర మందిరాన్ని, డాక్టర్జీ కులదైవమైన కేశవ మందిరాన్ని డాక్టర్ మోహన్‌జీ దర్శించుకున్నారు.
సాయంత్రం ఐదున్నర గంటలకు మోహన్‌జీ భాగవత్ స్ఫూర్తిమందిరం ప్రారంభించారు. ఆ తరువాత వారు మందిరంలోకి ప్రవేశించి భారత మాత, డాక్టర్జీ విగ్రహాలను దర్శించుకున్నారు. ఈ రెండు విగ్రహాలు అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని తయారుచేసిన అరుణ్ యోగిరాజ్ చేతుల్లో రూపుదిద్దుకొని ప్రాణం ఉట్టిపడినట్లు దర్శనమివ్వడం విశేషం. అనంతరం మోహన్‌జీ ఆర్ట్‌గ్యాలరీని పరిశీల నగా వీక్షించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందులో శ్రీరామచంద్రుడు, శివాజీ, అహల్యాబాయి హోల్కర్ మొదలగువారు ఈ భూమిలో అడుగిడిన సంఘటన లతో పాటు డాక్టర్జీ బాల్యం నుండి దేశభక్తితో ప్రేరేపితమైన సంఘటనలు, సంఘం ప్రారంభించాక జరిగిన సంఘటనలను ఇక్కడ చిత్రీకరించారు. దీనిని చిత్రీకరణ అనలేం. ఆ సంఘటనలు మన కళ్లముందు జరుగుతున్నాయా అన్నంతగా చిత్రాలు కనువిందులు చేస్తుండటం ఇక్కడి విశేషంగా చెప్పుకో వచ్చు. ఎంత చూసినా తనివి తీరనంత గొప్పగా చిత్రీకరించారనడంలో అతిశయోక్తి లేదు. తర్వాత జరిగిన సభా కార్యక్రమంలో స్ఫూర్తిమందిర నిర్మాణానికి సహకరించిన ఇంజనీర్ల వంటి పెద్దలతో పాటు భవన నిర్మాణంలో పనిచేసిన మేస్త్రీలను కూడా వేదికమీద సన్మానించడం విశేషం. సాయంత్రం ఐదున్నర నుంచి సభా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు సభలో పాల్గొన్నవారి ముఖాలలో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. అలాగే కందకుర్తి గ్రామ వాసుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. డాక్టర్జీ పూర్వీకుల గ్రామం కావడం, గొప్ప స్ఫూర్తి మందిరం వెలియడం, ఆరఎసఎస్‌కు నేతృత్వం వహిస్తూ, హిందూ సమాజానికి స్ఫూర్తి కలిగిస్తున్న పరమపూజనీయ సర్‌సంఘచాలక్ మోహన్‌జీ భాగవత్ విచ్చేయడంతో గ్రామస్తులు మురిసి పోయారు.
కందకుర్తిని సందర్శించిన బాలాసాహెబ్ దేవరస్

సెప్టెంబర్ 17, 1995న కందకుర్తిలోని స్మృతి మందిరాన్ని ఆరఎసఎస్ మూడవ సర్‌సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ సందర్శించారు. ఆ సందర్భంగా ఇక్కడి కేశవమూర్తి విగ్రహానికి అభిషేకం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనారోగ్య స్థితిలో మాట్లాడలేని కారణంగా వారి వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్‌జోషి చదివి వినిపించారు. అందులో “కందకుర్తి గ్రామవాసులు, బంధువులు, మాతృమూర్తులు, ఉపస్థితులైన స్వయంసేవక బంధువులారా! మీ అందరితో ప్రత్యక్షంగా కలిసే అదృష్టం ఈ రోజు నాకు లభించినందుకు చాలా సంతోషిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా కందకుర్తి రావాలని నాకు కోరికగా ఉన్నా, ఆరోగ్యం సహకరించలేదు. కాబట్టి నేను రాలేకపోయాను. సంఘ సంస్థాపకులు డాక్టర్‌జీ పూర్వీకుల గ్రామం ఇది. 1989లో డాక్టర్జీ శతజయంతి కార్యక్రమం భారతదేశమంతటా చాలా ఉత్సాహంతో జరిపారు. ఆ సమయంలోనే కందకుర్తి రావాలని మనసులో కోరిక కలిగింది. అప్పటి నుండి మనస్సులో ఉన్న ఈ కోరిక ఈ రోజు పూర్తవుతున్నది. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్‌జీతో అత్యంత సమీప సాన్నిధ్యం కలగటం నా జీవితంలో ఒక అద్భుత అనుభవం. వారిది రాష్ట్ర సమర్పిత జీవితం.
పక్షిరాజైన గరుత్మంతుడు తన తల్లి దాస్య విముక్తి కోసం స్వర్గలోకం వెళ్లి ,దేవతలతో పోరాడి, అమృత కలశాన్ని తెచ్చి, దానిని ఈ మూడు నదుల (గోదావరి, మంజీరా, హరిద్ర) సంగమ స్థలంలో ఉంచి తల్లి దాస్యాన్ని విముక్తం చేసినట్లుగానే, డాక్టర్‌జీ ఇదే స్థలానికి చెందిన హెడ్గెవార్ వంశంలో జన్మించి, హిందూ సమాజాన్ని బానిస సంకెళ్ల నుండి విముక్తం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అనే అమృత కలశాన్ని మన సమాజానికందించారు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల్లో స్వాభిమానం, స్వావలంబనం నిర్మాణంచేసి, అన్ని రకాల కుల, ప్రాంత, భాష, ఉచ్చనీచ భావాలను, రాజకీయ విభేదాలను దూరంచేసి ఏకాత్మ సమరసత, సంఘటిత రాష్ట్ర జీవనాన్ని నిర్మించేందుకు ఆరఎసఎస్ చేస్తున్న ఈ మహా కార్యంలో సమస్త భారతీయ సమాజం శీఘ్రాతిశీఘ్రంగా పాలుపంచుకోవాలని కందకుర్తిలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా నేను పిలుపునిస్తున్నాను. ప.పూ. డాక్టర్‌జీ జన్మశతాబ్ది సమయంలో భారతదేశంలో వెనుకబడిన దళిత, శోషిత సమాజం సర్వాంగీణ వికాసం కోసం సంఘ కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయం చేశారు. ప.పూ. డాక్టర్ హెడ్గేవార్‌జీ స్వంత గ్రామంలో స్వయంసేవక బంధువులు శ్రీ కేశవ సేవాసమితి ద్వారా ఒక స్మృతిమందిరం నిర్మించారు. శ్రీ కేశవ శిశుమందిరం పేరిట ఒక ప్రాథమిక పాఠశాలను నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ సుదూరమైన కందకుర్తి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక సమస్యలనెదుర్కొంటూ మీరంతా ఇక్కడికొచ్చారు. కానీ నా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నేను స్వయంగా మాట్లాడలేక పోతున్నాను. కాబట్టి మనస్సులో బాధగా ఉంది. మీరందరూ ఈ విషయంలో నన్ను క్షమిస్తారని కోరుతున్నాను” అని అన్నారు.
– బూర్ల రవీందర్,
కందకుర్తి నుంచి, జాగృతి ప్రతినిధి





