
( ఆది శంకరాచార్యులు జయంతి )
ముప్ఫై రెండేళ్ల యువకులు ఈనాడు జీవన పోరాటంలో నానా కష్టాలు పడుతున్నారు. ఆర్థిక బాధలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ చికాకులు అంటూ కాలం తో పరిగెడుతున్నారు. కానీ కొన్ని శతాబ్దాల క్రిందట ఒక ముప్ఫై రెండేళ్ల జీవిత కాలం లో ఒక యువకుడు ప్రపంచానికి అద్వైత జ్ఞానాన్ని అందించాడు. తన ధర్మాన్ని ఉద్ధరించాడు. కొన్ని వేల మైళ్ళు పాదచారిగా సంచరించి అనేక పీఠాలు మఠాలు స్థాపించాడు. ఎంతో మంది శిష్యులకు జ్ఞానాన్ని అందించాడు. ఇప్పటికీ ఆయన విజయయాత్రల ప్రభ శృంగేరీ పీఠంగా వెలుగొందుతూంది.
హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేయడానికి, ప్రజల దృష్టిలో హిందూధర్మాన్ని హింసా మార్గంగా, కఠినమైనదిగా ప్రచారం చేస్తున్న కాలం అది. అనేక హిందూ ధర్మ గ్రంథాలు, దేవాలయాలు నాశనం చేయబడ్డాయి. అలాంటి పరిస్థితిలో ఉన్న దేశధర్మాల్ని ఉద్ధరించడానికి అవతరించారు ఆది శంకరులు. ఈ దేశంలో సనాతన వైదిక ధర్మం ఇప్పటికీ నిలిచి ఉందంటే అది ఆదిశంకరుల పుణ్యమే. పరమపవిత్రమైన వైశాఖ శుక్ల పంచమీ తిథి జగద్గురు శంకరభగవత్పాదుల వారి జన్మతిథి. ఈ సంవత్సరం ఆయన జయంత్రిని ఏప్రిల్ 21న జరుపుకుంటున్నాము.
కేరళలోని కాలడిలో ఆర్యాంబ, శివగురు దంపతులకు జన్మించిన శంకరాచార్యులు అతి పిన్నవయసులోనే వేదాలు, షట్సాస్త్రాలు, షడంగాలు, సమస్త విద్యలు ఔపాసన పట్టారు. ఎనిమిదేళ్ళ వయసులోనే తల్లిని ఒప్పించి, సన్యాసాశ్రమ స్వీకారానికి బయలుదేరాడు. గోవింద భగవత్పాదులవారు, తమ గురువు చెప్పిన గుర్తుల ప్రకారం అతనే శివస్వరూపుడైన ఆదిశంకరులని గ్రహించి తమ శిష్యుడిగా చేసుకున్నారు.
శంకరాచార్యులు సాగించిన తత్వశాస్త్ర సంవాదాలు, సాధించిన విజయాలు చాలా అద్భుతమైనవి, ప్రత్యేకమైనవి. దేశం నలుమూలలకు పర్యటించి వివిధ సంప్రదాయాలకు చెందిన పండితులతో వాదనలు జరిపి వారిని సనాతన ధర్మ మార్గంలోకి తెచ్చారు. శంకరాచార్యులు సాధించిన విజయం ఎంత గొప్పదంటే ఆ తరువాత ఏ భారతీయ మతమూ, సంప్రదాయం వైదిక ధర్మాన్ని ప్రశ్నించడంగానీ, ధిక్కరించడంగానీ జరగలేదు. ఆ విధంగా ఆయన వైదిక ధర్మానికి చెందిన సంప్రదాయాలు, మతాలను సంస్కరించి వాటిని తిరిగి మాతృవ్యవస్థతో జోడించారు.
అతి చిన్నవయసులో, తమ 32వ సంవత్సరoలో కైలాస గమనం తరువాత శ్రీ ఆది శంకరాచార్యులవారు తమ శిష్యులకి కనపడలేదు. పరమశివ స్వరూపులైన శంకరులు పరమేశ్వరునిలో కలిసిపోయారు. ఆదిశంకరులు అత్యున్నత స్థాయికి చెందిన యదార్థ తత్వవాది. తన అద్భుతమైన తర్కనైపుణ్యంతో, సర్వతోముఖమైన వ్యక్తిత్వంతో, అపారమైన ఆధ్యాత్మిక శక్తితో జ్ఞానబోధ, ధర్మసంరక్షణ సాగించారు. ఆయన మార్గం నేటికీ అనుసరణీయమే.





