ArticlesNews

ఆంధ్రనాటకకళ – రంగస్థలము

38views

కాలచక్రం అతి వేగంగా పరిభ్రమిస్తున్నా. మన దేశంలో మన చుట్టుపక్కలనే గాక బయట ఇతర దేశాల్లో కళాభివృద్ధి వేవిధాల విలసిల్లుతూంటే తెలుగునాట ఇంకా ఇరవై, పాతికేళ్ళకుపైగా ప్రదర్శిస్తున్న నాటకాలు మాత్రమే వాడవాడలా, గ్రామ గ్రామాలా ప్రజామోదం పొందుతున్నాయి. అంతేతప్ప చిరంతనంగా విలువగలిగే నాటకం ఏదీ ఈ మధ్య కాలంలో రాకపోవడం మన కళారంగంలో స్తబ్ధత్వాన్ని చాటుతోంది. ఇప్పటి మన ప్రజలతో ఆనాడు పతాక స్థాయిని అందుకున్న నటకులు బళ్లారి, మాధవపెద్ది, స్థానం, బందా, యడవిల్లి, బెల్లంకొండ ఇత్యాదులే ప్రశంసలు అందుకుంటున్నారు. ఎక్కడో అడపా- తడపా ఎప్పుడోగాని నూతన నటవర్గం పైకి అవుపించడంలేదు. తెలుగు పౌరుల్ని ఒకవంక పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం, చింతామణి, తులాభారం, బొబ్బిలియుద్ధం, మరొకవంక కన్యాశుల్కం, ప్రతాపరుద్రీయం ఉర్రూత లూగించినట్లు ఈ పాతికేళ్ల మధ్య ప్రజాహృదయాన్ని చాలాకాలం ఊపి వారిలో ఆనంద తరంగాల్ని నిలబెట్ట గలిగే నాటకం ఒక్కటి రాలేదంటే అతిశయోక్తి గాదేమో! ఇలా కళ కుంటుబడడానికి కారణం గ్రహించి సాధ్యమైనంత త్వరలో ఆయా లోపాల్ని మనం సరిదిద్దుకోగల్గిన నాడే మన పరిషత్తుల ఆశలు, కలలు సాక్షాత్కరిస్తాయి. లేకుంటే మనం ఎన్ని పరిషత్తులేర్పాటు చేసినా, ఎన్ని తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించినా మన నాటకం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుంటుంది.

ఇప్పటికి చెక్కు చెదరకుండా శాశ్వతంగా నిలవగల్గిన నాటకాలు ఎందుకిలా రూపొందాయి? దీనికి మనకి దొరికే ఒకే ఒక సమాధానం. తెలుగు సాహిత్య వీధుల్లో పతాకస్థాయినందుకున్న రచయితలు, కవులు వాటిని రచించడమే. వీటిలో దేన్ని తీసుకున్నా పాత్రలే ప్రేక్షకుల ముందు తారాడుతాయిగాని రచయిత ఆవుపించడు. రచనా వైవిధ్యమూ, గుఱ్ఱపు డెక్కల్లా అడుగులు త్రొక్కే సంభాషణలూ, చావులేని చక్కని పద్యశైలి, అక్కడక్కడ ఆకుల సందున పువ్వుల్లా తళతళ మెరసే రసపోషణా పెట్టని అలంకారాలై ఆ నాటకాలను తీర్చిదిద్దాయి. వాటిలోనూ ఒక్కొక్క సంభాషణల కూర్పూ, ఒక్కొక్క పద్యపు నడకా, ఒక్కొక్క వచన రచనా ఒక్కొక్క తెలుగు యువక నటునిలో దాగి ఉన్న ప్రత్యేక విశిష్టతను ఆనాడు పైకి లాగాయి. ఉదాహరణగా… పాండవోద్యోగ విజయాలలో రాజనీతిజ్ఞత, గయోపాఖ్యానంలోని లౌక్యం, ఇంకొక వంక గిరీశం కొత్తగొంతు చూపవచ్చు. అయితే ఒక తరహ ఉద్యమం తొలి వేళల్లో అనుకోకుండా అత్యద్భుతంగా వెలుగొందిన కన్యాశుల్కం గూర్చి ఇప్పటికీ మన సాహిత్యవేత్తల్లో విపరీతాభిప్రాయాలుండడం గమనార్హం.

అయితే నేడు తెలుగువారిలో ఉత్తమ రచయితలు లేరంటారా? ఈ ముక్క ఎవరూ అనలేరు. కాని నాటకాలు దీపింపక పోవడానికి కారణం వేరు. ఈ రోజుల్లో నాటికలూ, నాటకాలూ కేవలం ప్రబోధాత్మ కంగా మారిపోతున్నాయి. రాజకీయాలు రంగస్థలంపై గజ్జెకట్టి స్వైరవిహారం చేస్తున్నాయి. ఆశయ ప్రచారానికి కళను అతివేలంగా ఉపయోగిస్తున్నారు. ఎంత మరుగున ఉందామనుకున్నా ఉండలేక రచయిత ప్రేక్షకులచేత పట్టుబడిపోతున్నాడు. “ఇప్స్- ఇది కమ్యూనిష్టు నాటకంరా! ఎబ్బే- ఇదా! సోషలిష్టు ‘శోష’ అనేస్తున్నారు ప్రజ. ఆకలి కవిత్వం లాగునే ఆకలి నాటకాలు గూడ కాకుల్లా కేకలేస్తున్నాయి. ఏ రంగస్థలం పై చూచినా పాత్రలు మాట్లాడవే! కవీతత్వాలూ, సందేశాలు మాట్లాడి నాటకాలుకాని నాటకాల్ని ఆడిస్తున్నాయి. అందువల్లనే నాటకంగానీ, నాటికగానీ దాని ప్రయోజనం సాధించలేక పేలవంగా తయారవు తున్నాయి. పాత్ర మన సానుభూతిని లాక్కోవాలి గాని రచయిత కాదు. మొన్న ఒకచోట శ్రీ కృష్ణశాస్త్రిగారన్నట్లు మన సాహిత్యం ఇంకా యౌవన దశలోనే పొంగులువారుతోంది. ఈ పాలుకాగి చల్లారితేనేగాని చక్కని సందేశాలిచ్చే నాటకాలు రావడం కష్టం. ఆవేదన, ఉద్రేకం, ఎటకో తెలియని వెర్రి పరుగులు, ఉరవళ్ళు- పరవళ్ళు, ఎనలేని ఎదలోని బాధ-ఇవీ ఈనాటి నవయువత నవ్య నాడుల్లో కాగిపోయే భావ కలికలు, వీటి ఫలితంగా గీతాలు, గేయాలు, పద్యాలు, కథలు, గల్పికలు, చిత్రాలు, బయటలేమో గాని చక్కని నాటకాలు రావడం బహుకష్టం. దీనికి ఒక్క కన్యాశుల్కంలోనే భిన్నత్వం కనిపిస్తుంది. పోతే ఇక మనకు మిగిలేవి అనువాదాలు. వీటిలో కేవలం భాషావరోధం కారణంగా మనకు చేరలేని నాటకాలు మనదగ్గరికి వచ్చాయి. ఇవైనా మూలానికి మరింత ప్రచారం తెచ్చాయిగాని కొత్త యొలుగును వినిపించలేదు.

రంగస్థలంలోని పరిస్థితులు ఆశాజనకంగా లేక కాస్త నటనా కౌశలం ఉన్న ప్రతినటుడూ సినిమాలకి ఎగబాకుతున్నారని చెబుతున్నారు. దీనిలో కొంతసత్యం లేకపోలేదు కాని పూర్తిగా నిజంగాదు. మనకు మంచి నాట్యకళామందిరం ఉండి, ప్రదర్శనయోగ్యతలగల రూపకం ఉండి, ఆధునిక వైజ్ఞానిక పరిసరాల ఆసరాలో ఆడితే తప్పకుండా ప్రజాదరణను చూరగొనగల నటకులు అనేకులున్నారు. కేవలం నాటకాలలోనే రాణించ గల నటీనటులున్నారు. అయితే పూర్వకాలం సమర్థత గలవారిని ప్రభువులు ఆదరించేవారు. ఇపుడు ఆ బాధ్యత ప్రజలపై ఉంది. మంచినాటకం తగిన నటీనటులతో కాంట్రాక్టు పద్ధతివల్ల వచ్చే జబ్బులు లేకుండా ప్రదర్శితమైతే తగిన పోషణ దానికి ఉండకపోదు అని ప్రజ హామీ ఇస్తున్నారు.

మనకు ఉన్న పెద్దలోపం రూపకాని కనువైన రంగస్థలం లేకపోవడం. నాటకం ఎక్కడ ఆడాలి? అనగానే మనకట్టెదుట ప్రత్యేక్షమయ్యేది పల్లెల్లోనైతే పాకలూ, పందిళ్లూ, చావళ్లూ, పశువులశాలలూ, పట్నాలైతే గిడ్డంగులు, బంకులు, ఇంకా దేవుడు మేలుస్తే అసలు గిరాకీలేని ఆఖరు చౌకబారురకం సినిమా హాలు. పాశ్చాత్య రంగంవైపు చూడండి. తిరుగుడు ప్రదర్శన స్థలాలు (Rotating Stages) ఆధునిక పరికరాలలో అమర్చిన వెలుగు నీడలు, వివిధ వాయిద్యాలు, ఒకే పాత్ర పలుగొంతులతో పాడినా తెలుసుకోజాలని విన్మయం సృష్టించడానికి అనువైన పరిస్థితులు ఎన్నో అవుపిస్తాయి. మరి మనకో- స్థానం వారు చెప్పినట్లు కాలి బొటన వ్రేలి కదలికతో మనలను కదలించే స్త్రీ నటన కనబడ్డానికి ఆస్కారంలేదు. నటుడు కళ్లెగురవేస్తే చూపించే కాంతిలేదు. కదలకుండా కదలుతున్నట్లు చూపడానికి మన నటుడికి వీల్లేదు. ఇక ప్రేక్షకుల అవస్త బ్రహ్మ కెరుక. వరిసరాల దుర్గంధాలు, క్రిమి కీటక బాధలు, సరుకులమ్మే వాళ్ల సొద, ఒకటేమిటి అన్నీ అవాంఛనీయ పరిస్థితులే. దీనికితోడు మన నాటక సమాజాలలో క్రమశిక్షణ లేక పోవడం ఒకటి.

ఇన్ని కష్టాలలో కూడా మన నాటక కళ తనకొక భవిష్యత్తున్నదని ఘోషిస్తుంది. ఇది సత్యంగూడా. ఈ భవిష్యత్తును అనతికాలంలో రూపొందించడానికి ప్రజల్లోనూ, కళాభిరుచి అవసరం. నాటకాలలో రనపోషణ, నుశిక్షిత నటనా సామర్థ్యం, ఉపయుక్తమైన నాట్య మందిరం, రసజ్ఞులైన సభ్యులు లేనిదే నాటకం వెలుగొందదు. ఏ రంగూ లేకుండా నాటకం నాటకరంగంలోనే ప్రకాశించాలి.

ఆనందము, చైతన్యము, సంస్కారము, రససృష్టి మన భారతీయ రూపకాల ఆదర్శాలు. వీటి సమ్మేళనకు ఇతర భాషా సాహిత్యాలతోబాటు తెలుగులో కూడా చేదోడువాదోడై అనుపమ కృషిని సాగించింది. నేడు సాగిస్తూంది గూడా. అయితే ఈ పైరు ఫలించి మన అనుభవంలోకి వచ్చే రోజులు ముందున్నాయి. వాటిని తెచ్చే బాధ్యత మనపై ఉంది. -శండిల

కాళిదాసు “శాకుంతలం” రష్యను బాషానువాదం

మాస్కోలోని ప్రభుత్వ కథా కవిత సాహిత్యాల ప్రచురణాలయం యిటీవల 30 వేల ప్రతులలో అందంగా ప్రచురించిన పుస్తకం నా వద్ద వుంది. ముఖపత్రం పైన అల్లుకొన్ని వున్న కొమ్మలు అంచులుగా వున్నాయి. దాని మధ్య ఆలోచనా నిమగ్నయైన యువతి వుంది. ఆమెకి చేరువను హాయిగా పడుతుకున్న ఆడ జింకపిల్ల వుంది. పైన స్వర్ణాక్షరాలలో “కాళిదాసుని శాకుంతలం” అన్న పదాలున్నాయి.ఈ గ్రంథాన్ని తెరిచేటప్పుడు చరిత్రే దాని పుటలలో మీ ఎదుట సాక్షాత్క రిస్తుంది కాబట్టి మహత్తరమైన గౌరవభావం కలుగక తప్పదు. ఈనాటి పాఠకునికీ, భారతీయ మహాకవీ, నాటకకర్త అయిన కాళిదాసు జీవించి కృషి చేసిన శకానికీ మధ్య పదిహేను శతాబ్దాలున్నాయి.

మహానుభావుడు కాళిదాను రచనలు చాలకాలంగా రష్యాలో సుపరిచితాలు. 1792సంవత్సరపు “మాస్కోవ్‌స్కీ జర్నల్”లో ప్రఖ్యాత రచయిత, చరిత్రకారుడు అయిన ఎన్. యం. కరమ్ జీన్ “శకుంతల” నుంచి కొన్ని రంగాలను ప్రచురించారు. 1889లో యీ నాటకంలోని తొలి నాలుగు అంకాలు “సిన్ ఒతెచెస్త్వా” అన్న పత్రికలో ముద్రింపబడ్డాయి. పూర్తి అనువాదం 1868లో వెలువడింది. సంస్కృతం నుండి రష్యన్లోనికి “శకుంతల” నాటకం, పద్యకావ్యాలు “రఘువంశం”, “మేఘసందేశం” ‘ఒలోగ్థా’లో ప్రచురించబడ్డాయి.

“శకుంతల” ఆకర్షణ, విశిష్టత ఎందులో వుంది? పాఠకుని భావనను, ప్రేక్షకుని భావనను పదిహేను వందల ఏళ్లుగా అది ఉత్తేజపరుస్తూ వున్నదంటే కారణమేమిటి? దాని ప్రధానమైనవిశిష్టత నాటకీయ వస్తువులోగాని, లేదా దాని జటిలమైన సంభాషణల్లోగాని లేదని నా విశ్వాసం. అద్భుతమైన ప్రకృతి పరిసరాలలో వికసించే మానవ భావాలను చిత్రించ డంలోని నైపుణ్యం మిమ్మల్ని ముఖ్యంగా ముగ్ధులను గావిస్తుంది.

దుష్యంతుని ఎడల శకుంతల అనురాగం చక్కని నగిషీ వనితనంతోనూ, ఉత్తేజితమైన మనోభావ విజ్ఞతతోనూ చిత్రింపబడింది.ఈ కావ్యంలో చిత్రింపబడిన రస సముదాయం ఎంత రమ్యంగా, ఎంత పరవశత్వం కలిగించేదిగా వున్నదంటే కాళిదాసు నాటకం లోని యీ యిరువురి ప్రేయసీ ప్రేమికుల తొలివలపు దృశ్యం వంటి హృదయంగ మమైన దృశ్యాలు ప్రపంచ సారస్వతంలో కొద్దిగా మాత్రమే వున్నవని చెప్పడానికి సాహసించవచ్చును.కాని ప్రధాన పాత్రల ప్రేమగాథతో నాటకీయ వస్తువు ముగిసిపోదు. “శకుంతల”లో ప్రాచీన భారత దేశ ప్రజల జీవితం గురించి, ఆచార వ్యవహారాల గురించీ సోవియెట్ పాఠకునికి కుతూహలాన్ని కలిగించే విషయాలు చాలా కనిపిస్తాయి; సోవియెట్ పాఠకుడు భారతీయ నాటకరంగ ప్రత్యేక శైలిని తెలుసుకుంటాడు.– వి. కొర్నియేవ్