ArticlesNews

మన్యం విప్లవం.. మహోద్యమం.. అల్లూరి సీతారామరాజు

5views

( మే 7 – అల్లూరి సీతారామరాజు వర్ధంతి )

జాతీయ కాంగ్రెస్‌తో, గాంధీజీ సిద్ధాంతాలతో సరిపడక తీవ్ర జాతీయ వాదంతో వెల్లువెత్తిన ఆవేశం ఉంది. అవే వీర సావర్కర్‌, ‌చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌భగత్‌సింగ్‌, ‌సుభాష్‌ ‌చంద్రబోస్‌, ‌చిట్టగాంగ్‌ ‌సూర్యసేన్‌ ‌వంటివారు, వ్యక్తిగత హోదాలో డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌వంటివారు సాగించిన పోరాటాలు, అనుశీలన్‌ ‌సమితి, రామదండు వంటి సంస్థల ఉద్యమాలు కూడా. కొండకోనలలో జరిగిన గిరిజనోద్యమాలు ఈ అర్ధ శతాబ్ది కాలంలోనే గుర్తింపునకు నోచు కుంటున్నాయి. వాటి అధ్యయనం, నమోదుతోనే భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర క్రమంగా సమగ్రతను సంతరించుకుంటున్నది కూడా. అలాంటి గిరిజనోద్యమాలలో కీలకమైనది తూర్పు కనుమలలో జరిగిన విశాఖ మన్య విప్లవం. ఈ విప్లవ నాయకుడు అల్లూరి శ్రీరామరాజు. మైదాన ప్రాంతం నుంచి మన్యం వెళ్లి, గిరిజనులను ఏకం చేసి భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఏనాటికీ మరచిపోలేని ఒక మహోద్య మాన్ని నిర్మించారు శ్రీరామరాజు

జూలై 4, 1897న హేవళంబి నామ సంవ త్సరం, ఆషాఢ శుద్ధ చవితి, ఆదివారం నాడు శ్రీరామ రాజు విశాఖ జిల్లా భీమునిపట్నానికి సమీపంలోని పాండ్రంగిలో అమ్మమ్మగారింట పుట్టాడు. వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతుల తొలి సంతానం. తరువాత సీత, సత్యనారాయణరాజు కూడా ఆ దంపతులకు కలిగారు. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. శ్రీరామరాజు 1917, శ్రావణ మాసంలో విశాఖ జిల్లాలోని కృష్ణదేవిపేట వచ్చారు. అక్కడ చిటికెల భాస్కరనాయుడు అనే చిన్న భూస్వామి ఇంట చాలా కాలం ఉన్నారు. అక్కడ ఉండగానే గిరిజనులు పడుతున్న ఇక్కట్లు ఆయన దృష్టికి వచ్చాయి. ప్రధానంగా రోడ్డు నిర్మాణంలో చింతపల్లి, లంబసింగి వద్ద జరుగుతున్న ఘోరాలు తెలిశాయి.

గూడెం డిప్యూటీ తహసీల్దారు అల్ఫ్‌ బాస్టియన్‌ గిరిజనులను దోపిడీ చేస్తూ రోడ్డు పని చేయించాడు. ఈ బాధలకు తోడు అడవిని రిజర్వు చేయడం గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించింది. మన్యం మునసబులను, ముఠాదారులను, గ్రామ పెద్దలను లొంగ దీసుకోవడం, మోసగించడం బాస్టియన్‌కు నిత్యకృత్యం. గాంగంతన్న బట్టిపనుకుల మునసబు. అలాగే పెద్ద వలస ముఠాదారు ఎండుపడాలు. ఈ ఇద్దరినీ కూడా బాస్టియన్‌ మోసగించాడు. ఈ మొత్తం అసంతృప్తి ఆగ్రహంగా మారి, ఆపై ఉద్యమ రూపం దాల్చింది. దీనికి ఇరుసుగా పనిచేసిన వారే శ్రీరామరాజు.

ఉద్యమం ఆరంభానికి ముందు శ్రీరామరాజు గిరిజనులలో సంస్కరణలు తెచ్చారు. కొన్ని దురలవాట్ల నుంచి, అనైక్యత బారి నుంచి వారిని కాపాడారు. అందరితో కలసి ఆయన ఉద్యమానికి పథక రచన చేశారు. 1922 ఆగస్టు22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై రామరాజు సేన తొలిసారి దాడి చేసింది. 23వ తేదీన క్రిష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. వరుస దాడులతో బెంబేలెత్తిన బ్రిటిష్ అధికారులు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున సేనలను మోహరించింది. అయినా సీతారామరాజు సేన భయపడలేదు. పోలీస్ స్టేషన్ల పై దాడులను కొనసాగించింది. 1922 నుంచి 1924 వరకు శ్రీరామరాజు నేతృత్వంలోని వనవాసీ ఉద్యమం బ్రిటిషర్ల గుండెల్లో అలజడి రేపింది.

అల్లూరి మార్గదర్శకత్వంలో మన్యం వనవాసీలు సమాంతర స్వయంపాలన సాగించారు. పోలీస్ స్టేషన్ల పై దాడులు చేశారు. తాము దాడి చేయబోయే పోలీస్ స్టేషన్లకు ముందుగా సమాచారం పంపించడం, పట్టపగలే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం సీతారామరాజు పోరాట ధీరత్వానికి నిదర్శనం. అల్లూరి సీతారామరాజు దళం-బ్రిటిష్ సేనానులకు మధ్య 1924 మే 1 నుంచి 6 వరకు తుది పోరు సాగింది. ఈ పోరులో సీతారామరాజుకు అండగా ఉండే అగ్గిదొర బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డాడు. అప్పటికే, సీతారామరాజు ఆచూకీ తెలపాలంటూ వనవాసీలను బ్రిటిష్ సేనలు చిత్రహింసలకు గురి చేయడం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడాన్ని భరించలేని సీతారామరాజు తన సమాచారాన్ని బ్రిటిషర్లకు తెలియజేశాడు. అలా మంపా నదిలో స్నానమాచరిస్తున్న శ్రీరామరాజును బ్రిటిష్ సేన 1924 మే 7న చుట్టుముట్టి బంధించింది. మేజర్ గుడాల్ బందీగా ఉన్న అల్లూరిని ఓ చెట్టుకు కట్టేసి కాల్చి చంపాడు. ఆయన పార్థివ దేహాన్ని తాండవ నది ఒడ్డున దహనం చేశారు. అలా ఓ స్వరాజ్య భానుడు అస్తమించాడు. సీతారామరాజు భౌతికంగా జీవించింది 27 సంవత్సరాలే అయినా భారతీయుల గుండెల్లో ఆయన ఎప్పటికీ సజీవులే.