News

డిజిటల్‌ రూపంలో తాళపత్ర గ్రంథాలు

65views

అనంతపురం జిల్లాలో లభించిన పురాతన తాళపత్ర గ్రంథాలను డిజిటల్‌ రూపంలోకి మారుస్తున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. వారసత్వ సంపద పరిరక్షణ అంశంపై రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనశాల శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లా వాసరత్వ సంపద, సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. చారిత్రాత్మక సంపదను కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్ఞాన భారతం కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటూ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా ప్రముఖులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల వద్ద, దేవాలయాలు, మఠాలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ఉన్న తాళపత్ర గ్రంథాల వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందించి సహకరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మ్యూజియం శాఖ సహాయ సంచాలకుడు స్వామి నాయక్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ జశ్వంతరావు, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి నాయుడు, టూరిజం శాఖ అధికారి జయ కుమార్‌, ఎస్కేయూ రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఇంటాక్‌ కన్వీనర్‌ రాంకుమార్‌, కో కన్వీనర్‌ పిడతల కృష్ణమూర్తి తదితరులు సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.