
విద్యార్థి అంతరంగంలోని అంధకారాన్ని తరిమికొట్టి జ్ఞానకాంతులతో నింపేవాడు గురువు. అలాంటి వారిలో మొదటి స్థానం తల్లిదండ్రులది. రెండోస్థానం విద్యాబుద్ధులు నేర్పించేవారిది. మేధస్సు వికసించే వేళ శిష్యుడికి గురువే దేవుడు అవుతాడు. గురువు పరబ్రహ్మ స్వరూపుడని అనేది అందుకే. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత గురువును స్మరించేవాడు. శిల వంటి శిష్యుడు శిల్పంగా మారేది ఉలి వంటి గురువు బోధనల వల్లే. గురువు స్థానానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే అందరి వందనాలు అందుకునే శ్రీరామచంద్రుడు గురువు విశ్వామిత్రుడి ముందు మోకరిల్లాడు. ఒజ్జ స్థానం అంత గొప్పది కాబట్టే శ్రీకృష్ణుడు గురువు సాందీపుడికి అతడి మృతశిశువును గురుదక్షిణ కింద సజీవంగా తెచ్చి ఇచ్చాడు. గురువును గౌరవించనివారు జీవితంలో రాణించలేరు. కౌరవులే అందుకు ఉదాహరణ. తనను మార్గదర్శిగా మన్నించాడు కనకనే మౌర్య చంద్రగుప్తుణ్ని మహావీరుడిగా తీర్చిదిద్దాడు కౌటిల్యుడు. దానవుడైనా… హిరణ్యకశిపుడు తన కొడుకుకు విద్యాబుద్ధులు నేర్పడానికి చండామార్కులను ఆశ్రయించాడు.
మానవీయ విలువలకు పట్టం గట్టే వాల్మీకి రామాయణంలో పలురకాల గురువులు కనిపిస్తారు. రాముడు భరతుడికి రాజనీతి ధర్మాలు, లక్ష్మణుడికి విలువిద్య మర్మాలు బోధిస్తే, అరుంధతి సీతమ్మవారికి పాతివ్రత్య సూత్రాలు నూరిపోస్తుంది. జాంబవంతుడు ఆంజనేయుడిలోని అమేయ శక్తిసామర్థ్యాలను తట్టి లేపుతాడు. కాబట్టే హనుమ సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. గురుబోధన వల్ల శిష్యుడిలో ఆత్మస్థైర్యం వృద్ధిచెందుతుంది. తిరస్కరించినప్పటికీ ద్రోణాచార్యుడి పిండి విగ్రహం ముందుంచుకుని విలువిద్య ఒడుపులను అభ్యసించాడు ఏకలవ్యుడు. పరోక్షంలో అయినా సరే గురువు ప్రమేయం లేనిదే చదువులు సక్రమంగా సాగవు.
విధుల ప్రకారం గురువుల తరగతులు వేరువేరు. అక్కున చేర్చుకుని అక్షరాభ్యాసం చేయించేవారు ఉపాధ్యాయులు. మార్గదర్శనంతో ఉన్నతస్థానానికి చేర్చేవారు ఆచార్యులు. విజ్ఞానరంగంలో నిష్ణాతుణ్ని చేసేవారు బోధకులు. అబ్బిన జ్ఞానం సద్వినియోగమయ్యేలా సాధన చేయించేవారు శిక్షకులు. ఉత్తముడైన గురువు బ్రహ్మజ్ఞానంతోపాటు లోకజ్ఞానాన్నీ బోధిస్తాడు. యాగరక్షణ మిషతో తన వెంట తీసుకెళ్లిన రామచంద్రులకు సంచార మార్గంలోనే అఖండ భారతావనిని పరిచయం చేశాడు విశ్వామిత్రుడు. వాల్మీకి మహర్షి వేదాలతో పాటు సంగీత సాహిత్యాలలోనూ సాధన చేయించాడు కాబట్టే కుశలవులు ఆటపాటలతో అయోధ్యవాసులను ఆకట్టుకున్నారు. పరమార్థం సాధించేలా విద్యాభ్యాసం చేయించేవాడే అసలైన గురువు. జీవిత పాఠాలు నేర్పించే ప్రకృతి కూడా ఒక విధంగా గురువే!
‘అష్టాంగ మార్గం’ ద్వారా దుఃఖ నివృత్తిని బోధించిన గౌతమ బుద్ధుడు, ప్రేమా క్షమా గుణాలను మానవాళికి ప్రబోధించిన ఏసు క్రీస్తు, ప్రశ్నించే పద్ధతి ద్వారా ప్రపంచానికి జ్ఞానం అందించిన సోక్రటీస్, సామాజిక నైతికతపై సిద్ధాంతాలను రూపొందించి ప్రచారం చేసిన కన్ఫ్యూషియస్… ఇలాంటి వారెందరో మానవాళి చరిత్రను మలుపు తిప్పిన మహాగురువులు. విద్యలేనివాడు వింత పశువు అంటారు. పశుదశ నుంచి మనిషిని మనీషిగా తీర్చిదిద్దే గురువులకు సర్వదా శిరస్సు వంచి నమస్కరించాలి.





