ArticlesNews

బంజరు భూమిని అడవిగా మార్చిన ఉపాధ్యాయుడు

69views

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛింద్వారా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన తల్లి కోరికను తీర్చడానికి అసాధారణమైన కార్యాన్ని తలపెట్టాడు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసి బీడుగా ఉన్న బంజరు భూమిలో వేలాది మొక్కలు నాటి దట్టమైన అడవిగా మార్చాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన మహేశ్​ సారథి, తన భార్యతో కలిసి 7 ఎకరాల భూమిలో ఈ అద్భుతాన్ని సృష్టించారు. వీరి కృషి ఫలితంగా నేడు ఆ బంజరు భూమి పచ్చని అడవిలా మారింది. అతని తల్లి కల నెరవేరింది.

బీడు భూమిలో టేకు వనం
ఒకప్పుడు ఎడారిలా ఉన్న ఆ కొండ ప్రాంతం, మహేశ్​ పట్టుదల కారణంగా నేడు టేకు వనంగా మారింది. వాస్తవానికి మహేశ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు. కనుక ఉద్యోగ రీత్యా మొదట్లో వ్యవసాయం చేయడం సాధ్యం కాలేదు. దీనితో ఆ భూమి క్రమంగా నిస్సారంగా మారిపోయింది. పైగా కొండ దిగువన నీటి ఎద్దడి ఉంది. అయినా మహేశ్ నిరాశ చెందలేదు. మొదట అక్కడ ఒక బావిని తవ్వించి, ఆపై మొక్కలు నాటడం ప్రారంభించారు. సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో టేకు, ఉసిరి, వేప, రోజ్​వుడ్​ సహా అనేక రకాల పండ్ల మొక్కలు కూడా నాటారు. అందుకు ఆయన భార్య (ఉపాధ్యాయురాలు) కూడా ఎంతో సహకరించింది. చివరికి వీరి కృషి ఫలితంగా అది నందనవనంగా మారిపోయింది. ఉపాధ్యాయ దంపతుల చేసిన కృషికి గాను అటవీ శాఖ ఆ జంటను ఘనంగా సత్కరించింది.

వన్యప్రాణులకు నిలయం
వారు సృష్టించిన ఈ 7 ఎకరాల దట్టమైన అడవి నేడు వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసంగా మారింది. ఇక్కడ నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు సహా రకరకాల పక్షులు నివసిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నెమళ్ల, వివిధ రకాల పక్షుల కిలకిలరావాలతో ఈ అడవి మారుమోగుతుంటుంది.

అమ్మ స్ఫూర్తితోనే బంజరు భూమిని అడవిగా మార్చిన మహేశ్​ 

“మా తల్లి జుగియా బాయికి మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం. ఆమె స్ఫూర్తితోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మేమిద్దరం ఉపాధ్యాయులం కావడంతో వ్యవసాయం చేయలేకపోయాము. అందుకే చందాదేవ్ కొండ దిగువన వద్ద ఉన్న మా పూర్వీకుల భూమిని అడవిగా మార్చాలని నిశ్చయించుకున్నాం. 1997 నుంచి 2010 వరకు మేము నాటిన మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దవయ్యాయి. పరాసియా అటవీ ప్రాంతం పరిధిలో ఉన్న ఈ భూమిలో 5,124 టేకు చెట్లు, 334 ఉసిరి, 15 వేప, 10 మోదుగ (పలాష్), 10 కానుగ (కంజి), 2 తుమ్మ, 3 రోజ్‌వుడ్ చెట్లు ఉన్నాయి. మొత్తం 11,575 మొక్కలు నాటాను. దీనితో నేడు ఇది పచ్చని అడవిగా మారింది.”
– మహేశ్​ సారథి, రిటైర్డ్ టీచర్

రూ.40 లక్షల వ్యయం – భారీ రాబడి
ఈ అడవిని సృష్టించడానికి మహేశ్​ సారథి తన జీవితమంతా కష్టపడి చేసుకున్న పొదుపు సహా ఇన్సూరెన్స్, లోన్ ద్వారా సమకూర్చుకున్న రూ.40 లక్షలు ఖర్చు చేశారు. దీనికితోడు ఛింద్వారా అటవీ పరిశోధన కేంద్రం నుంచి ఆయనకు రూ.15వేలు ప్రోత్సాహకం కూడా లభించింది. ఈ దీనితో ఈ భారీ అటవీ ప్రాంతం సృష్టించడం సాధ్యపడింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఒక్కో టేకు చెట్టు సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 విలువ పలుకుతోందని ఆయన తెలిపారు.

ఈ అడవిని పర్యవేక్షిస్తున్న కమల్ సల్లామ్ మాట్లాడుతూ, “సాధారణంగా ప్రజలు చిన్న భూమి దొరికినా లాభాల కోసం చూస్తారు. కానీ మహేశ్​ పర్యావరణ పరిరక్షణ కోసం నడుం కట్టారు. సమీపంలోని చంద్‌షా వలీ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు కూడా ఈ పచ్చదనం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోంది” అని చెప్పారు.

అటవీ శాఖ ప్రశంసలు
పరాసియా ఫారెస్ట్ రేంజర్ అల్కా భూరియా, మహేశ్ దంపతులు చేసిన ఈ గొప్ప ప్రయత్నాన్ని కొనియాడారు. “బంజరు భూమిని దట్టమైన టేకు వనంగా మార్చడం చాలా గొప్ప విషయం. వన్యప్రాణులకు ఆవాసం కల్పించడం అభినందనీయం. పర్యావరణాన్ని కాపాడటానికి మిగిలిన భూయజమానులు కూడా ఇలాగే ముందుకు రావాలి” అని ఆమె పిలుపునిచ్చారు.