ArticlesNews

నక్సల్స్ ముక్త భారత్

86views

దేశంలో నక్సలిజం అంతమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మార్చి 30న పార్లమెంటులో సగర్వంగా ప్రకటించటం హర్షణీయం. సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగ పరిష్కార మార్గాలున్నాయని, వాటిని వదలి ఆయుధాలు చేపట్టడం సరికాదని అన్నారు. ఆయుధాలు వదిలిపెట్టిన వారితోనే ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ఆ విధంగా జనజీవన స్రవంతిలో కలసినవారికి పునరావాసం కల్పిస్తుందని మరోసారి తెలిపారు.

సమసమాజాన్ని నిర్మిస్తామని ప్రారంభమైన కమ్యునిస్టు పార్టీ నుంచే నక్సలిజం ఉద్యమం ఉద్భవించింది. సమాజంలో వర్గ విభేదాన్ని సృష్టించి ఉన్నవాళ్లు ` లేనివాళ్లు అని విడదీసి విద్వేషాన్ని రెచ్చగొట్టింది. పర్యవసానంగా మన దేశంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయాయి. సల్వాజుడం కేసులో 2011లో నక్సల్స్‌కు అనుకూలంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా, 2005లో ప్రభుత్వ మద్ధతుతో నక్సలిజం నిర్మూలనకై గ్రామ రక్షణ దళాల పేరుతో ప్రజా ఉద్యమంగా ఉద్భవించిన సల్వాజుడుంకు రక్షణ కరువైంది. తత్ఫలితంగా సల్వాజుడుం స్థాపకులైన మహేంద్రకర్మతో సహా అనేకమంది నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టినవారిపట్ల మానవత్వం ప్రదర్శించాలని కాంగ్రెస్ పార్టీ సుద్దులు చెబుతున్నది. అర్బన్ నక్సల్స్ వ్యాసాలు, పుస్తకాలు రాస్తున్నారు. వీరంతా నక్సల్స్ బారిన పడి చనిపోయిన పౌరుల గురించి కాని, భద్రతా బలగాల గురించి కానీ ఎందుకు వ్యాసాలు రాయడం లేదు? వారి ప్రాణాలకు విలువ లేదా?

విదేశీ ప్రేరణతో మన దేశంలో ఏర్పడిన కమ్యునిస్టు పార్టీ ఏమి ప్రేరణ ఇవ్వగలదు. భారతీయ మూలాల్లోనే ఒకరిపట్ల మరొకరిపై విద్వేషాన్ని రెచ్చగొట్టే ఆలోచనే లేదు. ఉన్నవారు ` లేనివారు అనే రెండు వర్గాలుగా మన సమాజం చూడలేదు. లేనివారికి ఉన్నవారు సహకారం అందిస్తూనే మనమంతా ఒకటే అనే ఐక్యతా రాగం అనాదిగా ఈ దేశంలో పరిఢవిల్లుతున్నది. దేశాన్ని 2026 మార్చి 31 నాటికి నక్సలిజం నుంచి విముక్తం చేయడానికి సంకల్పించిన సందర్భంగా మన భద్రతా బలగాలు చేసిన పోరాటం శ్లాఘనీయం. ఉదాహరణగా తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహిద్దులోని దట్టమైన అడవి ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట’ ద్వారా విజయం పొందడం అమోఘం.

ఎస్సీ, ఎస్టీ సమస్యల నేపథ్యంలో నక్సలిజం ప్రారంభమైందని చెబుతున్నప్పటికీ దీర్ఘకాలంలో గిరిజనులు ఎక్కువగా నష్టపోయారని ఇంటర్నల్ సెక్యూరిటి స్టడీస్, జాతీయ మానవ హక్కుల కమిషన్, హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి రిపోర్టులు చెబుతున్నాయి. హింస, అభివృద్ధి లోపం వంటి సమస్యలు ఎస్సీల జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని ఎదుర్కొనడానికి సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నది. మరోవైపు నక్సల్స్ ప్రభావిత గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల నక్సలిజం మూలాలను అంతం చేయగలిగింది. ఫలితంగా నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాయుధ పోరాటం కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ శాశ్వత పరిష్కారమని ప్రజలు గ్రహించటం ప్రారంభించారు. అందుకే వారికి ప్రజాదరణ తగ్గింది. ప్రజల మద్దతు లేకుండా ఏ ఉద్యమం కోనసాగలేదనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ నేపథ్యంలో తుపాకులను వదిలిపెట్టి నక్సలైట్లు లొంగిపోవడం హర్షనీయం.

బస్తర్, బీజాపూర్ అటవీప్రాంతంలో నక్సల్స్ ప్రభావం పూర్తిగా తగ్గడం పరిశీలిస్తే, నక్సల్స్ ఏరివేత అనేది ప్రభుత్వ సంకల్పం, భద్రతా బలగాల వ్యూహాత్మక పటిష్టత స్పష్టంగా గోచరిసున్నది. ఇది కేవలం నియంత్రణ కాదు. ముగింపుగా సాగుతున్న ప్రయాణమని కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం పేర్కొంది. తిరుపతి నుంచి నేపాల్ వరకు ఎర్రజెండా ఎగురవేయాలన్న మావోయిస్టుల కల కరిగిపోయంది. తుపాకులు గర్జించిన చోటే నేడు బడి గంటలు మోగుతున్నాయి. వైద్యశాలలు వెలిశాయి. రేషన్ షాపులు ప్రారంభమైనాయి. ‘బస్తర్ ఫైటర’ వంటి కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి కల్పనతోపాటు వారినే భద్రతా వ్యవస్థలో భాగస్వాములను చేశారు. మరోవైపు క్రీడల ద్వారా గిరిజన యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపగలుగుతున్నారు. ఇంత గొప్ప మార్పు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత సాకారమౌతున్నప్పటికీ ప్రతిపక్షాలకు రుచించడం లేదు. 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ సమస్య పరిష్కారం వైపు అడుగులు వేయకపోగా నేడు కూడా అర్బన్ నక్సల్స్‌తో అంటకాగుతున్నది. పేరుమోసిన నక్సలైటు హిడ్మా మరణించిన సందర్భంగా ఇండియా గేటు వద్ద ఉదార వామపక్షవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఒక్క హిడ్మా మరణిస్తే ప్రతి ఇంటి నుంచి హిడ్మాలు పుట్టుకొస్తారని నినదించారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్ ద్వారా పోస్టు చేయడం దురుదృష్టకరం.

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు సోనియాగాంధి నేతృత్వంలో ఏర్పాటు చేసిన నేషనల్ అడ్వైజరీ కమిటీలో అందరూ అర్బన్ నక్సలైట్లు ఉండడం కూడా నక్సల్స్ పట్ల కాంగ్రెస్ వైఖరిని తెలియజేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సల్స్ రహిత భారత్ సంకల్పం నెరవేరినట్లే. ఇప్పటి వరకు నక్సల్స్ కారణంగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు మౌలిక సదుపాయాలతో సహా అన్ని రంగాలలో శరవేగంగా ముందుకెళతాయని ఆశిద్దాం.