News

ప్రకృతి సేద్యం..

74views

ప్రకృతి వ్యవసాయంలో మహిళలు సైతం విశేషంగా రాణిస్తున్నారు. రసాయనాల ప్రమేయం లేని ఆహారాన్ని పండిస్తూ తమ కుటుంబాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కృషి చేస్తున్నారు. బయట వారికి విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నారు. వీరి ఆసక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం బాగుండటంతో ఈ రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.

  • ప్రస్తుతం మార్కెట్‌లో సేంద్రియ పంటల ఉత్పత్తులకు గిరాకీ అధికమైంది. ప్రకృతి సేద్యంపై మొగ్గు చూపే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేషనల్‌ మిషన్‌ అండ్‌ నేచురల్‌ ఫామింగ్‌ పేరిట ప్రభుత్వాలు దీనికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తోంది. వ్యవసాయ భూములున్న డ్వాక్రా మహిళలను వీటికి ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 46 వేల మహిళలు 52 వేల ఎకరాల్లో దీనిని నిర్వహిస్తున్నారు. వరి, కూరగాయలు, వేరుశెనగ, అరటి, కొబ్బరి తదితర పంటలు పండిస్తున్నారు. అధికారులు ఇప్పుడు కొత్తగా ఉత్సాహం చూపిస్తున్న మరో 217 గ్రామైక్య సంఘాలను సైతం దీని నిమిత్తం గుర్తించారు.
  • ఉర్వి (భూమి) పేరిట ప్రేత్యేక యాప్‌లో ప్రకృతి సాగు పంటల వివరాలన్నీ ప్రాజెక్టు సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఇందులో పంటల్లోని మార్పులు, దిగుబడి తదితర అన్ని వివరాలు పొందుపరుస్తున్నారు. వీరి పరిశీలనలో ప్రస్తుతం జిల్లాలో అయిదు వేల మంది మహిళా రైతులు ఇందులో నిలదొక్కుకొని ముందుకు సాగుతున్నట్లు గుర్తించారు. ఇందులో పంటలకు చీడ, తెగుళ్ల సమస్య ఉండదు. ఎరువులు, పురుగుల మందుల వాడకం సైతం అవసరం లేకపోవడంతో రైతులకు పెట్టుబడి సొమ్ము చాలా వరకు ఆదా అవుతుంది. గతంలో వీరికి ఏడాదికి ఎకరం వరికి సుమారు రూ. 30 వేలు వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఇది రూ. 6 వేలతో సరిపోయి ఎప్పటిలాగానే దిగుబడి పొందుతున్నారు.
  • అనకాపల్లి జిల్లాలోని కశింకోట మండలానికి చెందిన కుండ్రపు అరుణ తన 1.20 ఎకరాల భూమిలో పాత పద్ధతిలో సాగుకు ఏడాదికి రూ. 25 వేలకు పైగా ఖర్చు చేసేవారు. దీని ద్వారా రూ. 40 వేలు వచ్చేది. ప్రకృతి సేద్యంతో ఇప్పుడు పెట్టుబడి రూ. 8 వేలకే పరిమితమై ఆదాయం రూ.43 వేలకు పెరిగింది. దీనిద్వారా రూ. 35 వేల లాభం సాధించిన ఆమె అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ సాగును మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ లచ్చన్న తెలిపారు. ఘన, ద్రవ జీవామృతాలు, నిమాస్తృం, కషాయాలు, విత్తనాల తయారీకి బయో రిసోర్స్‌ సెంటర్లు (దుకాణాలు) ఏర్పాటు చేసి అందరికీ వీటి ప్రయోజనాన్ని వివరిస్తామని చెప్పారు.