ArticlesNews

ఏఐ, డిజిటలైజేషన్‌తో తిరుమలలో సరికొత్త విధానాలు

85views

లియుగ వైకుంఠం తిరుమలలో ఆధ్యాత్మికతకు అత్యాధునిక సాంకేతికత తోడైంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శకతను పెంచడం, భద్రతను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా తితిదే తిరుమల తిరుపతి దేవస్థానం విప్లవాత్మక అడుగులు వేస్తోంది. దాతల సహకారంతో అత్యాధునిక టెక్నాలజీని కొండపైకి తీసుకొచ్చింది.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.. 

దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)ను తితిదే అందుబాటులోకి తెచ్చింది. ఎన్‌ఆర్‌ఐల దాతృత్వంతో సుమారు రూ.20 కోట్లతో వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఫేస్‌ రికగ్నిషన్‌ సాంకేతికత ద్వారా భక్తుల ముఖ కవలికలు  బట్టి వారు పడుతున్న ఇబ్బందులను ఇది పసిగడుతుంది. తప్పిపోయిన వారిని ఇట్టే గుర్తిస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది ఉన్నారు? ఎంత సమయం పడుతుంది? తదితర వాస్తవ పరిస్థితులను 3డీ మ్యాప్‌ల ద్వారా విశ్లేషిస్తుంది.

కొనుగోళ్లలో పారదర్శకత

సంవత్సరానికి సుమారు రూ.700 కోట్ల విలువైన 97 రకాల దినుసుల కొనుగోళ్లలో గుత్తాధిపత్యానికి తెరదించుతూ, తితిదే కొనుగోళ్ల వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసింది. టెండర్లలో పాల్గొనేందుకు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అలిపిరి మార్గంలో ‘ఏఐ’ పహారా..

డక దారిన వచ్చే భక్తుల రక్షణ కోసం అలిపిరి మార్గంలో ఏఐ ఆధారిత సోలార్‌ కెమెరాలు, అత్యాధునిక డ్రోన్లను తితిదే రంగంలోకి దించింది. 360 డిగ్రీల కోణంలో 400 మీటర్ల దూరం వరకు చిరుత, ఎలుగుబంటి తదితర వన్యప్రాణుల కదలికలను ఈ కెమెరాలు గుర్తిస్తాయి. మొత్తం 125 కెమెరాలకు ప్రస్తుతం 12 అందుబాటులో రాగా.. వీటి ఆధారంగా వెంటనే అలారం మోగించి వన్యప్రాణులను అడవిలోకి పారదోలడంతో పాటు, కమాండ్‌ కంట్రోల్‌కు సమాచారం అందిస్తాయి.

ప్రసాదాల్లో కల్తీకి చెక్‌

శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల తయారీలో వినియోగించే ముడిసరకుల్లో ఎలాంటి కల్తీ జరగకుండా ఉండేందుకు రూ.20 కోట్లతో ఫుడ్‌ సేఫ్టీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రమాణాలతో అత్యాధునిక ల్యాబ్‌ను తితిదే నెలకొల్పింది. నెయ్యి, పాలు, నూనెల్లో కల్తీని పీపీటీ (పార్ట్స్‌ పర్‌ ట్రిలియన్‌) స్థాయిలో అంటే అత్యంత సూక్ష్మమైన కల్తీని సైతం ఇది పసిగడుతుంది. రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన ‘ఈ-నోస్, ఈ-టంగ్‌’ పరికరాలు వాసన, రుచి ఆధారంగా నెయ్యి స్వచ్ఛతను కచ్చితంగా తేలుస్తాయి.

స్మార్ట్‌గా పాదరక్షల నిర్వహణ

తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో పాదరక్షలు అస్తవ్యస్తంగా పడి ఉండటం, భక్తులు పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు తితిదే క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ‘స్మార్ట్‌ షూ కీపింగ్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సహకారంతో ఇది విజయవంతంగా నడుస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, సులభంగా డిపాజిట్‌ చేసి, దర్శనం అనంతరం వేగంగా తిరిగి పొందుతుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.