News

“నక్సలిజం”చరిత్రను బయటపెట్టిన అమిత్ షా..

77views

నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్రం ఆపరేషన్ కగార్ నిర్వహించింది. కేంద్ర హోమంత్రి గతేడాది స్పష్టంగా చెప్పారు. మార్చి 31, 2026 వరకు డెడ్‌ లైన్ విధించారు. మావోయిస్టులు ఎక్కడ ఉన్నా అందరూ లొంగిపోవాలని పిలపునిచ్చారు. మార్చి 31 వరకు మావోయిస్టు రహిత భారత్‌గా చేయాలన్నది అమిత్‌ షా లక్ష్యం. ఇప్పటికే దాదాపు అందరు నక్సలైట్లు లొంగిపోయారు. ఈ తరుణంలో సోమవారం పార్లమెంట్‌లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

అమిత్ షా ప్రసంగిస్తూ ఇందిరా గాంధీ హయాంలో నక్సల్ భావజాలానికి రాజకీయ మద్దతు లభించిందని ఆరోపించారు. “పేదరికం వల్ల నక్సలిజం రాలేదు, నక్సలిజం వల్లే పేదరికం పెరిగింది (గరీబీ కే కరణ్ నక్సల్వాద్ నహీ ఫైలా, బాల్కీ నక్సల్వాద్ కే కరణ్ గరీబీ ఫైలీ)” అంటూ షా చేసిన వ్యాఖ్య ప్రతిపక్షాల వాదనను తలకిందులు చేసింది. ఆయుధాలు పట్టే వారు చర్చలకు వస్తే సరే, లేదంటే బలప్రయోగం తప్పదని మరోసారి హెచ్చరించారు షా. గడిచిన ఆరు రోజుల్లో తాను నక్సలైట్లను సమర్థించే 2,000 వ్యాసాలను సమీక్షించానని, అవి బాధితుల పట్ల సానుభూతి చూపడం లేదని షా మండిపడ్డారు. తమ ప్రభుత్వం నక్సలిజంపై పోరాటంలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో ముందుకు వెళ్తోందని అమిత్ షా వివరించారు. 2019 ఆగస్టు 20న హోం శాఖలో జరిగిన కీలక సమావేశం ద్వారా పునరావాస కార్యక్రమాలకు పునాది పడిందని, 2024 ఆగస్టు 24న తాను చేసిన ప్రకటన ప్రకారం మార్చి 31, 2026 నాటికి భారత్ పూర్తిస్థాయిలో నక్సల్ రహిత దేశంగా మారుతుందని స్పష్టం చేశారు. రాత్రి 7:25 గంటల వరకు సాగిన అమిత్ షా 90 నిమిషాల ప్రసంగం, కేవలం ఒక ప్రకటనలా కాకుండా గణాంకాలు, చరిత్ర, బలమైన రాజకీయ సందేశాల కలయికలా సాగింది. నిశ్శబ్దంగా మొదలైన షా ఉనికి, చివరకు సభలో ప్రతిపక్షాల నినాదాల మధ్య ఒక గర్జనలా ముగిసింది. అమిత్ షా వేసిన ఈ వ్యూహాత్మక అడుగు నక్సలిజంపై ప్రభుత్వ పట్టును, రాజకీయ పటిమను చాటిచెప్పింది. ఆ 90 నిమిషాల్లో అమిత్ షా నిశ్శబ్దంగా నోట్స్ రాసుకోవడం నుంచి చరిత్ర, సమాచారం, వాక్చాతుర్యాన్ని మేళవించి దూకుడుగా, పూర్తిస్థాయి రాజకీయ ఎదురుదాడికి దిగారు.