
హిందూ దేవాలయ భూముల ఆక్రమణలు అడ్డుకుని, శిథిల ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించామని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. జనతా వారధితో పాటు పలు పర్యటనల్లో హిందూ ఆలయ ధర్మకర్తలు, భక్తుల నుంచి ఆయా సమస్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఇటీవలి పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఆకివీడు రామాలయం పునర్నిర్మాణంలో జరిగిన అల్లర్లు, శ్రీరామ నవమి రోజున ఉప సభాపతిపై దాడియత్నం, కొందరికి తీవ్ర గాయాలవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి అల్లర్లను ప్రోత్సహించే సూత్రాధారులపై చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి పేరుతో 8 వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములను ప్రభుత్వం తీసుకుంది. రూ.లక్షల కోట్ల విలువైన భూమి ఆక్రమణలకు గురైంది. 1.50 లక్షల ఎకరాలకుపైగా ప్రైవేటు వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి.
వీటిపై దర్యాప్తు జరపకుండా ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని ప్రకటించడం ఆందోళనకరం. 33 ఏళ్ల దీర్ఘకాలిక లీజు పేరుతో అర్బన్ ప్రాంతాల్లోని ఆలయ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానం సరికాదు. కొందరు అధికారులు గత ప్రభుత్వ ఆలోచనలు కొనసాగిస్తూ ఆలయ భూములు దోచిపెట్టాలన్న ధోరణితో వ్యవహరించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోంది’ అని మాధవ్ తెలిపారు.





