News

విచక్షణ కోల్పోయి చిన్నారులపై కుతుబుద్దీన్‌ దాష్టీకం

99views

ఎటో వెళ్లిపోయిన అమ్మ గురించి కన్నబిడ్డలు అడుగుతుంటే ఆ తండ్రి సహించలేకపోయాడు. విచక్షణ కోల్పోయి చిన్నారులని కూడా చూడకుండా నిత్యం వారితో అమానుషంగా ప్రవర్తిస్తూ హింసించేవాడు. ఈ విషయం ఎట్టకేలకు పోలీసులకు తెలియడంతో వారు ఆ బాలలకు నరకం నుంచి విముక్తి కల్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేటలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఆదుపల్లికి చెందిన బైక్‌ మెకానిక్‌ ఎండీ కుతుబుద్దీన్‌ భార్యకు మతిస్థిమితం లేకపోవడంతో నెల రోజుల క్రితం ఎటో వెళ్లిపోయింది. అనంతరం ఇద్దరు పిల్లలతో అతడు ఇక్కడికి వచ్చేసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కుమార్తె షిపాకు 9 ఏళ్లు కాగా కుమారుడు షాన్‌వాజ్‌కు ఏడేళ్లు. పిల్లలు ఎప్పుడూ తల్లి గురించి అడగుతుండటాన్ని కుతుబుద్దీన్‌ సహించలేకపోయేవాడు. ఎప్పుడు ఆ విషయం అడిగినా ఇద్దరికీ వాతలు పెట్టి హింసించేవాడు.

బయటికు వెళితే చంపేస్తానని భయపెట్టి ఉదయం షాపునకు వెళ్లి, సాయంత్రం వచ్చి భోజనం పెట్టేవాడు. అప్పటి వరకు ఆ పిల్లలు రోదిస్తూ ఆకలితో అలా ఉండాల్సిందే. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది పన్ను వసూలు కోసం కుతుబుద్దీన్‌ ఇంటికి వెళ్లగా ఆ చిన్నారుల దయనీయ స్థితి గురించి వారికి తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్సై సైదులు పిల్లలతో మాట్లాడి, తండ్రిని పిలిచి మందలించారు. ఐసీడీఎస్‌ అధికారులు కుతుబుద్దీన్‌ అనుమతితో నెల్లూరులోని చిన్నపిల్లల సంరక్షణ కేంద్రానికి చిన్నారులను తరలించారు.