News

పశ్చిమాసియా ఉద్రికత్తలు- ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా భారత్‌పై ప్రభావం: మోదీ

102views

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. సోమవారం లోక్‌సభలో ఆ అంశంపై మాట్లాడిన ప్రధాని, పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

అమెరికా– ఇజ్రాయెల్– ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది. దీని ప్రభావం భారత్‌పై కూడా పలు రంగాల్లో కనిపిస్తుందని మోదీ చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక, భద్రతా, మానవతా కోణాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు. భారత్‌కు అవసరమైన ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్)లో పెద్ద భాగం పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుందని ప్రధాని గుర్తు చేశారు. ఆ ప్రాంతం ఇతర దేశాలతో వాణిజ్యానికి కీలక మార్గంగా కూడా పనిచేస్తుందని చెప్పారు. అందువల్ల అక్కడి పరిస్థితులు దిగుమతులు, ఎగుమతులు, సముద్ర మార్గ రవాణాపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు.

దేశీయ ఉత్పత్తిని కూడా పెంచుతున్నామని మోదీ స్పష్టం
హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు భారీ స్థాయిలో చమురు, గ్యాస్, ఎరువులు వంటి కీలక వస్తువులు రవాణా అవుతున్నాయని తెలిపారు. అయితే యుద్ధ పరిస్థితుల వల్ల ఆ మార్గంలో నౌకల రాకపోకలు కష్టతరంగా మారాయని అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చూసిందని మోదీ స్పష్టం చేశారు. దేశంలో ఎల్‌పీజీ వినియోగం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. సుమారు 60 శాతం ఎల్‌పీజీ అవసరాలు దిగుమతుల ద్వారానే నెరవేరుతున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ వినియోగదారులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, అంతేకాకుండా దేశీయ ఉత్పత్తిని కూడా పెంచుతున్నామని వెల్లడించారు.

పశ్చిమాసియాలో దాదాపు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తూ పనిచేస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు. అలాగే వాణిజ్య నౌకల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై భారత్‌కు సహజంగానే ఎక్కువ ఆందోళన ఉంటుందని చెప్పారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ ఉన్న భారతీయుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని మోదీ తెలిపారు. ఇప్పటికే పశ్చిమాసియా దేశాల అధినేతలతో రెండు దఫాలుగా మాట్లాడినట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు వారు హామీ ఇచ్చారని వెల్లడించారు.

భారతీయులకు 24 గంటల హెల్ప్‌లైన్లు, ఎమర్జెన్సీ సేవలు
సంక్షోభం సమయంలో ఇప్పటివరకు 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు. ఇరాన్ నుంచి మాత్రమే దాదాపు వెయ్యి మంది తిరిగి వచ్చినట్లు చెప్పారు. అందులో 700 మందికి పైగా వైద్య విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని మరణాలు, గాయాలు సంభవించాయని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు 24 గంటల హెల్ప్‌లైన్లు, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు మోదీ పేర్కొన్నారు. విద్యలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించిందని ప్రధాని వివరించారు. దేశంలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను గణనీయంగా పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం భారత్ వద్ద 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని, వాటిని 6.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

అదేవిధంగా గతంలో 27 దేశాల నుంచి మాత్రమే ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు 41 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోందని మోదీ చెప్పారు. ఇది సరఫరా భద్రతను పెంచేందుకు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న క్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రధాని హెచ్చరించారు. కాబట్టి దేశం ఐక్యంగా ఉండి ఈ సవాళ్లను ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో చూపిన ఐక్యతను మరోసారి ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.