News

చిన్నతనం నుంచే డ్రోన్ల తయారీ – శభాష్​​ అనిపించుకుంటున్న ఓంకార్​

118views

చిన్నతనం నుంచే ఆకాశాన్ని తాకాలన్న కల ఆ అబ్బాయిది. చేతిలో చిన్న పరికరాలతో ప్రయోగాలు మొదలుపెట్టాడు. వరుస వైఫల్యాల్ని ఎదుర్కొన్నా వెనక్కి తగ్గకుండా అదే పట్టుదలతో ముందుకెళ్లాడు. ఎట్టకేలకు విజయవంతంగా డ్రోన్‌ను తయారు చేసి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు అమలాపురానికి చెందిన ఓంకార్‌. చదువుతోంది 8వ తరగతే అయినా డ్రోన్లు, శాటిలైట్ల పరిశోధనల్లో మునిగితేలుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.

ప్రధానంగా తల్లిదండ్రల ప్రోత్సాహం: సృజనాత్మకత, సాంకేతికత, సామాజిక చైతన్యం, సాహసోపేత నిర్ణయాలకు మారుపేరుగా నిలుస్తోంది ప్రస్తుత తరం. ఆ కోవకే చెందిన అమలాపురానికి చెందిన రేపాక ఓంకార్‌ ఆరో తరగతి నుంచే డ్రోన్ల తయారీ ప్రయాణాన్ని ప్రారంభించి 8వ తరగతికి వచ్చేనాటికి విజయవంతమయ్యాడు. తోటి పిల్లలంతా ఖాళీ సమయాల్లో ఆటపాటలు, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తుంటే తాను మాత్రం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సొంత ఆవిష్కరణలపై దృష్టి సారించాడు.

మొదటి ప్రయత్నాన్లో విఫలం : మొదట అట్టముక్కలు, PVC షీట్లు, పైపులతో చిన్న డ్రోన్లు తయారు చేయడం మొదలుపెట్టిన ఓంకార్‌, అయిదారు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. వెనకడుగు వేయకుండా తల్లి వాణీ కల్పన ప్రోత్సాహంతో పూర్తి ఆటోమేషన్‌తో పని చేసేలా కార్బన్ ఫైబర్‌తో పెద్ద డ్రోన్ తయారు చేసి అబ్బురపరిచాడు. డ్రోన్ల తయారీకి ఇప్పటి వరకు సుమారు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు వెచ్చించాడు.

సోషల్​ మీడియా సహాయంతో తయారీ : ఓంకార్ 6వ తరగతిలోనే డ్రోన్ తయారీలో బేసిక్స్ నేర్చుకున్నాడు. DRDOలో పని చేసిన ఓ సైంటిస్ట్ వద్ద 10 రోజులు శిక్షణ తీసుకున్నాడు. తర్వాత ఇంటి దగ్గరే సాధన చేయడం మొదలుపెట్టాడు. 7వ తరగతిలోనే అటల్ ఇన్నోవేషన్ డ్రోన్ మాడ్యువల్ పుస్తకాన్ని అవపోసన పట్టేశాడు. ఆన్‌లైన్‌లో పరికరాలు తెప్పించుకుని యూట్యూబ్​లో వీడియోలు చూసి డ్రోన్ తయారు చేశాడు. అలాగే సొంతంగా చిన్నపాటి శాటిలైట్‌నూ తయారుచేశాడు. మిషన్ ప్లానర్ అనే సాఫ్ట్‌వేర్‌ను డ్రోన్‌కు అనుసంధానించాడు. భవిష్యత్తులో మెడికల్, డెలివరీ, పోలీసుశాఖకు నిఘా కోసం ఉపయోగపడేలా డ్రోన్లు తయారుచేసే స్టార్టప్ కంపెనీ పెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఈ విద్యార్థి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.

‘నా ప్రాజెక్ట్​ పెరు మెడికల్​ ఏయిర్​ యూనిట్​. ఈ డ్రోన్స్​ అన్ని ప్రోటోటైప్స్​. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే అవి అక్కడకు చేరుకొని రక్షిస్తాయి. EXDUEI అనే సాఫ్ట్​వేర్​ ద్వారా దీనిని తయారు చేస్తాం. ముందు గడియారం నుంచి తయారు చేస్తాం. ఇది మనుషుల శరీరంలో జరిగే మార్పులను గమనించి పెచ్చరిస్తుంది’
– ఓంకార్, డ్రోన్లు తయారు చేస్తున్న విద్యార్థి

రాజమహేంద్రవరంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో ఓంకార్ తయారుచేసిన డ్రోన్లు చూసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు. గతంలో అమరావతిలో జరిగిన డ్రోన్ సమ్మిట్‌లోనూ ఓంకార్‌ పాల్గొన్నాడు. వచ్చే నెలలో బెంగళూరులో జరగనున్న డ్రోన్ ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు.

‘మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్​ బొమ్మలంటే చాలా ఇష్టం . ఒక రోజు డ్రోన్​ ఎగరడం చూశాడు. అప్పటి నుంచి స్వతహాగా డ్రోన్​ను తయారు చేయాలని అనుకున్నాడు. వీటికి కావాల్సిన వస్తువులను ఆన్​లైన్​ ద్వారా తెప్పించుకునేవాడు. మేము అన్ని విధాలుగా సహాయం చేశాం. అలానే ఇక ముందు ముందు దేశానికి కావాల్సిన డ్రోన్లను తయారు చేయాలని ఆశిస్తున్నాను’. – సత్యనారాయణ మూర్తి, ఓంకార్ తండ్రి

‘ఓంకార్​కు గాల్లో ఎగరడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉండే వస్తువులతో కూడా ఎగిరే వస్తువులను తయారు చేసేవాడు. ముందు ఎగిరే డ్రోన్​ను తయారు చేశాడు. ఆ తర్వాత తన ఆవిష్కరణలో టెక్నాలజీని ఉపయోగిస్తూ వచ్చాడు. స్టార్టప్​ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నాడు. అతనికి కావాల్సిన సహకారం మేము అందిస్తున్నాం.’
– వాణీ కల్పన, ఓంకార్‌ తల్లి

ఓంకార్ డ్రోన్ తయారీకే పరిమితం కాకుండా తాను బడికి వెళ్లడానికి ఉపయోగించే సైకిల్‌కు ఓ మోటార్‌ను అమర్చి పెట్రోల్‌తో నడిచేలా చేసి ఆశ్చర్యపరిచాడు. ఓంకార్‌లోని నైపుణ్యాలను గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన ఓ అగ్రీ కంపెనీ తమ దగ్గర ఇంటెర్న్‌షిప్ చేసేందుకు అవకాశం ఇచ్చింది.