News

జలదివాసం వీడిన సంగమేశ్వరుడు

110views

పాండవులు వనవాసం చేసిన ప్రాంతం, సప్త నదులు కలిసే సంగమ క్షేత్రంగా ప్రాచీన చరిత్ర కలిగిన సంగమేశ్వరుడు జలాదివాసం వీడి పూజలు అందుకుంటున్నాడు. 8 నెలలు నది గర్భంలో, 4 నెలలు భక్తులకు దర్శనమిచ్చే ప్రాశస్తం కలిగిన ఆలయం నది జలాలను వీడి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా జలాశయ పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు. అయితే 865-870 అడుగులకు నీరు చేరుకుంటే సంగమేశ్వర ఆలయం పూర్తిగా నదిగర్భంలో కలిసిపోతుంది. అంటే జూలై, ఆగస్టు మాసంలో ఈ ఆలయం కృష్ణానది గర్భంలో కలిసిపోతుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మహాశివరాత్రికి ముందుగానే ఆలయం నది జలాల నుంచి బయటపడి శివరాత్రి నాటికి పూజలందుకుంటుంది. కానీ ఈ ఏడాది శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గకపోవడంతో శివరాత్రికి ఆలయం పూర్తిగా బయటపడలేదు. ఉగాది నాటికంతా ఆలయం బటయ పడుతుందని ఆశించారు. అప్పటికీ కూడా ఆలయం బయటపడలేదు. ఉగాది పర్వదినం ముగిసిన తర్వాత ఆలయం బయట పడడంతో ప్రజలు, భక్తులు హర్షం వక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. జలాశయంలో ప్రస్తుతం 836 అడుగులకు చేరుకుంది. అంటే జలాశయ సామర్థ్యం 60 టీఎంసీలకు చేరుకుంది. దీంతో సంగమేశ్వర ఆలయం పూర్తిగా బయటపడింది. ఆలయంలో పేరుకుపోయిన వరద నీటితో పాటు బురదను ఆదివారం పారిశుధ్య కార్మికులు తొలగించే పనులు చేపట్టారు. ప్రాచీన ప్రధాన ఆలయ ఆవరణ ప్రాంతాలను నది శుద్ధ జలాలతో పరిశుభ్రం చేశారు. ఆలయం లోపలి భాగంలో ఉన్న వరద నీటిని ట్రాక్టర్ ఇంజన్ ద్వారా బయలకు తరలించారు.

అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న బురదను కార్మికులు తొలగించారు. ధర్మరాజు ప్రతిష్టించిన వేపదారు లింగాన్ని కూడా నది జలాలతో శుద్ధీకరించారు. ఇక నేటి నుంచి సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు.