ArticlesNews

పిచ్చుకల సంరక్షణ కోసం ఒక్క నగరంలోనే 2000 గూళ్లు ఏర్పాటు-

83views

వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో పక్షుల కిలకిలరావాలు వినిపించట్లేదు. తరచూ కనిపించే చిన్న చిన్న పక్షులు, కాకులు, పిచ్చుకలు సైతం కనుమరుగు అయిపోతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, అధిక ఉష్టోగ్రతల, రేడియేషన్‌ కారణంగా పక్షుల మనుగడ ఇబ్బంది అవుతోంది. ఈ క్రమంలో పిచ్చుకలను కాపాడేందుకు రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ చేపట్టిన ప్రచారం మంచి ఫలితాలనిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె చేపట్టిన ప్రచారం ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.

2వేల పిచ్చుక గూళ్లు ఏర్పాటు
రాజస్థాన్‌లోని భరత్‌పుర్ పట్టణ ప్రాంతంలో కనుమరుగైన పిచ్చుకల కిలకిలరావాలు ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి. ఇక్కడ ‘పిచ్చుకకు ఒక ఇల్లు, మనకు ఒక ఇల్లు’ అనే సందేశంతో ప్రారంభమైన ఒక చిన్న ప్రయత్నం, నేడు పెద్ద ప్రచారంగా మారింది. దీంతో కేవలం మూడేళ్ల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 20,000కు పైగా పిచ్చుక గూళ్లు ఏర్పాటయ్యాయి. అలాగే ఒక్క భరత్‌పూర్ నగరంలోనే 2,000కు పైగా పిచ్చుక గూళ్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు గౌరయ్యా బగీచీ (పిచ్చుకల తోట) వంటి వినూత్న ప్రయోగాలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

మూడేళ్ల క్రితం ప్రచారం ప్రారంభం
పిచ్చుకల సంరక్షణ కోసం పనిచేస్తున్న కవితా సింగ్ సుమారు మూడేళ్ల క్రితం ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు ప్రతి ఇంటా, ప్రతి పెరట్లోనూ సాధారణంగా కనిపించే పిచ్చుకలు అకస్మాత్తుగా కనుమరుగయ్యాయని కవితా సింగ్ పేర్కొన్నారు. ఈ ఆందోళనే పిచ్చుల సంరక్షణ ప్రచారాన్ని తాను ప్రారంభించడానికి ప్రేరణగా నిలిచిందన్నారు.

తన ఇంట్లో 11 పిచ్చుక గూళ్ల ఏర్పాటు
కవితా సింగ్ తన ఇంటి నుంచే ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. మొదట్లో 11 గూళ్లను తన ఇంట్లో ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో ఆ పరిసరాల్లో ఎక్కడా పిచ్చుకలు లేవు. అయినప్పటికీ ఆ గూళ్లను ఏర్పాటు చేసిన నిమిషాల వ్యవధిలోనే పిచ్చుకలు అక్కడికి చేరుకున్నాయి. అప్పుడు పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోలేదని కవిత గ్రహించారు. వాటికి సురక్షితమైన ఆశ్రయం అవసరమని భావించారు. తదనంతరం ఆమె ఈ ప్రచారాన్ని నగరమంతటా విస్తరించారు.

భరత్‌పుర్‌లోని మహారాణి శ్రీ జయ కళాశాల ప్రాంగణంలోని హనుమాన్ ఆలయంలో మూడేళ్ల క్రితం ఈ ప్రచారం ప్రారంభమైందని కవితా సింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో పిచ్చుకల సంఖ్య భారీగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. “గతంలో పిచ్చుకలు సీలింగ్ ఫ్యాన్ల చుట్టూ ఉండే తీగ జాలీలలో గూళ్లను నిర్మించుకునేవి. అయితే వేసవి నెలల్లో ఫ్యాన్లను ఆన్ చేసినప్పుడల్లా గూళ్లలోని గుడ్లు కింద పడిపోయేవి. అంతేకాకుండా అనేక సందర్భాల్లో పిచ్చుకలు ఫ్యాన్ రెక్కలకు తగిలి చనిపోయేవి. ఈ తీవ్రమైన సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రదేశంలో పిచ్చుకల గూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ” అని కవిత్ సింగ్ స్పష్టం చేశారు.

కళాశాల ప్రాంగణంలోనే పిచ్చుకల కోసం ఒక ప్రత్యేకమైన కాలనీని అభివృద్ధి చేశారు. అక్కడ ఇప్పటికి వరకు 100కి పైగా పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గూళ్లన్నీ పిచ్చుకలతో నిండిపోయాయి. ఆ ప్రాంతంలో పిచ్చుకల సందడి నెలకొంది. ఈ ప్రచారం ఊపందుకున్న కొద్దీ నివాస కాలనీల అంతటా కృత్రిమ పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు భరత్‌పుర్ అంతటా 2,000కు పైగా పిచ్చుకల గూళ్లు ఏర్పాటు చేశారు. దీంతో పక్షులు వాటిలో సేదతీరుతున్నాయి. అలాగే పిచ్చుల సంరక్షణ కోసం కవితా సింగ్, ఆమె బృందం ‘గౌరయ్యా బగీచీ’ (పిచ్చుకల తోట) అనే ఒక ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. అక్కడ పొదల్లాంటి వృక్షసంపద, బొగన్‌విల్లా, నిమ్మ, బెర్రీ వంటి పండ్ల చెట్లు, 100కు పైగా పక్షుల గూళ్లు ఉన్నాయి. ఈ తోట పిచ్చుకలకు అనుకూలమైన సహజ పర్యావరణ వ్యవస్థను పునర్ సృష్టించింది