News

మీన మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల

87views

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు మీన మాస పూజల కోసం తెరుచుకున్నాయి. మార్చి 14(శనివారం) సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు ఈడీ ప్రసాద్ గర్భగుడిని తెరిచి దీపాన్ని వెలిగించారు. అనంతరం పవిత్రమైన 18 మెట్ల దిగువనున్న ఆజి వద్ద అగ్నిని వెలిగించారు. ఇక మొదటి రోజు అనగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. కలభాభిషేకం, పడి పూజలు ప్రారంభమయ్యాయి.

మార్చి 15 నుంచి భక్తులకు దర్శనం
మార్చి 15 (ఆదివారం) ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా కలభాషికేకం, పడిపూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మీనం నెల పూజలు పూర్తయ్యాక మార్చి 19 రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.

మార్చి 23 నుంచి వార్షిక ఉత్సవాలు
మార్చి 22 సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని మళ్లీ తెరిచి శబరిమల వార్షిక ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభిస్తారు. మార్చి 23న జరిగే కొడియేట్టు (ధ్వజారోహణం)తో ఉత్సవాలు అధికారికంగా ప్రాంభమవుతాయి. మార్చి 31న రాత్రి సారంకుథి వద్ద సంప్రదాయ పల్లివెట్ట కార్యక్రమం జరుగుతుంది. ఏప్రిల్‌ 1న పంబా నది వద్ద జరిగే ఆరట్టు మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆరట్టు అనంతరం పంబా గణపతి ఆలయంలో స్వామి విగ్రహం ముందు భక్తులు నేరుగా నైవేద్యాలు సమర్పించే అరుదైన అవకాశం లభిస్తుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు సన్నిధానం నుంచి ఊరేగింపు బయలుదేరి, తిరిగి వచ్చాక రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.

ప్రతిరోజు ప్రత్యేక పూజలు
మార్చి 23 నుంచి ఆలయంలో ప్రతిరోజూ శ్రీభూతబలి, ఉత్సవబలి వంటి ముఖ్యమైన పూజలు నిర్వహిస్తారు. భక్తులు నెయ్యాభిషేకం, అష్టాభిషేకం, పుష్పాభిషేకం, కలభాభిషేకం వంటి సేవల్లో పాల్గొనవచ్చు. సాయంత్రం దీపారాధన, అథాజపూజ తర్వాత దేవుడిని సాంప్రదాయ వాద్యాలతో శ్రీబలి ఊరేగింపుగా తీసుకెళ్తారు.