
అయోధ్యలోని రామమందిరాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించారు. బంగారు పూత పూసిన 150 కిలోల ‘శ్రీ రామ యంత్రం’ ఫలకాన్ని ముర్ము ప్రతిష్ఠించారు. వేద గణితం ఆధారంగా రూపొందించిన ఈ యంత్రం సానుకూల ఆధ్యాత్మిక శక్తికి, శ్రీరాముడి పవిత్ర సన్నిధికి చిహ్నంగా నిలుస్తుందని ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర తెలిపారు. కంచి కామకోటి పీఠాన్ని నమూనాగా చేసుకొని, స్వామి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యంత్రాన్ని రూపొందించారని వెల్లడించారు.
రాష్ట్రపతి ప్రతిష్టించిన శ్రీరామ్ యంత్రం ఏమిటి?
తమిళనాడులోని కాంచీపురంలో ఒక మఠంలో ఈ రామ యంత్రాన్ని తయారు చేశారు. ఆ తర్వాత దానిని అక్కడ నుంచి తిరుపతికి తీసుకువచ్చారు. అనంతరం 10 రోజుల క్రితం రథయాత్ర ద్వారా దానిని అయోధ్యకు తరలించారు. రామ యంత్రం బరువు 150 కిలోగ్రాములు. దీనికి బంగారు పూత పూశారు. అయోధ్యలోని పండితులు చెప్పినదాని ప్రకారం..
రామ యంత్రం ఒక ప్రత్యేకమైన వైదిక జ్యామితీయ నిర్మాణం. ఇది మంత్రాలు, చిహ్నాల ద్వారా శ్రీరాముని .. ఇతర దేవతల దైవిక శక్తిని నిక్షిప్తం చేస్తుంది. దీనిని అత్యంత పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు.
రామ జన్మభూమిపై అడుగుపెట్టడం ఒక అదృష్టం..
అయోధ్యలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ “శ్రీరాముడు అయోధ్యలో జన్మించారు. ఈ పవిత్ర భూమిపై అడుగుపెట్టడం నాకు దక్కిన ఒక గొప్ప అవకాశం. శ్రీరాముడు తన జన్మస్థలాన్ని స్వర్గం కంటే గొప్పదిగా వర్ణించారు. అయోధ్య నగరం రామ భక్తులందరికీ కూడా అత్యంత ప్రియమైనది.” అన్నారు.
రామాయణంలో తులసీదాస్ ఊహించిన విధంగా దేశం రామరాజ్యం దిశగా ముందుకు సాగుతోందాని రాష్ట్రపతి అన్నారు. శ్రీ భగవానుడి ఆశీస్సులతో రామ మందిరానికి ఆదరణ పెరుగుతోంది. మన దేశ ప్రజలందరిపై భగవంతుడు తన ఆశీస్సులను కొనసాగించాలని నేను ప్రార్థిస్తున్నాను అని ఆమె పేర్కొన్నారు.





