
నిషేధిత ఐసిస్ మాడ్యుల్ తో సంబంధమున్న 19 ఏళ్ల వైద్య విద్యార్థి హారీష్ అలీ అరెస్టయ్యాడు. తాము అరెస్ట్ చేశామని యూపీ ఏటీఎస్ ధ్రువీకరించింది. నిషేధిత ఐసిస్ ఆన్ లైన్ కార్యకలాపాలపై కొన్ని రోజులుగా యూపీ ఏటీఎస్ నిఘా పెట్టింది. ఇందులో భాగంగా దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సహారన్ పూర్ జిల్లాకి చెందిన హారీష్ అలీని మొరాదాబాద్ లో అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే ఐసిస్ ఆన్ లైన్ కార్యకలాపాలపై ఏటీఎస్ నిఘాను మరింత తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలోనే బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న అలీపై కూడా ఇవే రకమైన ఆరోపణలు వచ్చాయి.
ఐసిస్ కి సంబంధించిన అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ తో, ఐసిస్ హ్యాండ్లర్లతో, సానుభూతిపరులతో సంబంధాలున్నట్లు తేలింది.దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
యూపీతో పాటు పలు ప్రాంతాలలో ఐసిస్ సానుభూతిపరులు సోషల్ మీడియా వేదికగా బలోపేతం అయ్యేందుకు వ్యూహాలు వేసినట్లు, వారి భావజాలాన్ని ఆన్ లైన్ ద్వారా వ్యాప్తి చేసేందుకు పలు గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి.
అందులో భాగంగానే ఐసిస్ సానుభూతిపరులు మారుపేర్లతో వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ లను ఉపయోగించి ఆన్ లైన్ గ్రూపులను ఏర్పాటు చేసి, వ్యక్తులను నియమించడంతో పాటు, ఐసిస్ భావజాల వ్యాప్తి, ప్రచారం చేస్తున్నట్లు కూడా గుర్తించారు.
ఇక.. హారీష్ ఆలీ ‘‘అల్ ఇత్తిహాద్ మీడియా ఫౌండేషన్’’ అనే పేరుతో ప్రత్యేక సంస్థను నడుపుతూ భారత్ తో పాటు వివిధ దేశాలలో వున్న ఐసిస్ నెట్ వర్కులకు చెందిన వారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడని తేలింది.
ఇస్లామిక్ ఉగ్రవాద చట్రంలోకి విద్యావంతులు…
ఇస్లామిక్ ఉగ్రవాద చట్రంలోకి ముస్లిం విద్యావంతులు కూడా చేరిపోతున్నారు. తాజాగా కొన్ని నెలల క్రితం అంటే గత యేడాది నవంబర్ 10 న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర బాంబు బ్లాస్ట్ జరిగింది. అందులో 13 మంది మరణించగా.. .20 మందికి పైగా గాయపడ్డారు. ఈ బాంబు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులందరూ హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న వారిగా తేలింది.
అంతేకాకుండా కారు నడిపిన బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు గుర్తించారు. అలాగే ఇదే కేసుతో సంబంధం వున్న డాక్టర్ షాహీన్ సయీద్, డాక్టర్ ఇదిల్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే… ఈ పేలుళ్ల కుట్ర అంతా అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగానే జరిగింది.





