ArticlesNews

వర్ష ప్రతిపద దాని చారిత్రిక ప్రాముఖ్యత

65views

( వర్షప్రతిపాద ప్రత్యేకం )

భారతీయ పంచాంగం చైత్రశుక్లపాడ్యమితో మొదలవుతుంది. పాడ్యమిని ప్రతిపత్ అనిపిలుస్తారు. అంటే ముందడుగని అర్ధం. తిరుగులేని శాస్త్రీయ కాలగణన, గ్రహస్థితిగతులు, ఋతువుల ఆగమనం మొదలైన వాటి ఆధారంగా ఈ పంచాంగం తయారైంది. ఇస్లాం, క్రైస్తవంలాగా దేవుడికీ, మతానికి సంబంధంలేని ఈ పంచాంగాన్ని కొన్నివేల ఏళ్ళ నుండి, వివిధ రాష్ట్రాలలో, వివిధ పేర్లతో భారతీయులు పండుగగా జరుపుకుంటున్నారు. వేలాది యేళ్ళుగా సాంస్కృతికంగా దేశం మొత్తం ఐక్యంగా ఉందనడానికి ఇదే ప్రబలసాక్ష్యం.

చారిత్రకంగానూ యుగాది రోజున మనకెన్నో విశేషాలున్నాయి. బ్రహ్మపురాణం ప్రకారం చైత్రశుద్ధపాడ్యమినాడే సృష్టిమొదలైంది. శ్రీరామపట్టాభిషేకం జరిగింది ఈరోజే. శక్తి అంటే అమ్మవారి పై భక్తిని ప్రదర్శించే వసంత నవరాత్రులు మొదలయ్యేది కూడా అదే రోజు. శకులు, హూణులను ఓడించిన విక్రమాదిత్య మహారాజు పేరుతో విక్రమశకం మొదలైంది. సిక్కుధర్మంలోని రెండోగురువైన శ్రీ అంగద్ దేవ్ పుట్టినరోజు కూడా అదే. ఆర్యసమాజ్ ఉద్యమానికి స్వామి దయానంద సరస్వతి శ్రీకారం చుట్టిన రోజది. భగవాన్ జులెలాల్ అవతరించిన రోజిదే. ఈ రోజునే ధర్మరాజు రాజ్యపాలన మొదలుపెట్టాడు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వ్యవస్థాపకులు శ్రీ కేశవ బలిరామ్ హెడ్గేవార్ పుట్టిందీ అదేరోజు.

మానవచరిత్రలో అత్యంతప్రాచీన వాఙ్మయమైన ఋగ్వేదంలో వసంతం, శరత్, హేమంతమనే మూడు ఋతువులున్నాయని, సూర్యుని ఆధారంగానే ఋతుమార్పులు జరుగుతున్నాయని, కాలగణనలో అయిదు అంగాలున్నాయని, అందుకే దానిని పంచాంగమని పిలుస్తామని చెప్పింది.

రాజుపట్టాభిషేకంతో శకులు ఏడాదిని మొదలుపెడితే, 1200 సంవత్సరాల తర్వాత చంద్రగమనం ఆధారంగా ముస్లిములు హిజ్రీకాలెండర్ ను ప్రారంభించారు. పాలనాసౌలభ్యం కోసం బ్రిటిష్ వాడు రోమన్ కాలెండర్ ను ప్రవేశపెట్టాడు. ఇంగ్లీష్ చదువులపుణ్యమాని అది మరింతవిస్తరించి. క్రమేణా మనజీవితంలో భాగమయ్యింది.

స్వాతంత్య్రానంతరం ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. మేఘనాథ్ షా ఆధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కాలెండర్ సంస్కరణల కమిటీ, తనరిపోర్ట్ ను 1952 నాటి సైన్స్ అండ్ కల్చర్ పత్రికలో ప్రచురించింది. దానిప్రకారం రోమన్ కాలెండర్, క్రిస్టియానిటీతో ఏమాత్రం సంబంధంలేని మధ్యస్థ గిరిజనజీవితాలకు చెందినది. జీసస్ మరణించిన 530 సంవత్సరాలతర్వాత క్రిస్టియన్ నాయకులు డిసెంబర్25ను ఆయన పుట్టినరోజుగా నిర్ణయించారు. 1572లో పోప్ గ్రెగొరీ అక్టోబర్ 5 ను 15గా పరిగణించడం ద్వారా ఈ కాలెండర్‌ను పదిరోజులు వాయిదావేశాడు. రెండుదశాబ్దాల తర్వాత 1775లో బ్రిటన్ దానిని ఆమోదించింది. ఖగోళశాస్త్రంతో, ఋతువు ల మార్పులతో ఏమాత్రం సంబంధంలేని అశాస్త్రీయ రోమన్ కాలెండర్ ను పక్కనపెట్టి, విక్రమశకాన్నే అధికారిక కాలెండర్ గా పరిగణించాలని ఆ కమిటీ ఆమోదముద్ర వేసింది. అయితే బ్రిటిష్ వాడి వ్యామోహంలోఉన్న అప్పటిప్రభుత్వం దీన్ని పక్కనపెట్టి, 1957లో రోమన్ కాలెండర్‌నే కొనసాగించింది.

ఇంగ్లీష్ కాలెండర్ గురించి సమగ్రంగా వివరించిన చిన్నపిల్లల బ్రిటానికాపుస్తకం, దానిలో అనేక లోపాలు న్నాయని, భవిష్యత్తులో వాటిని సరిచేయాలని తేల్చిచెప్పింది. చంద్రగమనంప్రకారం నెలనుప్రారంభించే ఈ కాలెండర్, తద్విరుద్ధంగా సూర్యగమనం ప్రకారం ఏడాదిని మొదలుపెడుతుంది. క్రిస్టియానిటీ ప్రకారం మానవ చరిత్రలోనే అత్యంతవిశిష్టమైనది క్రీస్తుపుట్టుక. అందువల్లే, ఆయనకు ముందు, ఆయన హయాం అని అది కాలాన్ని విభజించింది. క్రీస్తు చనిపోయిన 753 ఏళ్ళతర్వాత ఇది అమల్లోకి వచ్చింది. హేతుబద్ధతలేకుండా నుమాపొంపిలిస్ అనేరాజు, జూలియస్ సీజర్ కొన్ని మార్పులు చేశారు. ఇన్ని వైరుధ్యాలతోకూడిన రోమన్ కాలెండర్ పూర్తిగా అశాస్త్రీయం, తప్పుడు లెక్కలతో లోపాలపుట్టగా మిగిలింది.