News

దశాబ్దాల తర్వాత గుడిమల్లం మహాకుంభాభిషేకానికి శ్రీకారం

142views

ఏకశిల్పంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరి దేశంలోనే మొట్టమొదటి పురాతన ఆలయమైన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో  గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయం దశాబ్దాల తర్వాత మహాకుంభాభిషేకానికి సిద్ధమైంది. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో ఆలయ నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తుండగా పల్లవ, చోళ, విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. అయితే అప్పట్లో ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించగా తర్వాత కాలంలో ఎలాంటి క్రతువులు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయంపై ప్రత్యేక దృష్టిసారించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అభివృద్ధితో ఆలయానికి మహర్దశ

ఆలయం పురావస్తుశాఖ పరిధిలో ఉండటంతో శాసనాలు, చరిత్ర దెబ్బతినకుండా పరిరక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే శతాబ్ధాలుగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడంతో చిన్నపాటి వర్షానికే ఆలయ పైకప్పు నుంచి నీరు గోడలు వెంట కారుతోంది. దీంతో పాటు గోపురాలు కళాహీనంగా మారాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షలతో పైకప్పు పనులు చేపట్టారు. అప్పట్లో చేసిన విధంగానే కరక్కాయ, సున్నం, బెల్లం మిశ్రమాన్ని వినియోగిస్తూ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లభించడంతో చాలా కాలం నాటి కల నేరవేరనుంది. ఆలయానికి మహర్దశ పట్టనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

దాతలకు భాగస్వామ్యం

ఏప్రిల్‌ 19 నుంచి 23వరకు ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు దక్షిణాది పీఠాధిపతులు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న స్వామి, అమ్మవార్లకు బాలాలయం ఏర్పాటు చేశారు. గర్భగుడిలో దర్శనాలు నిలిపివేశారు. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ నుంచి రూ.30 లక్షలు కేటాయిస్తామని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన దాతల నుంచి రూ.కోటి మొత్తాన్ని విరాళంగా సేకరించి వైభవంగా మహాకుంభాభిషేకం నిర్వహించి ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పాలకవర్గం సంకల్పించింది.

ప్రముఖులకు ఆహ్వానం

ఐదు రోజుల పాటు నిర్వహించే మహాకుంభాభిషేకానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే కంచి, శృంగేరి, సరస్వతి పీఠాధిపతులను కలిశాం. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను భాగస్వాములగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. దేవుడి ఇచ్చిన వరంగా భావించి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం.-గిరినాయుడు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌