
నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహాకవి తిక్కన విగ్రహావిష్కరణ సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు శ్రీ పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని విగ్రహావిష్కరణ గావించారు.

13వ శతాబ్దంలో నెల్లూరును ఏలిన మనుమసిద్ధి కోరిక మేరకు ఆయన ఆస్థానంలో మంత్రి గాను, ఆస్థాన పండితుడుగాను ఉండిన శ్రీ తిక్కన సోమయాజులు భారతంలోని అత్యధిక భాగాన్ని పదిహేను పర్వాలు (విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు) ఆంధ్రీకరించారు. ఆయన నెల్లూరు సమీపంలోని పాటూరు గ్రామ నివాసి. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఆవరణలో ఆయన గ్రంధ రచన చేశారు. అందుకు గుర్తుగా అక్కడ ఒక గది ఉండేది. అందులోనే కవిత్రయంలో ఒకరైన తిక్కన ఆంధ్ర మహాభారత రచన చేశారని పెద్దలు చెబుతూ ఉండేవారు. కొన్నాళ్లపాటు ఆ గదిని దేవస్థానం స్టోర్ రూమ్ గా కూడా వాడిన పరిస్థితి ఉంది. కాలక్రమంలో ఆ గది శిధిలావస్థకు చేరుకుంది. ఆ దుస్థితిని గమనించిన అప్పటి దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీ మంచిగంటి సుధాకర్ నెల్లూరు, తిరుపతి, విజయవాడలోని శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలైన శ్రీ బయ్యా వాసు, శ్రీ బయ్యా రవిలను ఆ శిధిల మందిర జీర్ణోర్ధరణకు పూనుకోవలసిందిగా అభ్యర్థించారు.

బయ్యా సోదరులు సుధాకర్ గారి అభ్యర్థనను మన్నించి తమ తండ్రి గారు స్వర్గీయ బయ్యా వెంకట రమణయ్య స్మృత్యర్థం తాము నెలకొల్పి ఉన్న శ్రీ బయ్యా వెంకట రమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని VR Constructions ఇంజనీర్ శ్రీ శ్రీనివాస్ పర్యవేక్షణలో రాజమండ్రికి చెందిన ప్రముఖ శిల్పి శ్రీ రాజ కుమార్ వడయార్ చే శిల్ప రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.

శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఆవరణలో అంగరంగ వైభవంగా నేడు విగ్రహావిష్కరణ సభ జరిగింది. విగ్రహావిష్కరణ చేయడానికి మంత్రివర్యులు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. ఆత్మీయ అతిధులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్, వైయస్సార్సీపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీ రూప్ కుమార్ యాదవ్, బిజెపి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ భరత్ కుమార్ యాదవ్ లు విచ్చేశారు.

అలాగే ఆర్ ఎస్ ఎస్ సహ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య, విభాగ్ సంఘచాలక్ శ్రీ హరి కుమార్ రెడ్డి, జిల్లా సంఘచాలక్ శ్రీ బాలు సుబ్బారావు, 25 కళా సంఘాల అధినేత శ్రీ అమరావతి కృష్ణారెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ మంచికంటి సుధాకర్, దేవస్థాన కమిటీ మాజీ సభ్యులు శ్రీ వెంకటేష్, దేవస్థాన పాలకమండలి ప్రస్తుత చైర్మన్ శ్రీ కోట గురుబ్రహ్మం, ప్రస్తుత కమిటీ సభ్యులు శ్రీ రమణయ్య, దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు, తిక్కన వంశీయుడైన శ్రీ రామకృష్ణ, పలువురు పుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీ, బిజెపి కార్యకర్తలు, అభిమానులు, పుర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





