
‘వసుధైక కుటుంబం అనే ఉన్నతమైన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే దేశం మనది. సమస్త జీవకోటి, వన్యప్రాణులు ఇందులో అంతర్భాగం. మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యం. దీనిని దృష్టిలో పెట్టుకొనే అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్ (హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్) ముందుకు తీసుకొచ్చామ’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వన్య ప్రాణుల వల్ల పంట, పశు సంపదకి నష్టంతోపాటు మావన భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్నందున ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం ఉదయం హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అ ప్రారంభించారు. వీటిలో వన్య ప్రాణుల సంరక్షణతోపాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అంబులెన్స్, రెస్క్యూ వాహనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “హనుమాన్ ప్రాజెక్ట్ మానవ-వన్యప్రాణి మధ్య ఉన్న సంఘర్షణను నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకువెళ్లబోతున్నాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ చేపట్టేలా హనుమాన్ ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు తక్షణ ప్రతిస్పందన, ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వర్తిస్తుంది. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతోపాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అటవీశాఖ హనుమాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది.
గ్రామ స్థాయిలో ‘వజ్ర’ బృందాలను సిద్ధం చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా తీసుకొచ్చిన ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించాం. అందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు కాగా, మరో 7 వాహనాలు వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అవసరమైన అంబులెన్స్ లు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లుటిల్లో నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు, 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉంచాం. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్ (గిరిజన), పారా వెటరేనియన్స్ తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్య జీవి రక్షక్ (వజ్ర)లను అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తున్నాం. గ్రామ స్థాయిలో పాములు, ఇతర జంతువుల నుంచి ఎదురయ్యే సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇచ్చాం.
100కు పైగా హనుమాన్ వాహనాలకు ప్రారంభోత్సవం
పూర్తి అధునాతన సాంకేతికతతో రూపొందించిన 100కు పైగా హనుమాన్ వాహనాలను పవన్ కళ్యాణ్ గారు జెండా ఊపి ప్రారంభించారు. అందులో 19 ర్యాపిడ్ రిలీఫ్ రెస్పాన్స్ వాహనాలు ఉన్నాయి. వన్యప్రాణులు గాయపడిన సందర్భాల్లో వాటిని తరలించేందుకు వీలుగా పూర్తి స్థాయి సౌకర్యాలతో వీటిని సిద్ధం చేశారు. వీటితోపాటు స్పాట్ లో చికిత్స అందించేందుకు వీలుగా ఆంబులెన్స్ లు, కాంపా వాహనాలు ఉన్నాయి. హనుమాన్ డిజిటల్ యాప్, అధునాతన సాంకేతికతతో అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జి.పి.ఎస్. ట్రాకింగ్ సిస్టంను ప్రారంభించారు. మొదట ర్యాపిడ్ రిలీఫ్ రెస్పాన్స్ వాహనాలు, హనుమాన్ ఆంబులెన్స్ లను పరిశీలించి సౌకర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ పరిధిలో సంచరించే వన్యప్రాణులు వివరాలు, సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, రెస్క్యూ ఆపరేషన్స్ లో వినియోగించే కిట్లు, జనావాసాల్లోకి వచ్చిన పులులు లాంటి వన్య మృగాలను బంధించే బోన్లు, అటవీశాఖ పరిధిలో పెరిగే ఔషదాల మొక్కలు, ఉత్పత్తుల వివరాలను అధికారులు, ఎన్జీవోలు గ్యాలరీల రూపంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఈస్ట్రన్ ఘాట్స్ లో సంచరించే కింగ్ కోబ్రా తదితర పాముల వివరాలు తెలియజేస్తూ ఇచ్చిన ప్రజంటేషన్ ఆకట్టుకుంది.





