ArticlesNews

‘జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి’

49views

( ఫాల్గుణ శుద్ధపూర్ణిమ – లక్ష్మీ జయంతి )

సంపదకి, సౌభాగ్యానికి, శక్తికి, సౌందర్యానికి ప్రతీక లక్ష్మీదేవి. జగన్నాథుడైన శ్రీమహావిష్ణువుకి దేవేరిగా ఆమె జగన్మాత. భక్తుల కష్టాలకు కరిగి కనకధార కురిపించే కరుణామయి. పాలసముద్రంలో సిరులతల్లి అవతరించిన ఫాల్గుణ శుద్ధపూర్ణిమను లక్ష్మీ జయంతిగా ఆచరించడం సంప్రదాయం.

జీవితంలో లాభం, సంపద, అభివృద్ధి, క్షేమం, యోగం- అన్నీ లక్ష్మీ స్వరూపాలేనన్నది రుగ్వేద వాక్యం. వాటిలో ఏది ప్రాప్తించినా, స్వార్జితమని అహంకరించకూడదు, అమ్మవారి అనుగ్రహంగా భావించాలని వేదం చెబుతోంది. ఆధ్యాత్మిక విద్యకు అధిష్ఠాన దేవత లక్ష్మీదేవేనని పేర్కొని.. ‘ఓ జగదేకమాతా! అజ్ఞానమనే చీకటిని పారదోలే జ్ఞాన ప్రకాశినివి నువ్వు! ఆ అనంత తేజస్సులో ఒక్క కళనైనా నాలో ప్రవేశపెట్టు తల్లీ!’ అని ప్రార్థించమంటోంది అథర్వణ వేదం. లక్ష్మీదేవి ప్రసాదించే ఆ ప్రకాశంతో అనంత ఐశ్వర్యాలు, జ్ఞానసంపద ప్రాప్తిస్తాయని తెలియజేసింది.

అష్టలక్ష్ములుగా అనుగ్రహిస్తూ…
శ్రీమహావిష్ణువు దశ అవతారాలు దాల్చి భక్తులను ఆదుకున్నట్లే శ్రీలక్ష్మి ఎనిమిది రూపాలు ధరించి ఆశ్రితులను అనుగ్రహించింది. ఆదిలక్ష్మిగా ప్రాణశక్తిని, ధాన్యలక్ష్మిగా పుష్కలమైన ఆహార ధాన్యాల్ని, ధైర్యలక్ష్మిగా ధీరత్వాన్ని, గజలక్ష్మిగా పేరుప్రతిష్ఠలను, సంతానలక్ష్మిగా సత్‌ సంతానాన్ని, విజయలక్ష్మిగా సత్కార్యసిద్ధిని, విద్యాలక్ష్మిగా జ్ఞానసంపదను, ధనలక్ష్మిగా సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. శ్రీలక్ష్మి నాలుగు హస్తాలు మానవుడికి నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ప్రసాదిస్తాయి. ‘శుద్ధలక్ష్మి’ అని కూడా ఆ అమ్మను కీర్తిస్తారు. శుచిశుభ్రత నెలకొన్న ఇళ్లు లక్ష్మికి ఆలవాలం. పరుల శ్రేయస్సు కోరేవారిని, శాంతస్వభావులని, ఇంద్రియనిగ్రహం కలిగినవారిని, పరోపకారుల్ని, అతిథులను ఆదరించేవారిని, కాలం వృథాపరచక సద్వినియోగం చేసుకునేవారిని, కృతజ్ఞతగా ఉండేవారిని, కార్యాల్లో సమర్థత చూపేవారిని.. ఎన్నడూ విడిచిపెట్టనని రుక్మిణీదేవికి మహాలక్ష్మి స్పష్టం చేసిందని పురాణకథనం. లక్ష్మి ఎక్కడ కొలువై ఉంటుందని ధర్మరాజు ప్రశ్నించగా.. ‘సత్యం, దానం, వ్రతాలు, జలం, అగ్ని, వాయువు, పచ్చని పొలాలు, గోవు, ఏనుగు కుంభస్థలం, ఇంటిగడప, ఇల్లాలి నుదుటి సిందూరం, అతిథులను సత్కరించే ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది’ అని వివరించాడు భీష్ముడు.

అవతారాల్లో ఆ స్వామి వెంట..
శ్రీమన్నారాయణునితో పాటు లక్ష్మీదేవి కనిపించిన మొదటి అవతారం నరసింహావతారమని పండితుల భావన. మీన, కూర్మ, వరాహావతారాల్లో అమ్మవారి ప్రసక్తి ఉండదు. క్షీరసాగర మథనంలో కూర్మావతారం మందరగిరిని పైకెత్తటానికి వచ్చింది. ఆ వెంటనే పాలసముద్రం నుంచి జనించిన లక్ష్మిని శ్రీమహావిష్ణువు స్వీకరించాడు. ఆ తరువాతి అవతారంలో వరాహుడు భూదేవిని తన దేవిగా చేసుకున్నాడు. నరసింహావతార సమయంలో ఆమె విడిగా అవతరించలేదు కానీ బ్రహ్మదేవుని కోరికపై స్వామిని శాంతింపజేసే ప్రయత్నం చేసింది. శ్రీరాముని అర్ధాంగి సీతాదేవి, శ్రీకృష్ణుని భార్య రుక్మిణి, పరశురాముని సతీమణి ధరణి లక్ష్మీదేవి ప్రతిరూపాలే. జగన్నాథుడు ఆదిత్యుడి రూపం దాల్చినప్పుడు అమ్మవారు పద్మం రూపంలో ఆవిర్భవించింది. విష్ణువు పృథుచక్రవర్తిగా అవతరించినప్పుడు ఆ అమ్మ ‘అర్చి’గా జన్మించింది. రుషభుని రూపంలోనున్న స్వామికి జయంతిగా వెంట వచ్చింది. ఇలా సందర్భానుసారం పాలసముద్రం, అగ్ని, జలం, బిల్వవృక్షం, భూమి నుంచి శ్రీమహాలక్ష్మి అవతారాలు దాల్చింది.

కొల్హాపుర్‌లో కొలువైన తల్లి..
మహారాష్ట్ర కొల్హాపుర్‌లోని మహాలక్ష్మి ఆలయం అత్యంత ప్రసిద్ధమైంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇదొకటి. స్థలపురాణం ప్రకారం ఒకసారి శ్రీమహాలక్ష్మి విష్ణుమూర్తిపై అలిగింది. ఆ అలకతో వైకుంఠం వదిలి, భూలోకాన కొల్హాపుర్‌ విచ్చేసింది. ఆ పవిత్ర స్థలంలోని మహాలక్ష్మి కోవెలలో విగ్రహాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడని చెబుతారు.
స్త్రీలలో శ్రీలక్ష్మి..

భూలోకంలో లక్ష్మీదేవి ప్రతి స్త్రీలోనూ కొలువై ఉంటుందని మన పురాణాలు పేర్కొన్నాయి. మహిళలను గౌరవించే చోటే లక్ష్మీదేవి ప్రసన్నంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. మగువలను అవమానిస్తే లక్ష్మి ఆగ్రహిస్తుందని, ఆ ఇంట అశాంతి, దారిద్య్రం తాండవిస్తాయని హెచ్చరించాయి. అలాగే గోవును రక్షించే, సత్యనిష్ఠతో ధర్మబద్ధంగా జీవించేవారి లోగిళ్లలో లక్ష్మి నివాసం ఉంటుందని శాస్త్రాలు స్పష్టం చేశాయి. నవగ్రహాల్లో శుక్రగ్రహం శాంతించి మనకు అనుకూలంగా మారాలంటే మహాలక్ష్మిని పూజించాలని మహర్షులు సూచించారు.

మధురవాక్కూ మాధవి ఆరాధనే!
‘జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి’ అంటోంది మన సనాతన ధర్మం. నాలుక చివరన ఆ తల్లి కొలువై ఉంటుందని సూచిస్తోంది. పరుషంగా మాట్లాడేవారు ఆ అమ్మవారికి దూరమైపోతారు. మధురంగా సంభాషిస్తే ఆ దేవిని ఆరాధించినట్లే. దుర్భాషలాడినా, వ్యర్థంగా మాట్లాడినా ఆ దేవదేవికి అపచారం చేసినట్లే! అందుకే సాత్వికస్వభావులు, మృదువుగా మాట్లాడేవారు, హితమితప్రియవాక్కులు పలికేవారు ఆ సముద్ర తనయ ప్రియభక్తులు. ఇంతటి మహిమాన్విత అయిన మాధవిని లక్ష్మీజయంతి రోజున ‘జ్ఞానదాయైః బుద్ధిదాయైః సర్వదాయైః నమోనమః’ అని స్తుతిద్దాం! ఆ దేవి అనుగ్రహాన్ని పొందుదాం.
శ్రీశారద