
ఆపరేషన్ కగార్ తో నక్సలైట్లు కకావికలమయ్యారు. కొందరు హతమవ్వగా.. మరి కొందరు లొంగిపోయారు. దీంతో ప్రజలకు కూడా నక్సలైట్లు అంటే భయం పోతోంది. మరి కొన్ని చోట్ల వారిపై వున్న సానుభూతి, ప్రేమ కూడా బద్దలైపోతోంది. ఇన్నాళ్లూ నక్సలైట్లు తమను గుప్పిట్లో పెట్టుకున్నారని, కనీసం తమ గ్రామాలకు మౌలిక సదుపాయాలను కూడా రానివ్వలేదని మండిపడుతున్నారు.
ఎప్పుడైతే కగార్ ఆపరేషన్ తో నక్సలైట్లు భయపడి, లొంగిపోవడం, హతమవ్వడం ప్రారంభమైందో, ప్రజలు కూడా ఇన్నాళ్లూ వారిపై వున్న కోపాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఒడిశాలోని మల్కన్ గిరి గ్రామస్థులు మావోలు నిర్మించిన 20 అమర వీరుల స్థూపాలను కూల్చేశారు.
ఘన్‌బెడ, ఖజురిగుడతో సహా మారుమూల గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా మావోలు నిర్మించిన అమరవీరుల స్థూపాలను కూల్చేశారు. కలిమెల, మథిలి, ఖైర్ పుట్ తో పాటు మరి కొన్ని ప్రాంతాలలో కూడా ఇవే దృష్యాలు కనిపించాయి. ఈ అమర వీరుల స్థూపాలు నియంత్రణకు, బెదిరింపులకు చిహ్నాలని, అందుకే వాటిని కూల్చేశామని స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో వీటిని కూల్చేయడం ద్వారా ఇక.. తాము అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తామని చెప్పకనే చెప్పేశారు.
మల్కన్‌గిరిని ఒకప్పుడు ఒడిశాలో ప్రధాన మావోయిస్టుల స్థావరంగా పరిగణించేవారు. అయితే, తిరుగుబాటుదారుల నెట్‌వర్క్ బలహీనపడటంతో మావోలు బలహీనపడ్డారు. మావోయిస్టులు ప్రాథమిక అభివృద్ధి కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, ప్రజలను నిరంతరం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఇకపై తాము సాధారణ జీవితాన్ని, ఆర్థిక పురోగతిని కోరుకుంటున్నామని తెలిపారు.
కొన్ని సంవత్సరాలుగా జిల్లా పోలీసులు ప్రజల్లో చైతన్యం తేవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. సుపరిపాలన, ఇతరత్రా ప్రయత్నాల కారణంగా ప్రజలు ధైర్యవంతులుగా తయారయ్యారని పేర్కొంటున్నారు. నక్సల్స్ ప్రభావం నుంచి ప్రజలు బయటపడుతున్నారని కూడా తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రజలు సంఘర్షణను, మావోల ఆధిపత్యాన్ని వ్యతిరేకించే స్థాయికి వచ్చారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి వైపు మళ్లారని పేర్కొంటున్నారు.





